ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhagavad Gita Remembering Shlokas: గీత గుర్తుకురాదేం

ABN, Publish Date - Dec 05 , 2025 | 05:24 AM

నేను భగవద్గీత చాలాసార్లు చదివాను. చాలామంది రాసిన వ్యాఖ్యానాలూ చదివాను. చాలా శ్లోకాలు, వాటి అర్థాలు కంఠతా వచ్చేశాయి. ఇప్పటికిప్పుడు అప్పచెప్పమంటే వంద శ్లోకాలైనా చెప్పేయగలను. ఎన్నోసార్లు....

భగవద్గీత

నేను భగవద్గీత చాలాసార్లు చదివాను. చాలామంది రాసిన వ్యాఖ్యానాలూ చదివాను. చాలా శ్లోకాలు, వాటి అర్థాలు కంఠతా వచ్చేశాయి. ఇప్పటికిప్పుడు అప్పచెప్పమంటే వంద శ్లోకాలైనా చెప్పేయగలను. ఎన్నోసార్లు సమావేశాల్లో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు, ఆ సమావేశం సందర్భాన్ని బట్టి ఒకటి రెండు శ్లోకాలు చెప్పాలని ముందుగా అనుకొని, ప్రసంగం మొదలుపెట్టేవాణ్ణి. ప్రసంగం అయిపోయాక గుర్తుకువచ్చేది.. శ్లోకం చెప్పడం మరచిపోయానని! ఇలా కాదని... చిన్న కాగితం మీద రాసుకొని, జేబులో పెట్టుకొని, ప్రసంగం మొదలుపెట్టి... అదీ మరచిపోయేవాణ్ణి. అలా కొన్నాళ్ళు గడిచాక... ‘భగవద్గీత చెప్పే అర్హత నాకు లేదేమో! అందుకే ఆ సమయానికి అలా అవుతోంది’ అని బాధపడేవాణ్ణి. దేవుణ్ణి పూర్తిగా నమ్మే నేను... నాలాంటివాళ్ళు భగవద్గీతను ప్రస్తావించడం దేవుడికి నచ్చకే ఇలా జరుగుతోందేమోనని సమాధానపడేవాణ్ణి. ‘నాలో ఏం తక్కువయిందని దేవుడు ఇలా సమయానికి గీత గుర్తుకురాకుండా చేస్తున్నాడో?’ అని మధనపడేవాణ్ణి కూడా.

ఆ శాపం సంగతి నాకు తెలుసు...

కొన్నాళ్ళ క్రితం రష్యాలో ఒక కోర్టు... భగవద్గీతను ‘హింసను ప్రేరేపించే గ్రంథం’ అంటూ నిషేధించిందనే వార్త భగ్గుమంది. భగవద్గీతను నమ్మేవారు, చదివినవారు... మనవాళ్ళందరూ ఖండించారు. రష్యా కోర్టు ఆదేశాలను గర్హిస్తూ అప్పట్లో... లోక్‌సభలో చర్చ జరిగింది. ఆ చర్చలో మాట్లాడుతున్నవారు రష్యా కోర్టు తీర్పును, భగవద్గీత గొప్పతనాన్ని చెబుతున్నారే తప్ప... అందులో ఒక శ్లోకాన్నీ చెప్పలేదు. మేమందరం కూర్చొని వింటున్నాం. అప్పటికే ఆరుసార్లు ఎంపీ అయిన సాయిప్రతాప్‌ (రాజంపేట) నాకు పాతికేళ్ళకుపైగా మంచి మిత్రుడు. అప్పుడప్పుడు మేమిద్దరమే ఉన్నప్పుడు.. భగవద్గీత శ్లోకాలు చెబుతూ ఉండేవాణ్ణి. ఆయనకు కూడా చాలా ఆసక్తి. ‘‘నువ్వు లేచి నాలుగు శ్లోకాలు చదువు అరుణ్‌’’ అన్నాడాయన. నా పక్కనే కూర్చున్న విశాఖపట్నం (అప్పటి) ఎంపీ సబ్బం హరి ‘‘లేలే! ఇప్పుడు కాకపోతే నీ భగవద్గీత ఇంకెప్పుడు పనికొస్తుంది?’’ అని తొందరపెట్టాడు. నేను ‘‘వద్దు, వద్దు’’ అన్నాను. నా బలహీనత నాకు తెలుసు. మొదలుపెట్టిన తరువాత ఏ శ్లోకమూ గుర్తుకురాదు. ఆ శాపం సంగతి నాకే తెలుసు!

గీతాప్రచారకుణ్ణి అయిపోయాను....

ఈలోపున సాయిప్రతాప్‌ వెళ్ళి... (అప్పటి) పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి పవన్‌ బన్సల్‌కు నా పేరు ఇచ్చి వచ్చేశారు. స్పీకర్‌ నా పేరు పిలిచారు. అప్పుడు ‘‘యదృచ్ఛా లాభసంతుష్టో’’ అనే శ్లోకంతో మొదలుపెట్టాను. సభలో ఊహించని స్పందన కనిపించింది. ఇంకో శ్లోకం చెప్పాను. ఆ రోజు నా ప్రసంగం తరువాత... లోక్‌సభలో తెలుగేతర సభ్యులందరికీ నేను గీతాప్రచారకుడిగా పరిచయమైపోయాను. నాకే ఆశ్చర్యం వేసింది. ఇంకా శ్లోకాలు గుర్తుకు వచ్చేస్తున్నాయి. ‘అంటే... ఏ వేదికమీద శ్లోకం అవసరమో అక్కడే గీత గుర్తుకు వచ్చేలా దేవుడు ఏర్పాటు చేశాడన్నమాట’ అనుకున్నాను. అంతకుముందు... రోజూ నోట్లో ఆడుతూ ఉండే ఎన్నో శ్లోకాలు ఉపన్యాసంలో చెబుదామంటే గుర్తుకు రాకపోవడం అనేది నాకు అర్థం కాని పజిల్‌గానే మిగిలిపోయింది.

ఆయనే నా వల్ల కాదన్నాడు...

ఆ తరువాత ‘యత్‌ తద్‌ భగవతా ప్రోక్తం’, ‘శ్రావితస్త్యం మయా గుహ్యే...’ తదితర శ్లోకాలు చదివాక... ఆ పజిల్‌ కొంతవరకూ విడిపోయింది. వాటి సారాంశం ఏమిటంటే.... ‘‘యుద్ధంలో చెప్పావే... అవే మళ్ళీ ఒక్కసారి చెప్పు కృష్ణా!’’ అని అడిగాడు అర్జునుడు. ‘‘అప్పుడు చెప్పాను గానీ... ఇప్పుడు మళ్ళీ చెప్పమంటే ఎలా?’’ అన్నాడు కృష్ణుడు. ‘‘అప్పుడు ఒత్తిడిలో ఉండడం వల్ల సరిగ్గా బుర్రకెక్కలేదు. మళ్ళీ ఒకసారి చెప్పించుకోవాలని అప్పట్నుంచీ అనుకుంటున్నాను’’ అని చెప్పాడు అర్జునుడు. ‘‘చాల్చాల్లే! అంత వివరంగా ధర్మసూక్ష్మాలను చెబితే... ఇప్పుడు మళ్ళీ చెప్పమంటావా... అది నావల్ల అయ్యే పని కాదు’’ అన్నాడు కృష్ణుడు. చెప్పడానికి చికాకువేసి ఆయన అలా అన్నాడేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే యుద్ధం మొదట్లో చెప్పిన గీత మళ్ళీ చెప్పలేదు గానీ... దానికి బదులు అలాంటిదే ‘బ్రాహ్మణ గీత’ మొత్తం చెప్పాడు. సాక్షాత్తూ కృష్ణ పరమాత్మే ‘‘మళ్ళీ చెప్పమంటే నా వల్లకాదు’’ అన్న గీత... సామాన్యుణ్ణి... నాకు గుర్తుకురాకపోతే బాధెందుకు! మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేవరకూ బట్టీపట్టడమే!

ఉండవల్లి అరుణ్‌కుమార్‌

ఈ వార్తలు కూడా చదవండి

'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 05 , 2025 | 05:24 AM