Super Six Super Hit: ఆటో వాలాలకు చంద్రన్న దసరా కానుక
ABN, Publish Date - Sep 10 , 2025 | 08:50 PM
2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఈ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరిట హమీలను ఇచ్చింది. వాటిని అధికారంలోకి వచ్చిన తర్వాత.. కూటమి సర్కారు అమలు చేసింది. ఈ సందర్బంగా అనంతపురం వేదికగా సూపర్ సిక్స్.. సూపర్ హిట్ పేరిట విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు కూటమిలోని పార్టీల శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.
2024 ఎన్నికలు చరిత్రను తిరిగరాశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ సిక్స్ - సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఈ సభ రాజకీయాలు, ఓట్లు కోసం కాదన్నారు.
15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకే తాము అనంతపురానికి వచ్చామన్నారు.
అందులో భాగంగానే ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని.. బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు అని స్పష్టం చేశారు.
57 శాతం మంది ప్రజలు ఓట్లేశారని.. 94 శాతం స్ట్రైక్ రేట్ వచ్చిందని.. 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారని సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
గత పాలకులు ప్రజా వేదికను కూల్చివేతతో విధ్వంసం మొదలు పెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టిందన్నారు. అవినీతి అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన పెట్టుబడులను తరిమేసి.. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేశారని మండిపడ్డారు.
గత ప్రభుత్వం దాదాపు 93 పథకాలను నిలిపి వేసిందని గుర్తు చేశారు. పేద, మధ్య తరగతి జీవితాలను మార్చేందుకు సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం.. అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు.
సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారన్నారు. పెన్షన్ల, సూపర్ సిక్స్‌పై నాడు వాళ్లు ఏమన్నారో గుర్తుందా? అంటూ ప్రజలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అంటే హేళన చేశారన్నారు. పింఛన్ల పెంపు అంటే అసాధ్యమని పేర్కొన్నారన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోల్ చేశారని చెప్పారు.
ఇంకా చెప్పాలంటే.. మెగా డీఎస్సీ అవ్వదన్నారు..దీపం వెలగదన్నారు..ఫ్రీ బస్సు కదలదన్నారంటూ గత వైసీపీలోని పెద్దలు చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందని తెలిపారు.
సూపర్ సిక్స్- సూపర్ హిట్ విజయోవత్సవ సభకు అశేషంగా తరలి వచ్చిన మూడు పార్టీల శ్రేణులకు, ప్రజలకు, మహిళలకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
యువ కిషోరాలను ఆదరిస్తామన్నారు. యువత అండగా ఉంటే కొండనైనా ఢీకొంటానని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సూపర్ సిక్స్‌లో చెప్పామన్నారు.
మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులు ఏడాదిలోనే భర్తీ చేశామని.. ఒక్క రూపాయి అవినీతి లేకుండా టీచర్ల రిక్రూట్‌మెంట్లు చేపట్టామని వివరించారు. నైపుణ్య శిక్షణ ద్వారా లక్ష మంది యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేస్తే.... మనం రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చామని తెలిపారు. ఇదీ మన గుడ్ విల్, ఇదీ మన బ్రాండ్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత భవితకు భరోసా ఇచ్చాం కాబట్టే..‘యువగళం’ సూపర్ హిట్ అయిందన్నారు.
పేదవాడి ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా ఇప్పటి వరకు 5.60 కోట్ల భోజనాలతో ప్రజల కడుపు నింపామన్నారు. ఇంత కంటే ఆనందం ఏముందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం పేదల పొట్ట కొట్టి.. అన్న క్యాంటీన్లను మూసేసిందని విమర్శించారు.
ఆటో మిత్ర కింద ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ఎన్నికల్లో చెప్పాం... ఎన్ని కష్టాలున్నా చేస్తామని స్పష్టం చేశారు. ఇదీ పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - Sep 10 , 2025 | 08:50 PM