Disha Palnati: ఫ్యాషన్ వరలో దశ దిశలా
ABN, Publish Date - Aug 25 , 2025 | 05:16 AM
విశ్వవేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమంటే సాధారణ విషయం కాదు. అందులోనూ ఫ్యాషన్ వరల్డ్ అంటే పోటీ తీవ్రంగా ఉంటుంది. అటువంటి పోటీల్లో తొలిసారి పాల్గొని ఓవరాల్ విన్నర్‌గా నిలిచింది విశాఖకు చెందిన దిశ పల్నాటి...
విశ్వవేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడమంటే సాధారణ విషయం కాదు. అందులోనూ ఫ్యాషన్ వరల్డ్ అంటే పోటీ తీవ్రంగా ఉంటుంది. అటువంటి పోటీల్లో తొలిసారి పాల్గొని ఓవరాల్ విన్నర్‌గా నిలిచింది విశాఖకు చెందిన దిశ పల్నాటి. దుబాయ్ వేదికగా జరిగిన మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్ పోటీల్లో పాల్గొని దిశ తన ప్రతిభను చాటింది. ఈ సందర్భంగా ‘నవ్య’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లో...
‘‘మాది విశాఖపట్నం. నాన్న పీఎస్ రవికుమార్ ఇండియన్ నేవీలో కెప్టెన్‌గా పని చేస్తున్నారు. అమ్మ వాలంటీనాకు ఫ్యాషన్ రంగంతో సంబంధం ఉంది. జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక కల్చరల్ ఫెస్ట్‌లకు అమ్మ డైరెక్టర్‌గా వ్యవహరించింది. చిన్నప్పటి నుంచి అమ్మను చూస్తూ పెరిగిన నాకు తెలియకుండానే ఫ్యాషన్ రంగం పట్ల ఆసక్తి పెరిగింది. నేను నాలుగో తరగతి చదువుతున్న సమయంలో దక్షిణాఫ్రికాలోని జొహన్నె్‌సబర్గ్‌లో ‘లిటిల్ మోడల్ ఎర్త్’ పోటీల్లో పాల్గొన్నా. చిన్నపిల్లల కేటగిరిలో ‘సూపర్ గ్రాండ్ ప్రీ’ విన్నర్‌గా నిలిచాను. ఆ తరువాత 2016లో గ్రీస్‌లో నిర్వహించిన ‘లిటిల్ మిస్ యునైటెడ్ వరల్డ్’ పోటీల్లో పాల్గొన్నా. దాంట్లో కూడా రెండు విభాగాల్లో నాకు బహుమతులు దక్కాయి. ఈ పురస్కారాలు నాలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించాయి. 2018లో టర్కీలో జరిగిన లిటిల్ మిస్ యూనివర్స్ పోటీల్లో ‘క్వీన్ ఆఫ్ యూనివర్స్’ టైటిల్ దక్కించుకున్నా. ప్రస్తుతం నేను మణిపాల్ జైపూర్ క్యాంప్‌సలో ఇంజినీరింగ్ చేస్తున్నా.
దేశాన్ని ప్రతిబింబించేలా..
ఇటీవల దుబాయ్ వేదికగా నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ గ్రాండ్ సీ వరల్డ్-2025 కాంపిటీషన్‌లో పాల్గొన్నా. ఈ పోటీల్లో 19 దేశాల నుంచి లిటిల్, టీన్, మిస్, మిసెస్ కేటగిరీల నుంచి 60 మంది పాల్గొన్నారు. ఈ పోటీల ప్రత్యేకత ఏమిటంటే- వీటిలో వ్యక్తిగతంగా ఎవరికీ గుర్తింపు ఉండదు. అందరూ తమ తమ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. తొలిరోజు క్యాట్‌వాక్ సెషన్ జరిగింది. ఆ తరువాత నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్ నిర్వహించారు. ఈ రౌండ్‌లో ఇన్‌క్రెడిబుల్ ఇండియా థీమ్‌తో దేశాన్ని ప్రతిబింబించేలా కాస్ట్యూమ్ వేసుకున్నా. బ్లూ శారీ, వింగ్స్. తలపై కిరీటం పెట్టుకున్నా. దానిపై జాతీయ పక్షి నెమలి ఉండేట్టు చూసుకున్నా. ‘నీ బట్టలకు నేవీ బ్లూ ఎందుకు వాడారు?’ అని జడ్జీలు ప్రశ్నించారు. ‘‘తాతగారు నేవీలో పనిచేశారు. నాన్న ఇప్పుడు పనిచేస్తున్నారు. అందుకోసమే.. వారికి గౌరవ సూచకంగా ఈ రంగు బట్టలు వేసుకున్నా’’ అని చెప్పాను. ఆ తర్వాత- ‘‘ చీర అంటే ఏమిటి ’’ అని అడిగారు. ‘‘ శరీరాన్ని చూపించకుండా అందాన్ని చూపించేది చీర.. మా దేశ సంప్రదాయానికి ప్రతీక’’ అని చెప్పాను. జడ్జీలు మెచ్చుకొని నాకు బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ రౌండ్, గ్రాండ్ సీ కాస్ట్యూమ్ రౌండ్, టాలెంట్ రౌండ్‌లు జరిగాయి. అన్ని కేటగిరీలు పూర్తయిన తరువాత విజేతల ప్రకటన దశ వచ్చింది. మూడు కేటగిరీల్లో విజేతలను ప్రకటించారు. టీన్ కేటగిరీ పేరు అనౌన్స్ చేయగానే అంతా ఇండియా అంటూ నినాదాలు చేశారు. అయితే అనూహ్యంగా బల్గేరియాకు టీన్ కేటగిరీ విన్నర్ అవార్డును ఇచ్చారు. దాంతో నాకు అవార్డు రాలేదని నిరాశ చెందా. బాధపడ్డా. ఆ తర్వాత ఈ సారి ఓవరాల్ విన్నర్ అవార్డులు ఇస్తున్నామని ప్రకటించారు. అందులో ఇండియా పేరును ప్రకటించడంతో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇండియన్ నేవీలో చేరతా..
ఫ్యాషన్ పట్ల చిన్నప్పటి నుంచి అమ్మను చూసి ఆసక్తి పెరిగింది. ఆసక్తి ఉన్న రంగంలోనే ఎదగాలని.. ఎవరో ఏదో అనుకుంటారని ఆగిపోకూడదని అమ్మనాన్న చెప్పేవారు. నేను ఆ దారిలోనే ప్రయాణిస్తున్నా. నాకు ఫ్యాషన్ ఒక హాబీ. కానీ నేవీలో చేరడమనేది నా కల. ఇక మీదట దాని కోసమే ప్రయత్నిస్తా.
బూటు శ్రీనివాసరావు, విశాఖపట్నం
ఈ వార్తలు కూడా చదవండి..
లైఫ్ సైన్సెస్, మెడికల్ టెక్నాలజీ విభాగంలో తెలంగాణ హబ్‌గా ఎదిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 25 , 2025 | 05:23 AM