Operation Sindoor: ఎవరి పని వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తే అదే దేశభక్తి: ఎం. వెంకయ్యనాయుడు
ABN, Publish Date - Aug 03 , 2025 | 06:59 PM
పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం సాధించడం పట్ల మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ప్రశంసల వర్షం కురిపించారు.
ఎవరి పని వాళ్ళు చిత్తశుద్ధితో చేస్తే అదే దేశభక్తి అవుతుందని భారత మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ఏ దేశం మీద కావాలని దాడి చేయదని.. ఆత్మ రక్షణ కోసం మాత్రమే దాడి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం (ఆగస్ట్ 03) హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో అఖిల భారత రాష్ట్రీయ శిక్షక్ మహాసంఘ్ (ఏబీఆర్ఎమ్ఎస్) ఆధ్వర్యంలో ‘ఆపరేషన్ సింధూర్ సెల్యూటింగ్ అవర్ హీరోస్’ పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెహల్గాం దాడుల్లో అమరులైన వీరులను స్మరిస్తూ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ అకాడమీషియన్స్ ఈ కార్యక్రమం నిర్వహించడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న త్రివిధ దళాలకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
కేవలం 22 నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించడం.. ఈ ఆపరేషన్‌ని ముగించడం అద్భుతమని ఆయన అభివర్ణించారు. ఎ.బి.ఆర్.ఎస్.ఎం అనేది టీచర్స్ యూనియన్ అని.. అయినప్పటికీ ఈ సంస్థ దేశభక్తి కోసం చేస్తున్న కృషి అభినందనీయమ ప్రశంసించారు.
ఆపరేషన్ సిందుర్ కొత్త చరిత్రను సృష్టించిందని గుర్తు చేశారు. తాజాగా ఆపరేషన్ మహదేవ్ చేపట్టి పెహల్గాం ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టిందని వివరించారు. ఆపరేషన్ సింధూర్ కేవలం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడమేనని తెలిపారు.
సాధారణ పౌరులకు ప్రమాదం జరగకుండా ఈ ఆపరేషన్ చేపట్టడం త్రివిధ దళాల ప్రతిభకు నిదర్శనమని తెలిపారు. ఆపరేషన్ సిందుర్‌కు ప్రపంచంలోని చాలా దేశాలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు.
కేవలం మూడు దేశాలు మాత్రమే ఈ ఆపరేషన్‌ను వ్యతిరేకించాయన్నారు. పాకిస్తాన్ చేసే ఎదురు దాడులను భారత త్రివిధ దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని వివరించారు.
ఆపరేషన్ సిందుర్ ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్ట్‌కు ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. కొన్ని సంస్థలు కులం, మతం, భాష, వర్గాన్ని ఉపయోగించి గొడవలు సృష్టించేందుకు సిద్ధంగా ఉంటున్నాయంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నీరు, నింగి, నేల ప్రతి దానికి శక్తి ఉందని.. భారతదేశానికి పోరాడే శక్తి సైతం ఉందన్నారు.
భారత ప్రభుత్వం ఎప్పటికీ దేశ పౌరుల కోసం మాత్రమే పని చేస్తుందని.. ఇతర దేశాల ఒత్తిడికి ఏ మాత్రం లొంగదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌డీవో మాజీ చైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి, అనంత్ టెక్నాలజీస్ సీఎండీ సుబ్బారావు పావులూరి, ఏబీఆర్ఎంఎస్ నేషనల్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గుంతా లక్ష్మణ్, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ ప్రీతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీవో డైరెక్టర్ జనరల్ రాజబాబు, ఆర్మీ కమాండెంట్ అజయ్ మిశ్రా, జగన్నాథ్ నాయక్, చంద్రమౌళి, అజిత్ బి చౌదరి, నరేంద్ర కాలే తదితరులను ఈ సందర్భంగా ఎం వెంకయ్యనాయుడు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Updated Date - Aug 03 , 2025 | 07:02 PM