Bihar Assembly Elections: ఈసారి ఎన్నికలు ఈ ముగ్గురికీ యాసిడ్ టెస్ట్
ABN , Publish Date - Oct 06 , 2025 | 07:01 PM
జనతాదళ్(యునైటెడ్) చీఫ్ అయిన 74 ఏళ్ల నితీష్ కుమార్ గత రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసి 'సుశాసన్ బాబు'గా ఆయన పేరు తెచ్చుకున్నారు.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ (ECI) సోమవారం నాడు ప్రకటించడంతో ఒక్కసారిగా అన్ని ప్రధాన పార్టీల్లోనూ వేడి రాజుకుంది. ఈ ఎన్నికలు ముగ్గురు ముఖ్య నేతలకు అగ్నిపరీక్షగా నిలువనున్నాయి. వీరు సాధించే విజయం కానీ, అపజయం కానీ ప్రధానంగా ఆ పార్టీ భవిష్యత్తుపై పడే అవకాశాలు ఉండొచ్చు. అలాగే బిహార్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభంకానూ వచ్చు. ఆ ప్రముఖుల విశేషాల్లోకి వెళ్తే...
నితీష్ కుమార్: జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ అయిన 74 ఏళ్ల నితీష్ కుమార్ (Nitish Kuamr) గత రెండు దశాబ్దాలుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసి 'సుశాసన్ బాబు'గా ఆయన పేరు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల కాలంలో పాలనాపరమైన చర్యల కంటే తరచూ పొత్తులు మారుస్తుండటమే పనిగా పెట్టుకున్నారనే ప్రచారాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఉటంకిస్తూ... మళ్లీ జేడీయూ-బీజేపీ కూటమి గెలిస్తే అత్యున్నత పదవిని (ముఖ్యమంత్రి) ఆయన నిర్వహించగలరా? అనే ప్రశ్నలతో సోషల్ మీడియోలో వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే బీజేపీ మాత్రం ఇంతవరకూ నితీష్‌కు ప్రత్యామ్నాయం ఎవరనేది బయటపెట్టకుండానే నితీష్ సారథ్యంలోనే ఎన్నికలు వెళ్తామని చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నితీష్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా? రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణస్వీకారం చేస్తారా? రాబోయే ఫలితాలతో బిహార్‌లో నితీష్ కుమార్ శకానికి తెరపడుతుందా? అనే ప్రశ్నలు ఆసక్తి కలిగించనున్నాయి.
తేజస్వి యాదవ్: ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూ ప్రసాద్ తనయుడైన 35 ఏళ్ల తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ఈ ఎన్నికల్లో గటి సవాలును ఎదుర్కోనున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేసి 75 స్థానాలు గెలుచుకుంది. అయితే ఆ పార్టీ భాగస్వామి అయిన కాంగ్రెస్ సరైన ఫలితాలు రాబట్టలేకపోవడంతో ప్రభుత్వ ఏర్పాటు దూరంగానే ఆర్జేడీ నిలిచిపోయింది. గత ఎన్నికల నుంచి ఈసారి ఎన్నికల వరకూ చూస్తే లాలూ ఆరోగ్య పరిస్థితి రీత్యా ఆర్జేడీని ఒంటిచేత్తో తేజస్వి ముందుకు తీసుకువెళ్తున్నారు. గతేడాది లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ అంతగా ఆకట్టుకోకపోయినా రాష్ట్ర ఎన్నికల్లో గట్టి ఫలితాలు రాబట్టేందుకు పట్టుదలగా ఉన్నారు. రాహుల్ 'ఓటర్ అధికార్ యాత్ర'లో తేజస్వి పాల్గొనడంతోపాటు, సొంతంగా 'బిహార్ అధికార్ యాత్ర' చేపట్టి ఓటర్లకు చేరువయ్యేందుకు గట్టి కసరత్తు సాగిస్తున్నారు. అటు నితీష్ ప్రభుత్వం, ఇటు బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ మార్పు కోసం యువతకు పట్టం కట్టాలని పిలుపునిస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) బిహార్‌లో సమూల మార్పులు తెస్తామంటూ 'జన్ సురాజ్' పార్టీతో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. 2022లో రాష్ట్రవ్యాప్తంగా యాత్ర నిర్వహించి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేశారు. ప్రజల నుంచి తమ పార్టీకి కనిపిస్తున్న స్పందన ఎన్నికల ఫలితాలపై గట్టి ప్రభావం చూపనున్నట్టు ఆయన చెబుతున్నారు. అయితే ఆయన వాదనను ప్రధాన స్రవంతిలోని పార్టీల నేతలు కొట్టివేస్తున్నారు. పీకే (PK)కు ఫ్లాప్ షో తప్పదని చెబుతున్నారు. సోషల్ మీడియా దన్నుతో దూసుకువెళ్తున్న ప్రశాంత్ కిషోర్.. తన అంచనాలకు తగ్గట్టు ఏ మేరకు ఫలితాలు సాధిస్తారనేది ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ వేచిచూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..
ఎన్నికల ప్రక్రియ సరళం.. శాంతిభద్రతలపై డేగకన్ను
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
Read Latest Telangana News and National News