Anthony Albanese: ఆస్ట్రేలియా సెనెటర్ భారత వ్యతిరేక వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పాలన్న ప్రధాని ఆల్బనీస్
ABN, Publish Date - Sep 09 , 2025 | 02:54 PM
ఆస్ట్రేలియాలో భారతీయుల మనసులు గాయపరిచేలా కామెంట్స్ చేసిన సెనెటర్ జసింటా క్షమాపణలు చెప్పాలని ఆస్ట్రేలియా ప్రధాని డిమాండ్ చేశారు. సొంత పార్టీ నేతలే ఆమె క్షమాపణలను కోరుతున్నారని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన లిబరల్ పార్టీ సెనెటర్ జసింటా ప్రైస్ క్షమాపణలు చెప్పాలని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొనీ ఆల్బనీస్ మంగళవారం డిమాండ్ చేశారు. భారతీయుల వలసలు ఆస్ట్రేలియాకు భరింపరానివిగా మారాయంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై ప్రధాని అభ్యంతరం వ్యక్తం చేశారు (Anthony Albanese India Remarks).
ఇటీవల ఓ రేడియో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తమకు ఓటేసేందుకే భారతీయుల వలసలను అధికార లేబర్ పార్టీ సారథ్యంలోని ప్రభుత్వం అనుమతిస్తోందనే అర్థం వచ్చేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘ఆస్ట్రేలియాలోని భారతీయుల విషయంలో ఓ అంశంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. వారు పెద్ద సంఖ్యలో ఆస్ట్రేలియాకు వస్తున్నారు. వారు ఎక్కువగా లేబర్ పార్టీకే ఓటేస్తున్నారు’ అని అన్నారు. ఈ కామెంట్స్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అక్కడి భారతీయులు వీటిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సొంత పార్టీ నేతలు కూడా ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టారు (Jacinta Price apology demand).
ఈ క్రమంలో ప్రధాని ఆల్బనీస్ స్పందించారు. ‘ఈ కామెంట్స్ ఇక్కడి భారతీయుల మనసులను గాయపరిచాయి. ఆ సెనెటర్ చెప్పిన విషయాల్లో వాస్తవం లేదు. ఇలా ఒక వర్గం మనసులను గాయ పరిచినందుకు ఆమె క్షమాపణలు చెప్పాలి. ఆమె సొంత పార్టీ వారే క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు’ అని ప్రధాని ఆల్బసీన్ చెప్పారు (Indian migration controversy Australia).
ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో వలసలపై నిరసనలకు ఎక్కువైన విషయం తెలిసిందే. అక్కడ పెరుగుతున్న జీవన వ్యయాలకు వలసలు కారణమన్న వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లిబరల్ పార్టీ సెనెటర్ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి.
2023 నాటి ఆస్ట్రేలియా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, అక్కడ 845,800 మంది భారతీయులు నివసిస్తున్నారు. అంతకుముందు దశాబ్ద కాలంతో పోలిస్తే వారి సంఖ్య రెట్టింపైంది. ఇక ఆస్ట్రేలియాలో పుట్టిన చాలా మందికి భారత మూలాలు ఉన్నాయి.
ఆస్ట్రేలియాలో వలసల అంశంపై ఉద్రిక్తతలు చల్లార్చేందుకు న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం వివిధ వర్గాలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ‘మేము ఆస్ట్రేలియాలోని భారత సంతతి వారికి మద్దతుగా నిలుస్తున్నాము. ఇలాంటి జాత్యాహంకార వ్యాఖ్యలు, చీలికలు పెంచే కామెంట్స్‌కు ఈ రాష్ట్రంలో, దేశంలో స్థానం లేదు’ అని న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ క్రిస్ మిన్స్ స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో పెరుగుతున్న భారత వ్యతిరేక భావనలపై అక్కడి ప్రభుత్వంతో చర్చిస్తున్నామని ఇటీవల భారత విదేశాంగ శాఖ కూడా ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
భారత దౌత్య వ్యూహంపై అమెరికా ప్రొఫెసర్ ప్రశంసలు.. చాలా స్మార్ట్ అని కితాబు
జపాన్ ప్రధాని రాజీనామా ప్రకటన.. కొత్త తరానికి బాధ్యతలను అప్పగిస్తున్నానని కామెంట్
Updated Date - Sep 09 , 2025 | 03:16 PM