Japan PM Resign: జపాన్ ప్రధాని రాజీనామా ప్రకటన.. కొత్త తరానికి బాధ్యతలను అప్పగిస్తున్నానని కామెంట్
ABN , Publish Date - Sep 07 , 2025 | 05:38 PM
ఇటీవలి ఎన్నికల్లో జపాన్ అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ వరుస ఓటములు ఎదుర్కొన్న నేపథ్యంలో జపాన్ ప్రధాని తప్పుకున్నారు. బాధ్యతలను కొత్త తరానికి అప్పగించి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నికల్లో వరుస ఓటముల నేపథ్యంలో జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ‘అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నా. తదుపరి అధ్యక్షుడి ఎన్నిక కోసం ఏర్పాట్లు చేయమని పార్టీ సెక్రెటరీ జనరల్ మొరియామాకు చెప్పాను’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన పేర్కొన్నారు (Japan PM Shigeru Ishiba resignation).
షిగెరు గతేడాది పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన పలు ఎన్నికల్లో ఆయన సారథ్యంలోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ వరుస ఓటములను మూటగట్టుకుంది. జపాన్ పార్లమెంటు ఉభయ సభల్లోనూ అధికారిక కూటమి బలం కోల్పోయింది. దీంతో, ఆయన రాజీనామాను కోరుతూ డిమాండ్స్ వెల్లువెత్తాయి. ఇందుకు షిగెరు తొలుత నిరాకరించారు. దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో తాను తప్పుకుంటే రాజకీయ శూన్యం ఏర్పడుతుందని అన్నారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు, అమెరికా సుంకాలు, విధాన సంస్కరణల నేపథ్యంలో తాను కొనసాగాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అయితే, సొంత పార్టీ నుంచి ఒత్తిడి పెరిగింది. కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం పార్టీ ఓటింగ్‌కు సిద్ధమైంది. ఇది షిగెరుపై అవిశ్వాస తీర్మానమే అన్న కామెంట్స్ వినిపించాయి. పార్టీలో కీలక నేతలైన టారో అసోతో పాటు పలువురు మంత్రివర్గ సభ్యులు కూడా బహిరంగంగా ఆయన రాజీనామాను డిమాండ్ చేశారు. శనివారం వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ ప్రధానిలతో కూడా షిగెరు సమావేశమయ్యారు. ఓటింగ్‌కు ముందే షిగెరు దిగిపోతేనే మంచిదని వారిద్దరూ సూచించారు. ఈ నేపథ్యంలో పార్టీలో చీలిక రావొద్దని భావించిన షిగెరు తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
రాజీనామా ప్రకటన సందర్భంగా భావోద్వేగానికి గురైన షిగెరు మాటలు తడబడ్డాయి. ‘జపాన్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కీలక సమస్యను అధిగమించాము. ఇక బాధ్యతలను తరువాతి తరానికి అప్పగిస్తున్నా’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
ట్రంప్ ‘ఫ్రెండ్స్’ కామెంట్స్‌పై స్పందించిన మోదీ.. ఎక్స్ వేదికగా రిప్లై
మోదీ గొప్ప నేత.. కానీ, ఆయన చేస్తున్నది నచ్చడం లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి