Share News

Indian Diplomacy: భారత దౌత్య వ్యూహంపై అమెరికా ప్రొఫెసర్ ప్రశంసలు.. చాలా స్మార్ట్ అని కితాబు

ABN , Publish Date - Sep 08 , 2025 | 10:32 PM

అమెరికా ఒత్తిడులు, సుంకాలను భారత్ ఎదుర్కొంటున్న తీరుపై ఓ అమెరికా ప్రొఫెసర్ ప్రశంసలు కురిపించారు. భారతీయులు చాలా స్మార్ట్ అని కామెంట్ చేశారు. చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

Indian Diplomacy: భారత దౌత్య వ్యూహంపై అమెరికా ప్రొఫెసర్ ప్రశంసలు.. చాలా స్మార్ట్ అని కితాబు
John Mearsheimer Trump Asia strategy

ఇంటర్నెట్ డెస్క్: యూనివర్సిటీ ఆఫ్ చికాగో పొలిటికల్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ జాన్ మార్షైమర్ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. అమెరికా ఒత్తిళ్లు, సుంకాలను భారత్ ఎదుర్కొంటున్న తీరులో చాకచక్యం కనిపిస్తుంటే అమెరికా చర్యలన్నీ తప్పుల తడకగా మారాయని అన్నారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు (John Mearsheimer Trump Asia strategy).

‘భౌగోళిక రాజకీయ వ్యూహాల కోణంలో చూస్తే అమెరికా ప్రభుత్వ చర్యలు అర్థరహితంగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా, సైనిక శక్తి పరంగా చైనా అమెరికాకు శక్తిమంతమైన ప్రత్యర్థి. ఇలాంటి సందర్భాల్లో భారత్, రష్యాలతో సత్సంబంధాలు కొనసాగించాలి. వారు చైనాకు దగ్గర కాకుండా జాగ్రత్త పడాలి. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం రష్యన్‌లతో చెడుగా వ్యవహరిస్తూ, భారత్‌పై 50 శాతం సుంకం విధించి, నోటికొచ్చినట్టు తూలనాడుతూ చైనా వైపు మళ్లేలా చేస్తోంది’

‘ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, రష్యాలతో అమెరికా స్నేహం చేయాలి. కానీ ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. మన అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు ఎంతమాత్రం అనుకూలం కాదు. ఇదంతా చూస్తే అమెరికన్లు, డొనాల్డ్ ట్రంప్ ఏం ఆలోచిస్తున్నారో అర్థంకాక నెత్తి బాదుకోవాల్సి వస్తోంది’


‘ఇప్పటికే రష్యా, చైనా, ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి. ఇప్పుడు ఇండియా కూడా వారి వైపు మళ్లేలా చేశారు. అమెరికా ప్రయోజనాలకు ఇది విఘాతం’

‘భారతీయులు ఎప్పటి నుంచో ఈ దౌత్య క్రీడను కొనసాగిస్తున్నారు. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో కూడా వారు ఇదే వ్యూహం కొనసాగించారు. అలీన విధానంలో వారు అటు రష్యా గానీ ఇటు అమెరికా కూటమిలో గానీ చేరలేదు. సమదూరం పాటించారు. ఈ మధ్య అమెరికాతో క్లోజ్‌గా ఉన్నా ట్రంప్ దూకుడు తరువాత చైనాకు కాస్త క్లోజ్ అయినట్టు కనిపిస్తున్నారు. కానీ ఇండియన్స్ చాలా స్మార్ట్. ఎవరితోనూ అతిగా దగ్గరవ్వకూడదని వారికి తెలుసు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ప్రపంచం కొంత సింపుల్‌గా ఉండేది. రష్యా, లేదా అమెరికా పక్షాన చేరాల్సి వచ్చేది. భారత్ లాంటి దేశాలు తటస్థంగా ఉన్నప్పటికీ స్థూలంగా ఎవరోకరికి మద్దతుగా ఉండాల్సి వచ్చేది. ఆ జమానా పోయింది’ అని ఆయన అన్నారు.


ఇవి కూడా చదవండి:

జపాన్ ప్రధాని రాజీనామా ప్రకటన.. కొత్త తరానికి బాధ్యతలను అప్పగిస్తున్నానని కామెంట్

ట్రంప్ ‘ఫ్రెండ్స్’ కామెంట్స్‌పై స్పందించిన మోదీ.. ఎక్స్ వేదికగా రిప్లై

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 08 , 2025 | 10:38 PM