Saudi Diwali Celebrations: సౌదీ అరేబియా దీపావళి ఉత్సవం.. పాల్గొన్న అరబ్బులు, విదేశీ దౌత్యవేత్తలు
ABN, Publish Date - Nov 01 , 2025 | 05:22 PM
సౌదీలో వివిధ ఎన్నారై సంఘాల ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో స్థానిక అరబ్ ప్రముఖులు, భారతీయ దౌత్యవేత్తలు పాల్గొన్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: దీపం జ్యోతి పరబ్రహ్మ.. దీపం జ్యోతి మహేశ్వర.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీపం నమోస్తుతే.. అంటూ దీపారాధన చేయడం సంప్రదాయం. సకల దేవతలకు ప్రతిరూపమైన దీపం.. దీపావళి సందర్భంగా పూజ గది దాటి వాకిట్లోకి వస్తుంది. కానీ ఈసారి ఎర్ర సముద్ర తీరం ఆలలను దాటి ప్రవాసీ లోకాన వెలుగులు విరజిమ్మింది.
భారతీయ పండుగలు, సంప్రదాయాల సమ్మేళనాలు, తరతరాల ఆచారాలు, జీవన రీతులను సంరక్షిస్తూ భారతావని సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని ప్రతిబింబించే పండుగలలో దీపావళి ప్రముఖమైనది.
నూర్-ఎ-దివాళీ ( దీపావళి వెలుగులు) పేరిట సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో గురువారం రాత్రి భారతీయ కాన్సులేట్ ఆవరణలో దీపావళి పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించగా ప్రప్రథమంగా సౌదీ అరేబియా ప్రముఖులు, స్థానికంగా ఉండే వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు కూడా వేడుకలలో పాల్గొన్నారు.
సౌదీ అరేబియాలోని ప్రవాసీయులు తమ భారతీయ సంస్కృతి, విలువల పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని భారతీయ కాన్సుల్ జనరల్ ఫహాద్ ఖాన్ సూరీ ప్రశంసించారు.
భారతీయ కుటుంబాలకు దీపావళి ఒక పండుగ మాత్రమే కాదు మాతృభూమితో ఒక వారధి అని తెలుగు ప్రవాసీ సంఘం సాటా (యం) అధ్యక్షుడు మల్లేశన్ వ్యాఖ్యానించారు. చీకటిపై వెలుతురు ఎప్పటికీ విరజిమ్మాలని కోరుకొంటున్నట్లుగా, భారతీయ సంస్కృతి పరిరక్షణ కోసం పాటుపడే ప్రవాసీ సంఘం జె.టి.యం నాయకురాలు గాలి దుర్గా భవానీ చెప్పారు.
దీపావళిని ప్రప్రథమంగా సౌదీ అరేబియాలో జరుపుకోవడం పట్ల కడప జిల్లాకు చెందిన శివానంద, లక్ష్మి దంపతులు సంతోషం వ్యక్తం చేసారు. యాదాద్రి జిల్లాకు చెందిన ఉషా కిరణ్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రతిష్ఠాత్మకమైన దీపావళి ఉత్సవాల నిర్వహణలో తెలుగు ప్రవాసీయులు కీలక పాత్ర వహించారు. వేడుకలలో ముఖ్యమైన సాంస్కృతిక, భోజన ఏర్పాట్లను తెలుగు ప్రవాసీ సంఘాలైన జె.టి.యం, సాటా సమన్వయం చేశాయి. అరబ్బు నేలపై భారతీయ సంస్కృతి, పరిరక్షణ కోసం కృషి చేసే బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలానికి చెందిన దుర్గా భవానీ, శివరామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలోని జే.టీ.యం వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాసీయుల ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జె.టి.యం జెద్దా నగరంలోని తెలుగు ప్రవాసీ సంఘం కాగా ఇది భారతీయ పండుగలు, సంస్కృతి పరిరక్షణ కోసం పని చేస్తుంది. దీపావళి పండుగను భారతదేశంలో విభిన్న రాష్ట్రాలు వివిధ రకాలుగా జరుపుకొంటుండగా సౌదీ అరేబియాలో కూడా ఆయా రాష్ట్రాల సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మహారాష్ట్ర మహిళల జానపద గేయాలు, సాంస్కృతిక ప్రదర్శనలు సభికులను అలరించాయి.
భారతదేశం వివిధ వంటకాలకు, ప్రాంతీయ రుచులకు పెట్టింది పేరు. దేశంలో వివిధ ప్రాంతాలు రాష్ట్రాల మధ్య ఆహారం, రుచులు మారుతూ ఉంటాయి. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ, గుజరాత్ నుండి పశ్చిమ బెంగాల్ వరకూ ఎన్నో విభిన్నమైన వంటకాలు నోరూరిస్తాయి. ఎక్కడో పరాయి దేశంలో విభిన్న రకాల వంటకాలను ఒక్క చోట అందునా ఐరోపా, ఆఫ్రికా, ఆసియా, అమెరికా ఖండాల విదేశీ దౌత్యవేత్తలతో పాటు స్థానిక అరబ్బు ప్రముఖులకు వడ్డించడం అంత సులువేమీ కాదు. భోజన ఏర్పాట్లను మరో తెలుగు ప్రవాసీ సంఘం సాటా సమన్వయం చేసింది. సాటా (యం) అధ్యక్షుడు మల్లేశం, విశ్వనాథన్ దీన్ని సమన్వయం చేశారు. సభికులు, అతిథులు అందరూ కలిసి రుచికరమైన విందు భోజనం, సంప్రదాయ దీపావళి మిఠాయిలను ఆశ్వాదించారు.
రెండు తెలుగు ప్రవాసీ సంఘాలు సాటా(యం), జె.టి.యంలతో పాటు ఐ.బి.పి.యన్, దిశ, జె.టి.యస్, మహారాష్ట్ర మండల్, ఐ.ఓ.యఫ్, లాయర్స్ అసోసియేషన్, కేరళ సమాజం, టి.యస్.యస్, ఒడిశా మండల్ కూడా వేడుకలలో పాల్గొన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
అమెరికాలో తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటాం: నాట్స్
ఒంగోలులో తానా మానవతా సేవా కార్యక్రమం
Read Latest and NRI News
Updated Date - Nov 01 , 2025 | 08:30 PM