Yamini Reddys Kuchipudi Dance Performance: ఆ ఆనందం నిరంతరం
ABN, Publish Date - Dec 14 , 2025 | 06:08 AM
కూచిపూడి నృత్య ప్రపంచంలో యామినీ రెడ్డికి ఒక ప్రత్యేక స్థానముంది. సుప్రసిద్ధ నృత్య కళాకారులు రాజారెడ్డి- రాధారెడ్డిల పుత్రికగా మాత్రమే కాకుండా.. కూచిపూడి నృత్యంలో కొత్త రీతులను...
కూచిపూడి నృత్య ప్రపంచంలో యామినీ రెడ్డికి ఒక ప్రత్యేక స్థానముంది. సుప్రసిద్ధ నృత్య కళాకారులు రాజారెడ్డి- రాధారెడ్డిల పుత్రికగా మాత్రమే కాకుండా.. కూచిపూడి నృత్యంలో కొత్త రీతులను తీసుకురావటానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలకు ఆదరణ కూడా లభిస్తోంది. తాజాగా ఆమె రూపొందించిన ‘సూర్య’ అనే నృత్యరూపకాన్ని వచ్చే వారం హైదరాబాద్‌లో ప్రదర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ‘నవ్య’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
‘‘సాధారణంగా కూచిపూడి నృత్య రూపకాలు పురాణగాఽథలపైనే ఆధారపడి ఉంటాయి. ఇతివృత్తాలు వాటికి సంబంధించినవే అయి ఉంటాయి. ‘సూర్య’ కూడా అలాంటిదే! అయితే మిగిలిన వాటికన్నా భిన్నమైనది. మన చుట్టూ ఉన్న ప్రకృతి, ఈ భూమండలం, ఇతర గ్రహాలు వీటన్నింటికీ సంబంధించిన నృత్య రూపకమిది. ‘ఈ సృష్టి ఎక్కడ నుంచి ఉద్భవించింది?’ అనే ఆలోచన నుంచి పుట్టినదే ఈ రూపకం. నా ఉద్దేశంలో సృష్టి ముందు కూడా కాంతి ఉంది. అంటే సూర్యుడు ఉన్నాడు. ఇక సృష్టి విషయానికి వద్దాం. ‘ఈ సృష్టి తానంతట తానే ఉద్భవించిందా? ఎవరైనా కారణమయ్యారా?’ అనేది ఒక ప్రధానమైన ప్రశ్న. ఒక పెద్ద విస్పోటనం నుంచి రకరకాల గ్రహాలు ఏర్పడ్డాయనేది ఒక సిద్ధాంతం. దీనినే ‘బిగ్ బ్యాంగ్’ సిద్ధాంతమంటారు. ఇక మన పూర్వ గ్రంథాల్లో కూడా ఈ విస్పోటనానికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. ఇదంతా నృత్యరూపంలో చూపించాలనుకున్నా. ఈ ఆలోచన నుంచి పుట్టిందే ‘సూర్య’. మన సంస్కృతిలో సూర్యుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఖగోళ శాస్త్ర ప్రకారం కూడా సూర్యుడి చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. ‘సూర్య’ నృత్య రూపకంలో వీటన్నిటి ప్రస్తావన ఉంటుంది. ఇక ఈ సూర్యుడు ఎలా పుట్టాడనేది ఒక ప్రశ్న. సూర్యుణ్ణి బ్రహ్మ పుట్టించాడని మన పురాణాలు చెబుతాయి. సూర్యుడి నుంచి ఈ సకల బ్రహ్మాండాలలో ఉన్న జీవులు పుట్టాయని కూడా చెబుతారు. అందుకే అన్ని జీవులలో ఆత్మ ఒకటేనని అంటారు. ఆత్మ- పరమాత్మ ఒకటేనని, వేర్వేరు కాదనే సిద్ధాంతం ఇక్కడి నుంచి వచ్చినదే!
ఓరిమితో...
చాలా మంది భరతనాట్యాన్ని తమ పిల్లలకు నేర్పుదామనుకుంటారు. కొద్ది కాలం నేర్పుతారు. ఆ తర్వాత మానేస్తారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్ధం చేసుకోవాలి. ఏ కళనైనా అభ్యసించాలంటే ముందు ఓరిమి కావాలి. ఆ కళారీతిలో ఉన్న సారాన్ని అర్ధం చేసుకోవాలి. మన దేశంలో అనేక నృత్యరీతులు ఉన్నాయి. కొన్ని వేల ఏళ్ల నుంచి ఇవి మనకు వారసత్వంగా వస్తున్నాయి. ఈ నృత్యరీతుల్లో ఏదో శక్తి లేకపోతే ఇంత కాలం ఎలా మనుగడ సాగించలుగుతాయి? కాబట్టి నృత్యం నేర్చుకొనేవారికి ఓరిమి చాలా అవసరం. వారు ఒక నృత్యరీతిని పూర్తిగా అర్ధం చేసుకున్న తర్వాతే ఇతర నృత్యరీతులను నేర్చుకోవటానికి ప్రయత్నించాలి. అయితే ఇక్కడ మరో విషయం గురించి కూడా చెప్పాలి. కాలంతో పాటుగా మన అభిరుచులు మారతాయి. వాటికి తగ్గట్టుగా ఈ నృత్యరీతులు కూడా మారుతూ ఉంటాయి. అలా మారని నృత్యరీతులు కాలంలో కలిసిపోతాయి. అయితే ‘నృత్యరీతులకు ఉన్న ఆత్మను మార్చేయాలా?’ అని కొందరు అడుగుతూ ఉంటారు. ఆత్మను ముట్టుకోకుండానే ఆధునిక సాంకేతికతను జోడించవచ్చు. వర్తమానాకి అవసరమైన కొత్త ఆలోచనలను వాటిలో చొప్పించవచ్చు. అప్పుడే కొత్త తరాన్ని ఆకర్షించగలుగుతాం. ‘సూర్య’ కూడా అలాంటిదే! దీన్ని ఢిల్లీలో ప్రదర్శించినప్పుడు చాలా గొప్ప ప్రశంసలు లభించాయి.
వినోదానికి మాత్రమే కాదు...
మన భారతీయ సంస్కృతిలో భాగమైన నృత్యరీతులు కేవలం వినోదానికి మాత్రమే కాదు. వాటి ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలు ఒక తరం నుంచి మరొక తరానికి అందుతాయి. ఈ ఆధునిక యుగంలో ప్రజలు పరుగుకు అలవాటు పడిపోయారు. అన్నీ తమకు త్వరగా కావాలనుకుంటున్నారు. దీని వల్ల విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. మళ్లీ ఈ ఒత్తిడిని తగ్గించుకోవటానికి - తమ పరుగును ఆపాలనుకుంటున్నారు. అలాంటి వారికి ఈ నృత్యరీతులు ఎంతో పనికొస్తాయి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. యోగా వల్ల మన జీవితంలో మార్పు రావాలనుకుంటే- ముందు నేర్చుకోవాలి. దాన్ని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తుంటే మనకు దాని ఫలాలు అందుతాయి. నృత్యరీతులు కూడా అంతే! వాటిని క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఫలితాలు లభిస్తాయి. ఈ ఫలితం జీవితాంతం ఉంటుంది. ఒక డిస్కోకో, నైట్ క్లబ్‌కో వెళ్తే- ఆ ఆనందం కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. మర్నాడు ఆ ఆనందపు ఛాయలు కూడా ఉండవు. కానీ నృత్యరీతులు నేర్చుకున్నవారికి ఆ ఆనందం నిరంతరం ఉంటుంది.’’
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
కూచిపూడి ప్రత్యేకతలివే...
చాలామంది నన్ను భరతనాట్యానికి, కూచిపూడికి మధ్య ఉన్న తేడాలేమిటని అడుగుతూ ఉంటారు. కూచిపూడిలో కొన్ని ప్రత్యేక అభినయాలు సమ్మిళతమై ఉంటాయి. భాగవతుల సంస్కృతి ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఇతర నృత్య రీతులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. వెంటనే ఆకర్షిస్తుంది.
ఒక్కో వయస్సులో
ఒక్కో విధంగా..
నా ఉద్దేశంలో నృత్యం వల్ల ఒక్కో వయస్సులో ఒకో విధమైన లాభం కలుగుతుంది. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు శరీరం దృఢంగా ఉండటానికి ఉపకరించేది. ఆ తర్వాత నా ఆత్మాన్వేషణకు ఒక మార్గమయింది. ఈ ప్రపంచంతో మనకు ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకొనేందుకు ఒక సాధనమయింది.
ఇవి కూడా చదవండ
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్
కెప్టెన్‌గా జేమ్స్ అండర్సన్.. 43 ఏళ్ల వయసులో!
Updated Date - Dec 14 , 2025 | 06:08 AM