Bihar Assembly Election 2025: బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, జూబ్లీహిల్స్ బైపోల్ కూడా..
ABN , Publish Date - Oct 06 , 2025 | 04:14 PM
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. దీంతో పాటు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక..
ఢిల్లీ, అక్టోబర్ 6: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ (గురువారం) ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల వివరాలు వెల్లడించింది. ఈ మేరకు రెండు విడతలుగా బిహార్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ విడుదల చేసింది. పోలింగ్ తేదీలు, తదితర వివరాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వెల్లడించారు. నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
బిహార్ లో రెండు దశల్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ చెప్పింది. దీంతోపాటు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కూడా నిర్వహిస్తారు. ఈ మేరకు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు వెల్లడించింది.
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని, ఆగస్టు 1న ఓటర్ల తుది జాబితా ప్రకటించామని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. బిహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఓటర్ల జాబితాలో సవరణలకు ఇంకా అవకాశం ఉందనీ ఆయన పేర్కొన్నారు. నామినేషన్లకు 10 రోజుల ముందూ ఓటర్ జాబితాలో మార్పులు చేసుకోవచ్చని సూచించారు.
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈసారి ఎన్నికల ప్రక్రియ మరింత సులభతరం చేస్తున్నామని సీఈసీ వెల్లడించింది. బిహార్ ఎన్నికల కోసం 90,712 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి పోలింగ్ స్టేషన్‌లోనూ వెబ్‌క్యాస్టింగ్ ఉంటుందని సీఈసీ స్పష్టం చేసింది.
తేదీలు ఇవే..
బిహార్ మొదటి విడత ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 10న విడుదల అవుతుంది. నామినేషన్ల దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 17. నామినేషన్ ఉపసంహరణ గడువు అక్టోబర్ 20తో ముగుస్తుంది. నవంబర్ 6 తేదీన మొదటి విడత ఎన్నికలు జరుగుతాయి.
ఇక, రెండో విడత ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 13న విడుదల చేస్తారు. నామినేషన్ల దరఖాస్తుకు అక్టోబర్ 20 చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 23 వరకూ అవకాశం ఉంటుంది. తుది దశ ఎన్నికల పోలింగ్ నవంబర్ 11న జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న విడుదల చేస్తారు.
కొత్తగా 17 సంస్కరణలు..
85 ఏళ్ల పైబడిన ఓటర్లకు ఇంటి దగ్గరే ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎలాంటి ఫిర్యాదుకైనా 1950 నెంబర్‌కు ఫోన్ చేసే అవకాశం ఉంటుందని, సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. బిహార్ ఎన్నికల నుంచి కొత్తగా 17 సంస్కరణలు తీసుకొస్తున్నామని కూడా చెప్పింది. ఈ సంస్కరణలను భవిష్యత్‌లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఎన్నికల కమిషన్ చెప్పింది.
ఓటర్లు ఎంతమంది అంటే..
బిహార్‌లో మొత్తం 7.42 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 14 లక్షల మంది కొత్త ఓటర్లని సీఈసీ చెప్పింది. ఇక నుంచి EVMలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఉంటాయని ఎన్నికల సంఘం పేర్కొంది.