Indian Origin Man Criticizes H 1B Visa: హెచ్-1బీ వీసాలపై భారతీయ అమెరికన్ షాకింగ్ పోస్టు.. జనాల గగ్గోలు
ABN, Publish Date - May 17 , 2025 | 05:34 PM
హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను పూర్తిగా రద్దు చేయాలంటూ ఓ భారతీయ అమెరికన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. జనాలు ఇది చూసి షాకైపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వలసలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. హెచ్-1బీ వీసా మొదలు విద్యార్థి వీసాల వరకూ విదేశీయులకు ఏవీ దక్కకుండా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలకే వీసాలను రద్దు చేస్తూ విదేశీయులను నిర్దాక్షిణ్యంగా సొంత దేశాలకు పంపించేస్తున్నారు. అయితే, ట్రంప్ పాలసీలకు కొందరు భారత సంతతి అమెరికన్లు పరోక్ష మద్దతు తెలపడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన ఓ భారత సంతతి అమెరికన్ పెట్టిన పోస్టు సంచలనం రేపుతోంది.
హెచ్-1బీ వీసా రెన్యువల్ వ్యవస్థను మరింత మెరుగుపరిచి అమెరికా ప్రయోజనాలను కాపాడాలంటూ అమెరికా చట్టసభల సభ్యుడు రిచ్ మెక్‌కార్మిక్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ఖర్చులు తగ్గించి, దేశ ఉత్పాదక, పోటీతత్వం పెంచేలా హెచ్-1బీ వీసా రెన్యువల్ విధానాన్ని మరింత విస్తరించాలి’’ అని అన్నారు. ఈ దిశగా కొన్ని సూచనలతో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్క్ రూబియోకు రాసిన లేఖ కాపీని కూడా నెట్టింట పోస్టు చేశారు. 2024 నాటి డొమెస్టిక్ వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్‌ను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ పోస్టుకు భారతీయ అమెరికన్ రోహిత్ జాయ్ ఘాటుగా స్పందించారు. వీసా పథకాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం అసలేమీ లేదని అన్నారు. వీటిని రద్దు చేయాలని పిలుపునిచ్చారు. అమెరికాను దీటుగా నిలిపేందుకు ఇదేమీ ఉపయోగపడదని అన్నారు. అమెరికా పోటీదారులు ఎవరూ విదేశీ వర్కర్లను నియమించుకోరని అన్నారు.
ఒరేగాన్ రాష్ట్రంలో పుట్టినా తనది భారతీయ రక్తమని చెప్పుకునే రోహిత్ ఇలాంటి పోస్టు పెట్టడంతో జనాలు షాకైపోయారు. మరికొందరు మద్దతుగా నిలిచారు. హెచ్-1బీ వీసా పథకాన్ని ముగించాల్సిందేనని డిమాండ్ చేశారు. వీసాపై వచ్చి గడువు ముగిసినా అనేక మంది ఇక్కడే ఉండిపోతున్నారని అన్నారు.
‘‘నిన్ను వాళ్లు స్వదేశానికి పంపిస్తారు’’ అని ఓ వ్యక్తి రోహిత్‌ను హెచ్చరించగా తాను అమెరికా పౌరుడినని అతడు చెప్పుకొచ్చారు. అమెరికా ప్రయోజనాలను రోహిత్ ఎంత సమర్థించినా అతడికి స్థానికుల మద్దతు దొరకదని కొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
ఐర్‌లాండ్‌లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవానికి సౌదీ పిలుస్తోంది రా.. కదలి రా
SATA: సాటా రియాధ్ అధ్యక్షురాలిగా చేతన నియామకం
బహ్రెయిన్‌లో ఘనంగా చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు
Updated Date - May 17 , 2025 | 05:42 PM