Riyadh Karthika Vanabhojanalu: సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో వైభవంగా వనభోజనాలు
ABN, Publish Date - Nov 16 , 2025 | 09:44 PM
సాటా సెంట్రల్ ఆధ్వర్యంలో రియాద్‌లో వైభవంగా కార్తీక వనభోజనాలు జరిగాయి. ఆప్యాయత, ఆధ్యాత్మిక చింతన, సాంస్కృతిక చైతన్యాల మేళవింపుతో మహత్తరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: నజ్ద్ అనేది నిండు అరబ్బు సంప్రదాయానికి నెలవు. రియాద్ ప్రాంతాన్ని నజ్ద్ అంటారు. ఒకప్పుడు తెలుగుతనం అంటే సంకోచించే పరిస్థితి నుండి తెలుగుతనాన్ని సగర్వంగా చెప్పుకోవడంతో పాటు ఎడారి నాట తెలుగు తన్మయత్వపు స్ఫూర్తిని నింపారు రియాద్ నగరంలోని తెలుగు మహిళలు(Riyadh Karthika Vanabhojanalu).
తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్ .. ప్రతి పండుగ లేదా సందర్భాన్ని ఒక జనజాతర తరహాలో మలుస్తోంది. రియాద్ నగరంలోని ప్రతి తెలుగు ప్రవాసీ కుటుంబాలతో మమేకం అవుతూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఇటీవల కార్తీక మాస వనభోజనాలను ఆప్యాయత, ఆధ్యాత్మిక చింతన, సాంస్కృతిక చైతన్యాల మేళవింపుతో మహత్తర కార్యక్రమంగా నిర్వహించింది.
నిస్సారమైన ఎడారి అయినా లేదా పచ్చని పొదల ఉద్యానవనాలైనా మరో ప్రదేశమైనా భక్తి, ఆరాధనలకు అడ్డంకి కాదని సాటా సెంట్రల్ మహిళ ప్రతినిధులు రమ్య, సుధా, చందన, కవిత పోకూరి, కవిత చొల్లంగిలు తెలిపారు. రియాద్ నగర శివారులోని ఒక ప్రదేశంలో జరిగిన ఈ కార్యక్రమంలో తులసి, ఉసిరి తదితర దేవతా వృక్షాలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
అనంతరం జరిగిన వివిధ సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాలను రమ్య ఆధ్వర్యంలో సుచరిత, లావణ్య, చందన, కవిత పోకూరి, గోదాశ్రీ, సుధా లోకే, కవిత చొల్లంగి, దీప్తి ప్రసన్న, మాధవి బాలు, విజయలక్ష్మి, మంజు, నిహారిక, ప్రియా ప్రసాద్, రజని, లక్ష్మి, శ్రీలక్ష్మి, వీణా, నళిని, మౌనిక, సౌమ్యలు నిర్వహించారు. చిన్నారుల దినోత్సవం సందర్భంగా పిల్లలకు ఆటలు, క్విజ్ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ప్రవాసీ ప్రముఖులు లోకే ప్రశాంత్ ఆధ్వర్యంలో తెలుగు సంప్రదాయక భోజనాలను వడ్డీంచారు.
మధుర జ్ఞాపకాలను ఆత్మీయులతో పంచుకుంటే ఆనందంతో పాటు ఆప్యాయత పెరుగుతుంది. ఈ దిశగా రమ్య, గోదా శ్రీప్రియలు తమ ప్రాంత, కుటుంబ ఆచారాలను విశదీకరించేందుకు తమ వివాహ ఫొటోలు, వీడియోలను ఒక చిత్రమాలికగా రూపొందించి ప్రదర్శించారు. ఈ చిత్రమాలిక ప్రదర్శనకు పెద్దల కంటే ఎక్కువగా చిన్నారులు ఆసక్తితో తిలకించారు. భావితరాలకు కుటుంబ వ్యవస్థను తెలియజేయడం తమ ఉద్దేశమని గోదా శ్రీ ప్రియా అన్నారు. మహిళలకు క్రికెట్ ప్రస్థానంలో ఎదురైన ప్రతికూలతను బద్దలుకొడుతూ ఇటీవల భారతీయ మహిళలు తమ క్రీడా శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఉత్సాహం ఇంకా మహిళలలో తాజాగా ఉంది. ఈ స్ఫూర్తితో సాటా సెంట్రల్ మహిళలు క్రికెట్ ఆడి అందరి ప్రశంసలను పొందారు. పురుషులకు తీసిపోని విధంగా ఆడిన ఈ క్రికెట్ మ్యాచ్‌లో నళిని, దీప్తి, ప్రియా, నీహారిక, వందన, విజయలక్ష్మిలు విజేతలుగా నిలిచారు. మంజు, మౌనిక, నిత్య హంసిని, చైత్ర, మాధవి, కవిత పోకూరిలు రన్నర్ ఆప్‌లు నిలిచారు. ఈ పోటీలకు సత్తిబాబు చొల్లంగి, గౌతం, ఆనందరాజు గుండుబొగుల ఎంపైర్లుగా వ్యవహరించారు. ఈ వనభోజన కార్యక్రమాన్ని గోవిందరాజులు, ఆనంద్ పోకూరి, వెంకటరావు, ఇతర SATA సెంట్రల్ సభ్యులు ప్రణాళికాబద్ధంగా ఎంతో చక్కగా నిర్వహించారు.
ఇవీ చదవండి
యూఏఈలో ‘తెలుగు తరంగిణి’ కార్తీక వనభోజనాలు
పాకిస్థానీలకు 59 రోజుల్లో కెనడా వీసా దరఖాస్తు ప్రాసెసింగ్.. భారతీయులకు మాత్రం..
Updated Date - Nov 17 , 2025 | 06:37 PM