Divan Family Missing: అమెరికాలో నలుగురు భారత సంతతి వృద్ధుల అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసులు గాలింపు
ABN , Publish Date - Aug 03 , 2025 | 01:48 PM
వెస్ట్ వర్జీనియాలోని ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ ఆధ్యాత్మిక కేంద్రానికి బయలుదేరిన నలుగురు భారత సంతతి వృద్ధులు కనిపించకుండా పోయిన ఉదంతం కలకలం రేపుతోంది. పోలీసులు వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్‌కు చెందిన నలుగురు భారత సంతతి వృద్ధులు వెస్ట్ వర్జీనియాలోని ఓ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళుతూ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. వారి ఆచూకీ కనుక్కునేందుకు స్థానిక పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశా దివాన్ (85), కిశోర్ దివాన్ (89), శైలేశ్ దివాన్ (89), గీతా దివాన్ (84) బఫెలో నుంచి మార్షల్ కౌంటీలోని ప్రభుపాద ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ ఆధ్యాత్మిక కేంద్రాన్ని సందర్శించేందుకు జులై 29న బయలుదేరి ఆ తరువాత కనిపించకుండా పోయారు.
మార్గమధ్యంలో వారు బర్గర్ కింగ్ రెస్టారెంట్‌లోకి వెళ్లినట్టు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. అదే ప్రదేశంలో వారు చివరిసారి తమ క్రెడిట్ కార్డు వాడినట్టు కూడా రికార్డుల్లో కనిపించింది. ఆ తరువాత వారు ఐ-79పై ప్రయాణించినట్టు మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు పెన్సిల్వేనియా స్టేట్ పోలీసు ప్లేట్ రీడర్‌లో రికార్డయ్యింది. మొదట పిట్స్‌బర్గ్ ఆపై వెస్ట్ వర్జీనియాలోని మౌండ్స్‌విల్‌కు వారు వెళ్లాలని అనుకున్నట్టు మార్షల్ కౌంటీ షెరిఫ్ తెలిపారు. తమ వద్ద ఉన్న కొంత సమాచారం ఆధారంగా వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
మార్షల్ కౌంటీతో పాటు ఓహాయో కౌంటీ పోలీసులు కూడా గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. త్వరలో హెలికాఫ్టర్ సాయంతో వారి కోసం గాలిస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఆ నలుగురు వృద్ధులు ప్రయాణించిన కారు వివరాలను అధికారులు నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ డాటాబేస్‌లో చేర్చారు. ఈ ఘటనపై బఫెలోలో మిస్సింగ్ కేసు కూడా నమోదైంది.
ఈ ఘటనపై కౌన్సిల్ ఫర్ హెరిటేజ్ అండ్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియా సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఆధ్యాత్మిక కేంద్రానికి బయలుదేరిన రెండు జంటలు కనిపించకుండా పోయాయి. ఈ విషయంపై ఆందోళన చెందుతున్నాము. వీరి వివరాలు తెలిసిన వారు ముందుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. వారు సురక్షితంగా ఉండాలని ఆశిస్తున్నాము’ అని సీహెచ్ఏఐ ప్రెసిడెంట్ సిబు నాయర్ తెలిపారు. ఆ దంపతుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు షెరిఫ్ డిపార్ట్‌మెంట్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గాలిస్తున్నట్టు తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి:
శాన్ జోస్‌లో ఐసీఏసీ ప్రారంభం...ఇంటి వద్దకే కాన్సులేట్ సేవలు!
కాన్సుల్ జనరల్ బాధ్యతలు చేపట్టనున్న యూఎస్ అధికారి లారా విలియమ్స్ గౌరవార్థం ప్రత్యేక విందు