Share News

Telugu Language Day Celebrations: GWTCS ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం..

ABN , Publish Date - Aug 29 , 2025 | 09:35 PM

ప్రవాస భారతీయుల తల్లిదండ్రుల సమక్షంలో వ్యవహారిక తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తికి ఘన నివాళి అర్పించారు. ఈ నేలపై తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి అని వక్తలు కొనియాడారు.

Telugu Language Day Celebrations: GWTCS ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం..
Telugu Language Day Celebrations

బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రవాస భారతీయుల తల్లిదండ్రుల సమక్షంలో వ్యవహారిక తెలుగు భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తికి ఘన నివాళి అర్పించారు. జీడబ్ల్యూటీసీఎస్ ఉపాధ్యక్షుడు సుశాంత్ మన్నే, కార్యదర్శి భానుప్రకాష్ మాగులూరి ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచారు.
NRI-1.jpg


ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రవి అడుసుమిల్లి మాట్లాడుతూ.. ‘భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతదేశంలో ఎన్నో భాషలు, మరెన్నో మాండలికాలు ఉన్నాయి. అందునా దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయలు కాలం నుంచి నేటి వరకూ తేనెలొలుకు మన మాతృభాష తెలుగు. ఈ నేలపై తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి. గ్రాంథిక భాషకు బదులుగా సాధారణ ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషను వాడాలని జీవిత కాల ప్రచారం, పోరాటం చేశారు’ అని కొనియాడారు.

NRI-3.jpg


కార్యదర్శి భాను మాగులూరి మాట్లాడుతూ.. ‘రామమూర్తి బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త. ఆయన చేసిన కృషి వల్లే తెలుగు సాహిత్యం, విద్య సామాన్యునికి, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్టు 29వ తేదీన ఆయన పుట్టిన రోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. వృత్తి, ఉపాధి కోసం ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాష తెలుగును మన పిల్లలకు రాయటం, స్పష్టంగా చదవటం, ప్రసంగించటం నేర్పించటం మనందరి బాధ్యత’ అని అన్నారు. ఇక, ఈ కార్యక్రమంలో శ్రావ్య చామర్తి, బోనాల రామకృష్ణ, బండి సత్తిబాబు, కోటి కర్నాటి, పునుగువారి నాగిరెడ్డి, వనమా లక్ష్మీనారాయణ, మేకల సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి

భార్య ఘాతుకం.. అశ్లీల రీల్స్ చేయొద్దన్నాడని భర్తపై కత్తితో దాడి..

ఈ యూట్యూబర్ మామూలోడు కాదు.. పగలు నీతులు.. రాత్రి దొంగతనాలు..

Updated Date - Aug 29 , 2025 | 10:02 PM