GWTCS: క్రీడాస్ఫూర్తే యువత ఉన్నతికి తొలిమెట్టు
ABN, Publish Date - Aug 05 , 2025 | 09:27 PM
అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా స్వర్ణోత్సవ సంస్థ, బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో పికెల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు.
అమెరికా రాజధాని ప్రాంతం వేదికగా స్వర్ణోత్సవ సంస్థ, బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో పికెల్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్‌ను దిగ్విజయంగా నిర్వహించామని ఆ సంఘం అధ్యక్షులు రవి అడుసుమిల్లి వెల్లడించారు. ఈ టోర్నమెంట్‌లో అన్ని వయస్సు వారు వందలాది మంది క్రీడాకారులు పాల్గొన్నారని వివరించారు. దైనందిన జీవితంలో క్రీడలు ముఖ్య భాగమని.. అందుకే ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన పికెల్ బాల్ క్రీడల పోటీని తొలిసారిగా నిర్వహించామని పేర్కొన్నారు.
ప్రవాస సంఘాలు.. తానా, ఆటా కార్యవర్గ సభ్యులు ఈ టోర్నమెంట్‌కు ముఖ్య అతిధులుగా హాజరై.. విజేతలకు బహుమతులు అందజేశారు. ఆదిత్య, శశాంక్ ప్రధమ, తరిధ్, అర్ష్ ద్వితీయ స్థానాల్లో విజేతలుగా నిలిచి బహుమతులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ.. దాతలు, మీడియా వారికి.. అలాగే ఈ కార్యక్రమ సమన్వయకర్తలు రాజేష్ కాసారనేని, సుశాంత్ మన్నే, శివాజీ మేడికొండ, విజయ్ అట్లూరి, శ్రీధర్ వాసిరెడ్డి, దుర్గా కొడాలిలకు ఈ సంస్థ అధ్యక్షులు రవి అడుసుమిల్లి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు. అలాగే యువత కోసం సంస్కృతీ, భాష వేదికగా మరిన్ని కార్యక్రమాలతో ఈ ఒరవడిని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకూ సాగిన ఈ పోటీల్లో ముఖ్యంగా సెమీ ఫైనల్, ఫైనల్ ఊపిరి బిగబట్టే చూసేంత హోరాహోరీగా సాగాయి. చిన్నా పెద్ద అంతా ఈ పోటీల్లో పాల్గొని వారిని అభినందించారు. అలాగే ఈ తొలి ప్రయత్నం చేసిన GWTCS సంఘాన్ని ప్రతి ఒక్కరు అభినందనలతో ముంచెత్తారు. స్థానిక క్రీడాకారులు, యువతతో ఈ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. ఈ పోటీల సందర్భంగా అల్పాహారం, టీ ఏర్పాటు చేశారు.
దేశం, వయసు, గెలుపు ఓటమితో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు క్రీడాస్ఫూర్తిని అలవర్చుకోవాలని, జీవితంలో గెలుపోటములు భాగమేనని.. ఓడిన ప్రతి సందర్భం నుంచి కొత్తగా నేర్చుకుంటూ, తీర్చిదిద్దుకుంటూ జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవటం యువతకు దిశానిర్దేశామని కార్యవర్గ సభ్యులు, అతిధులు ఈ సందర్భంగా తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆస్ట్రేలియాలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటితో ఆత్మీయ సమ్మేళనం..
అమెరికాలో నలుగురు భారత సంతతి వృద్ధుల అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసులు గాలింపు
For More NRI News And Telugu news
Updated Date - Aug 05 , 2025 | 09:29 PM