Yoga Poses: ఆసనాలతో పొట్ట తగ్గిద్దాం
ABN, Publish Date - Jul 07 , 2025 | 04:24 AM
మారిన జీవనశైలి, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వంటి కారణాలతో ఈ రోజుల్లో పొట్ట పెరగడం సాధారణం అయిపోయింది. అయితే కొన్ని యోగా ఆసనాలతో ఆ...
మారిన జీవనశైలి, ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం వంటి కారణాలతో ఈ రోజుల్లో పొట్ట పెరగడం సాధారణం అయిపోయింది. అయితే కొన్ని యోగా ఆసనాలతో ఆ పొట్టను తగ్గించుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం..
నౌకాసనం : ముందుగా నేలమీద కాళ్లను చాపి కూర్చొవాలి. తర్వాత చేతులను తొడల కింద పెట్టి రెండు కాళ్లను పైకి లేపాలి. అలా లేపుతూ శరీరాన్ని కొంచెం వెనక్కి వంచాలి. ఇలా శరీరం ఠి ఆకారంలోకి వచ్చేలా చేయాలి. తర్వాత చేతులను నిటారుగా చాపాలి. ఇప్పుడు శరీరం బరువంతా పిరుదుల మీద ఉంటుంది. 10-20 క్షణాల పాటు ఇలానే ఉండాలి. కొన్ని రోజులు అలవాటు అయిన తరువాత సమయం పెంచుకోవాలి. ఈ ఆసనం వలన పొట్టభాగంలోని కండరాలు కదిలి కొవ్వు తగ్గి పొట్ట తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ పెరుగుపడుతుంది. పొట్ట భాగానికి రక్తప్రసనరణ మెరుగుపడుతుంది.
సేతు బంధ సర్వాంగాసనం : ముందుగా నేలపై పడుకోవాలి. మోకాళ్లను మడిచి భూజాలు, చేతులను నేలమీద ఆధారం చేసి నడుమును పైకి లేపాలి. ఇలా 20-30 క్షణాల పాటు ఉండాలి. ఆ భంగిమ మెటబాలిజంను మెరుగుపరుస్తుంది. కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.
కుంభకాసనం : చేతులను నేలకు ఆనించి పుష్-ఆప్స్ చేసే భంగిమలో ఉండాలి. ఇలా నడుపు, కాళ్లు వంచకుండా 20-30 క్షణాల పాటు ఉండాలి. ఈ ఆసనం వలన పొట్ట భాగంలోని కొవ్వు తగ్గుతుంది. అలాగే చేతులు, నడుము బలంగా మారుతాయి.
భుజంగాసనం : ముందుగా నేలపై బోర్లా పడుకోవాలి. అరచేతులను నేలకు ఆనించి వాటి ఆధారంతో మెడను పైకి ఎత్తాలి. అరచేతులు నడుము కింద భాగం మాత్రమే నేలకు ఆనాలి. ఇలా 20- 30 సెకన్ల పాటు ఉండి నెమ్మదిగా మాములు స్థితికి రావాలి. ఈ భంగిమ వలన పొట్ట, నడుము కండరాలు బలపడతాయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది. పొట్ట భాగంలోని కొవ్వు తగ్గుతుంది.
త్రికోణాసనం : ముందు కాళ్లను దూరంగా పెట్టి నిల్చోవాలి. ఇప్పుడు కుడి కాలిని కొంచెం దూరంగా జరిపి ఆ పక్కకు వంగి కుడి చేతితో ఆ కాలి పాదాలను తాకాలి. ఈ సమయంలో ఎడమ చేతిని నిటారుగా పైకి లేపాలి. ఓ ఇరవై క్షణాల పాటు అలా ఉండి మాములు స్థితి రావాలి. ఇప్పుడు ఇలానే ఎడమ వైపు కూడా చేయాలి. ఈ ఆసనం పొట్టను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నడుము, కాళ్లు, చేతులను బలోపేతం చేస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి
సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో దరఖాస్తుల ఆహ్వానం
డిజిటల్ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 07 , 2025 | 04:25 AM