TTD: సీఎం సూచనతో విదేశాల్లో వెంకన్న మందిరాల నిర్మాణానికి కృషి: టీటీడీ ఛైర్మన్
ABN, Publish Date - Jun 23 , 2025 | 07:18 AM
భక్తుల సౌకర్యార్థం విదేశాల్లో కూడా వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి కృషి చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఏపీ సీఎం సూచనల మేరకు ఈ చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు విదేశాలలో వీలయినంతగా శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరాల నిర్మాణానికి కృషి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ బి.ఆర్.నాయుడు వెల్లడించారు.
విదేశాలలో ఉన్న భారీ సంఖ్యలోని భక్తుల కోరిక మేరకు వారి సౌకర్యార్థం విదేశాలలో శ్రీ వేంకటేశ్వర స్వామి మందిరాల నిర్మాణానికి ప్రయత్నాలు చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడి సూచన మేరకు బహ్రెయిన్‌తో సహా ఇతర దేశాలలో కూడా ఈ దిశగా తాము ప్రయత్నాలను ప్రారంభించామని ఆయన శనివారం సాయంత్రం అక్కడి తెలుగు ప్రవాసీయులతో పేర్కొన్నారు.
టీటీడీ చైర్మన్ హోదాలో ప్రప్రథమంగా విదేశీ పర్యటనకు వచ్చిన ఆయన అంతకు ముందు ఈ విషయమై బహ్రెయిన్‌లోని భారతీయ రాయబారితో శనివారం ఆయన నివాసంలో సమావేశమయ్యారు. బహ్రెయిన్‌లో శ్రీ వేంకటేశ్వర స్వామి మందిర నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించే విధంగా చొరవ తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ రాయబారిని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడు కొండల స్వామి భక్తుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చడానికి టీటీడీ బోర్డు కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.
ఆ తరువాత, తనను కలిసిన ప్రవాసాంధ్రులతో టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతూ, వైయస్ జగన్ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించినట్లుగా పవిత్రమైన టీటీడీలో కూడా వందల కోట్ల భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.
అంతకు ముందు, శుక్రవారం బహ్రెయిన్‌లో జరిగిన శ్రీ శ్రీనివాస కళ్యాణోత్సవంలో టీటీడీ ఛైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరుపతి నుండి ప్రత్యేకంగా వచ్చిన భారత శేఖరాచార్యులు, బాలభద్ర, సుదర్శన నారాయణన్ అనే ముగ్గురు పురోహితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణోత్సవం కన్నులపండువగా సాగింది. బహ్రెయిన్‌తో పాటు సౌదీ అరేబియా, ఇతర గల్ఫ్ దేశాల నుండి తెలుగు ప్రవాసీయులు కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు పొందారు. పరాయి దేశంలో సైతం తిరుమలను సందర్శించిన విధంగా ఆధ్యాత్మిక చింతన, స్ఫూర్తి కలిగిందని సౌదీ అరేబియా నుండి కళ్యాణోత్సవానికి వచ్చిన తెలుగు ప్రవాసీ ప్రముఖుడు పల్లెం తేజ వ్యాఖ్యానించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం నిర్వహించే ప్రతి చోటా, ప్రాంతంలో శాంతిసౌభాగ్యాలు నెలకొంటాయని బహ్రెయిన్‌లోని భక్తులు అన్నారు. గతంలో జరిగిన కళ్యాణత్సోవాలకు ఈసారి కార్యక్రమానికి తేడా ఉందని చెబుతూ, ఏర్పాట్లు బేష్ అని కితాబునిచ్చారు.
ఇవీ చదవండి:
అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో హెల్ప్ లైన్ ఏర్పాటు
Updated Date - Jun 24 , 2025 | 01:28 PM