Kuwait: కువైత్‌లో కార్మిక చట్టాలపై అవగాహన కార్యక్రమం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు సంఘాల ప్రతినిధులు
ABN, Publish Date - Nov 02 , 2025 | 07:14 PM
కార్మిక చట్టాలపై విదేశీయులకు అవగాహన కల్పించే కువైత్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ తాజాగా దేశంలోని వివిధ రాయబార కార్యాలయ ప్రతినిధులు, ప్రవాసీ సంఘాల ప్రతినిధులతో కలిసి మరో అవగాహన కార్యక్రమం నిర్వహించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: కువైత్‌లో కార్మిక సంక్షేమ చట్టాలు, వాటి అమలు తీరుతెన్నులపై విదేశీ కార్మికులకు సరైన అవగాహన లేకపోవడంతో అనేక మంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కువైత్ ప్రభుత్వం తమ దేశంలో ఉంటున్న విదేశీ కార్మికులలో దీనిపై చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తోంది.
ఈ విషయమై కువైత్ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ కూడా కార్మిక చట్టాలపై విదేశీయులకు అవగాహన కల్పిస్తోంది. దేశంలోని వివిధ రాయబార కార్యాలయ ప్రతినిధులు, వాటి వద్ద నమోదై ఉన్న ప్రవాసీ సంఘాల ప్రతినిధులతో కలిసి కువైత్ ప్రైవేటు సెక్టార్‌లో పని చేసే కార్మికుల సంక్షేమం, భద్రతకు సంబంధించిన చట్టాలు, వాటి ప్రయోజనాలు, పని గంటల నిబంధనలు, బీమా పథకం మొదలై అంశాలపై అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా ప్రమాదాల సందర్భంగా అనుసరించాల్సిన చట్టబద్ధ పద్ధతుల గురించి ప్రచారం చేస్తోంది (Workers' Rights Awareness Drive).
ఈ దిశగా ఇటీవల ప్రవాసీ భారతీయ సంఘాలతో కూడా అవగాహన సదస్సు నిర్వహించగా కువైత్ ట్రేడ్ యూనియన్ పక్షాన, సంస్థ ప్రధాన కార్యదర్శి నాజర్ అల్ ఆజ్మీ, సలహాదారు మొహమ్మద్ అల్ ఆరదా, భారతీయ కార్మికుల ప్రతినిధి అనిల్ పి. అలెక్స్‌లు పాల్గొన్నారు. కువైత్ చట్టాల్లోని హక్కులతో పాటు బాధ్యతల గురించి కూడా వారు వివరించారు. ఈ అవగాహన సదస్సులో కువైత్‌లోని దాదాపు అన్ని తెలుగు ప్రవాసీ సంఘాలు పాల్గొన్నాయి. కువైత్ తెలుగు సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు, కువైత్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా ఉన్న ఉన్న కె. సుధాకర్ రావు, కార్మిక సంక్షేమ కార్యక్రమాలల్లో చురుగ్గా పాల్గొనే షేక్ బాషా, జిలకర మురళిలతో పాటు తెలుగు ప్రవాసీ ప్రముఖులు కంచన శ్రీకాంత్, సిద్దవటం నాగమణి, పెరుగు ప్రభాకర్ యాదవ్, అభిలాష, జయచంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అరేబియాలో అపురూపం .. ఈ ఆధ్యాత్మిక ఘట్టం
అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం: నాట్స్
Updated Date - Nov 03 , 2025 | 02:19 PM