White Discharge in Women: ఆ తెలుపు సహజమేనా
ABN, Publish Date - Oct 07 , 2025 | 01:43 AM
యుక్త వయసు మొదలుకుని మెనోపాజ్ వరకూ మహిళల్లో కనిపించే అత్యంత సాధారణ లక్షణం... ‘తెల్లబట్ట’! అయితే ఈ లక్షణాన్ని ప్రమాదకరంగా పరిగణించే సందర్భాలు కూడా ఉంటాయి. వాటి...
వైట్ డిశ్చార్జ్
యుక్త వయసు మొదలుకుని మెనోపాజ్ వరకూ మహిళల్లో కనిపించే అత్యంత సాధారణ లక్షణం... ‘తెల్లబట్ట’! అయితే ఈ లక్షణాన్ని ప్రమాదకరంగా పరిగణించే సందర్భాలు కూడా ఉంటాయి. వాటి గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.
మహిళల్లో కనిపించే తెల్లబట్టను వైద్య పరిభాషలో ‘లుకోరియా’ అంటారు. యుక్తవయసు మొదలు మెనోపాజ్ దశ వరకూ మహిళల్లో ఈ లక్షణం కనిపించవచ్చు. మరీ ముఖ్యంగా టీనేజీ వయసు ఆడపిల్లల్లో ఈ లక్షణం అత్యంత సహజం. ఈ వయసు పిల్లల్లో హార్మోన్ల ఉధృతి ఫలితంగా తెల్లబట్ట కనిపించవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లను కలిగి ఉండి, లైంగిక క్రీడలో పాల్గొనని యువతులు వైట్ డిశ్చార్జ్ గురించి కంగారుపడవలసిన అవసరం లేదు. ఒకవేళ స్రావం ఎక్కువగా ఉంటే ప్యాంటీ లైనర్స్ వాడుకోవాలి. అయితే ఈ సహజసిద్ధ స్రావానికి భయపడిపోయి వైద్యుల దగ్గరకు పరుగులు పెట్టే మహిళలు కూడా ఉంటారు. అయితే తెల్లబట్టను ఎప్పుడు ప్రమాదకరంగా భావించాలో తెలుసుకుని ఉండడం కూడా అవసరమే!
ఇవి సహజం
ఈ లక్షణాలతో కూడిన తెల్లబట్టతో ప్రమాదం లేదు. అవేంటంటే...
దుర్వాసన లేకపోవడం
తెల్లసొనలా పారదర్శకంగా ఉండడం
జిగటతో సాగే గుణాన్ని కలిగి ఉండడం
ఇవి అసహజం
పెరుగును పోలి ఉండడం
పసుపు, ఆకుపచ్చ రంగులను కలిగి ఉండడం
దుర్వాసన వెలువడడం
దురద, మంట, అసౌకర్యం
కారణాలు ఇవే!
దుర్వాసనతో కూడిన అసహజమైన తెల్లబట్టకు వేర్వేరు కారణాలుంటాయి. పలు రకాల ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లు, లైంగిక వ్యాధులు, రక్తలేమితో వ్యాధినిరోధకశక్తి తగ్గడం.. ఈ సందర్భాల్లో దుర్వాసనతో కూడిన వైట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే ఫెలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోయి గర్భధారణ సమస్యలు తలెత్తవచ్చు, గర్భాశయ ముఖద్వారం దగ్గర పుండు ఏర్పడవచ్చు. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో క్యాన్సర్‌గా మారవచ్చు. కాబట్టి తరచూ ఇన్‌ఫెక్షన్లతో కూడిన తెల్లబట్ట వేధిస్తున్నా, దుర్వాసన, రంగుతో కూడిన స్రావాలు కనిపిస్తున్నా, దురద, మంట వేధిస్తున్నా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. రక్తపరీక్ష, శ్వాబ్ టెస్ట్‌తో ఇన్‌ఫెక్షన్ కారణాలను కనిపెట్టి వైద్యులు తగిన చికిత్సలను సూచిస్తారు. అలాగే క్యాన్సర్‌ను నిర్థారించే పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవడం కూడా అవసరమే!
చికిత్స ఇలా...
ఇన్‌ఫెక్షన్ సంబంధిత తెల్లబట్టకు వైద్యులు ప్రారంభంలో నోటి మాత్రలు సూచిస్తారు. అవసరాన్ని బట్టి జననావయవం దగ్గర ఉపయోగించే మాత్రలు, జెల్స్‌ను కూడా వైద్యులు సూచిస్తారు. రక్తం తక్కువగా ఉన్నప్పుడు ఐరన్ మాత్రలు సూచిస్తారు. ఒకవేళ ఈ చికిత్సతో సమస్య అదుపులోకి రాకపోతే, గర్భాశయ ముఖద్వారం దగ్గర ఏర్పడిన పుండును మాన్పడం కోసం ‘క్రయోథెరపీ’ని ఆశ్రయించాలి. దీంతో పుండు దగ్గరి వ్యాధికారక కణాలు చనిపోయి, కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. వైట్ డిశ్చార్జ్ వల్ల ఫెలోపియన్ ట్యూబులు పూర్తిగా మూసుకుపోయినప్పుడు, దెబ్బతిన్న ట్యూబును కత్తిరించి, కలపవలసి వస్తుంది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌గా మారితే, ఫెలోపియన్ ట్యూబ్స్‌తో పాటు గర్భాశయాన్ని తొలగించవలసి వస్తుంది. ఒకవేళ క్యాన్సర్ ఇతర అవయవాలకు పాకితే, కీమోథెరపీ, రేడియేషన్ కూడా అవసరమవుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
జననావయాలను శుభ్రంగా ఉంచుకోవాలి
నెలసరి సమయంలో ప్యాడ్స్ పట్ల శుభ్రత పాటించాలి
సర్జరీల తర్వాత ఇన్‌ఫెక్షన్లు సోకకుండా చూసుకోవాలి
అసురక్షిత లైంగిక విధానాలకు దూరంగా ఉండాలి
పోషకాహారంతో రక్తలేమిని తొలగించుకోవాలి
వ్యాధినిరోధకశక్తి తగ్గకుండా చూసుకోవాలి
మధుమేహాన్ని మందులతో అదుపులో పెట్టుకోవాలి
డాక్టర్ పి.నీలిమ, హెచ్‌ఒడి,
అబ్‌స్టెట్రీషియన్ అండ్ గైనకాలజీ,
రెనోవా హాస్పిటల్స్,
సనత్ నగర్, హైదరాబాద్.
ఇవి కూడా చదవండి..
ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News
Updated Date - Oct 07 , 2025 | 01:43 AM