Scam; డిజిటల్ అరెస్టు పేరుతో.. వృద్ధుడికి రూ.53 లక్షల కుచ్చుటోపీ
ABN , Publish Date - Jul 06 , 2025 | 05:12 AM
77 ఏళ్ల ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించిన సైబర్ నేరగాళ్ల ముఠా.. రూ.53 లక్షలను కొల్లగొట్టిన ఉదంతమిది.

హైదరాబాద్ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): 77 ఏళ్ల ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించిన సైబర్ నేరగాళ్ల ముఠా.. రూ.53 లక్షలను కొల్లగొట్టిన ఉదంతమిది. అమీర్‌పేట్‌కు చెందిన బాధితుడికి.. సైబర్ నేరగాళ్ల నుంచి వీడియోకాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తనను తాను ఢిల్లీ డీసీపీ రాజ్‌వీర్‌కుమార్‌గా పరిచయం చేసుకున్నాడు. ‘‘మీపై ఢిల్లీలో మనీల్యాండరింగ్ కేసు నమోదైంది. మీ ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నట్లు నిర్ధారించాం.
మీపై అరెస్టు వారెంట్ ఇష్యూ అయ్యింది’’ అని భయపెట్టాడు. బాధితుడి బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును ఆర్బీఐ ఖాతాకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘ఒకవేళ మీ తప్పు లేదని తెలిస్తే.. ఆర్బీఐ మీ డబ్బును తిరిగి ఇచ్చేస్తుంది’’ అని నమ్మబలికాడు. అది నిజమని నమ్మిన బాధితుడు రూ.53 లక్షలను మోసగాళ్లు పేర్కొన్న బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. తన డబ్బు తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి, సైబర్ క్రైమ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.