Minister Nimmala Ramanaidu: మోసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్
ABN , Publish Date - Dec 13 , 2025 | 06:56 AM
మోసం, దగా అనే పదాలకు వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
పూర్తికాని వెలిగొండకు ఉత్తుత్తి ప్రారంభోత్సవం: మంత్రి నిమ్మల
త్రిపురాంతకం, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): మోసం, దగా అనే పదాలకు వైఎస్ జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం ఆయన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కొత్తూరు వద్ద వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌లో 18 కి.మీ. ప్రయాణించి క్షుణ్నంగా పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, పనులు చేస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షించారు. నిర్లక్ష్యంగా పనులు చేద్దామంటే కుదరదని, చేయలేకపోతే తప్పుకోవచ్చని కొన్ని ఏజెన్సీలను సున్నితంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా నిమ్మల విలేకరులతో మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టులో క్లిష్టమైన పలు పనులు పెండింగ్‌లో ఉండగానే ఎన్నికలకు ముందు అప్పటి సీఎం జగన్ ఇక్కడ పైలాన్ నిర్మించి ఉత్తుత్తి ప్రారంభోత్సవం పేరుతో జాతికి అంకితం అనే డ్రామా ఆడారని విమర్శించారు. నిత్యం కరువు కాటకాలతో ఇబ్బందులు పడుతూ కనీసం వెలిగొండ ద్వారా తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశించిన ప్రకాశం జిల్లా ప్రజలను ఎలా మోసం చేయాలనిపించిందో ఆయనకే తెలియాలని మండిపడ్డారు. తల్లినీ, చెల్లినీ మోసం చేయగలిగిన వ్యక్తికి ప్రజలను మోసగించడం ఒక లెక్కా అని ఎద్దేవా చేశారు. వెలిగొండ ప్రాజెక్టును ప్రజా ప్రభుత్వం శరవేగంగా పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజల కలను నెరవేర్చబోతోందని నిమ్మల వెల్లడించారు. సీఎం చంద్రబాబు నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అందుకే తాను నెలలో మూడుసార్లు ప్రాజెక్టు వద్దకు వచ్చి సమీక్ష నిర్వహించి పనుల్లో వేగం పెరిగేలా చూస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, సీఈ శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.