NRI: మెల్‌బోర్న్ నగరంలో జనరంజకంగా అష్టావధాన కార్యక్రమం
ABN, Publish Date - Sep 02 , 2025 | 01:58 PM
జనరంజని రేడియో సంస్థ, శ్రీవేద గాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో మెల్‌బోర్న్ నగరంలో అష్టావధాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అవధానార్చనా భారతి, కవిరాజహంస, శారదామూర్తి తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి చేసిన ఈ అవధాన కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రప్రథమ శతకకర్తగా రికార్డులు సాధించిన డా. తంగిరాల నాగలక్ష్మి సంచాలకురాలిగా నిర్వహించారు.
ఇంటర్నెట్ డెస్క్: మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా) నగరంలో ఆగస్టు 30 తేదీన జనరంజని రేడియో సంస్థ, శ్రీవేద గాయత్రి పరిషత్, సంగీత భారతీ న్యూజిలాండ్ తెలుగు సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో తెలుగులో అష్టావధాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఆస్ట్రేలియా అవధాని, అవధానార్చనా భారతి, కవిరాజహంస, శారదామూర్తి తటవర్తి శ్రీ కళ్యాణ చక్రవర్తి చేసిన ఈ అవధాన కార్యక్రమానికి న్యూజిలాండ్ ప్రప్రథమ శతకకర్తగా రికార్డులు సాధించిన డా. తంగిరాల నాగలక్ష్మి సంచాలకురాలిగా నిర్వహించారు.
సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, న్యస్తాక్షరి, ఆశువు, కృతిపద్యం, చిత్రానికి పద్యం, అప్రస్తుత ప్రసంగం అనే అంశాలతో ఉత్కంఠతో సాగిన ఈ అష్టావధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం ఉన్నత సాహిత్యప్రమాణాలతో కొనసాగింది. తెలుగుభాషను, సాహిత్యాభిమానాన్ని పెంచడానికి ఇటువంటి కార్యక్రమాలను తరచు నిర్వహించాలని పలువురు ప్రేక్షకులు సూచించారు.
ఆధ్యాత్మిక కేంద్రమైన సంకట మోచన మందిరంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖులు ఆసాంతం వీక్షించి అవధాని కళ్యాణ చక్రవర్తిని, సంచాలకులను, నిర్వాహక సంస్థలను అభినందిస్తూ, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాలకు తగిన ప్రోత్సాహాన్ని కల్పించారు.
అప్రస్తుత ప్రసంగంలో పాల్గొన్న 11 ఏళ్ళ చిరంజీవులు కృష్ణ సుహాస్ తటవర్తి ధ్రువ్ అకెళ్ళ అప్పటికప్పుడే అద్భుతమైన ప్రశ్నల వర్షం కురిపించడం అవధానాలలోనే ప్రత్యేకత సంతరించుకున్నది. కృతిపద్యము అనే అంశంలో చిన్నారులు గాయత్రి నందిరాజు, తన్వి వంగల సభాసదుల మనసులను చూరగొన్నారు. సాంకేతిక సహకారం శరణ్ తోట అందించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మహిళల సారథ్యంలో సిలికానాంధ్ర నూతన కార్యవర్గం
GWTCS ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
Updated Date - Sep 02 , 2025 | 02:00 PM