Venkaiah Naidu: 'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
ABN , Publish Date - Dec 04 , 2025 | 03:16 PM
తాను చదువుకునే రోజుల్లో తెలియక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గుర్తుచేశారు. తాను వీధి బడిలో చదువుకుని... ఉప రాష్ట్రపతి వరకు వెళ్లానని తెలిపారు.
కృష్ణా , డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలుగు భాషపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం ఇస్తామంటేనే తెలుగు చదువుతారని వ్యాఖ్యానించారు. మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీలో కృష్ణా తరంగ్ - 2025 ఉత్సవాలను ఇవాళ(గురువారం) ప్రారంభించారు. రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు జయంతి సందర్భంగా తెలుగు భాషను ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉత్తర, ప్రత్యుత్తరాలు చేసేలా ఉండాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. అదే రామోజీరావుకి ఇచ్చే ఘన నివాళి అని తెలిపారు.
ఇంగ్లీష్ వాళ్లు వారి భాషను అధికార భాషగా ఏర్పాటు చేసుకుని పాలన చేశారని... మనం తెలుగు వాళ్లం కాబట్టి తెలుగును పరిపాలన భాషగా చేసుకోవాలని సూచించారు. భారతీయ భాషలను కాపాడాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆలోచిస్తున్నారని చెప్పుకొచ్చారు. మెడికల్, ఇంజనీరింగ్ బోధన ఆయా మాతృభాషల్లో జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. మనకు ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోయినా పేపర్ మీద రాసుకుని మాట్లాడతారని పేర్కొన్నారు వెంకయ్య నాయుడు.
ఇంగ్లీష్ మాట్లాడితేనే గొప్ప అని కొంతమంది భావిస్తున్నారని.. ముందు మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వాలని... ఆ తర్వాత సోదర భాషలు నేర్చుకోవాలని కోరారు. తాను చదువుకునే రోజుల్లో తెలియక హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నానని గుర్తుచేశారు. తాను వీధి బడిలో చదువుకుని... ఉప రాష్ట్రపతి వరకు వెళ్లానని తెలిపారు. దేశంలో 22 భాషలు ఉన్నాయని... రాజ్యసభలో ఈ భాషలోనైనా మాట్లాడవచ్చనే ఉత్తర్వులు ఇచ్చామని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Bijapur Encounter: బీజాపూర్ ఎన్‌కౌంటర్.. 20కి పెరిగిన మృతుల సంఖ్య..
శ్వాస తీసుకోలేడు.. అన్నం తినలేడు.. ఏడాది గడిచినా దయనీయ స్థితిలోనే శ్రీతేజ్
Read Latest AP News And Telugu News