Uterine Fibroid Embolization: ఆ గడ్డలకు అడ్డుకట్ట సులభమే
ABN, Publish Date - Sep 02 , 2025 | 04:16 AM
గర్భాశయం లోపల తలెత్తే ఫైబ్రాయిడ్స్ పునరుత్పత్తికి ఆటంకం కలిగించవచ్చు. తీవ్రమైన నెలసరి స్రావాలతో ఇబ్బందికి పెడుతూ ఉండొచ్చు. అలాగని అంతిమ పరిష్కారంగా సర్జరీని ఆశ్రయించవలసిన అవసరం లేదు....
ఫైబ్రాయిడ్స్
గర్భాశయం లోపల తలెత్తే ఫైబ్రాయిడ్స్ పునరుత్పత్తికి ఆటంకం కలిగించవచ్చు. తీవ్రమైన నెలసరి స్రావాలతో ఇబ్బందికి పెడుతూ ఉండొచ్చు. అలాగని అంతిమ పరిష్కారంగా సర్జరీని ఆశ్రయించవలసిన అవసరం లేదు. ‘యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబొలైజేషన్’తో, సర్జరీతో పని లేకుండానే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. అదెలాగో వైద్యులు వివరిస్తున్నారు
ప్రమాదానికి గురైన బాధితుల్లో అంతర్గత రక్తస్రావాలను అడ్డుకోవడం కోసం వైద్యులు ‘ఇమేజ్ గైడింగ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ’ మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ విధానంలో భాగంగా ఇంటర్వెన్షనల్ రేడియాజలి్‌స్టలు, ఇమేజ్ గైడెన్స్ ఆధారంగా రక్తనాళాలను గుర్తించి, వాటిలో అవరోధం కల్పించడం ద్వారా రక్తస్రావాన్ని అదుపులోకి తీసుకొస్తూ ఉంటారు. ఇదే విధానాన్ని ఫైబ్రాయిడ్స్ చికిత్సలో కూడా వాడుకోవచ్చు. ఫైబ్రాయిడ్స్‌కు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను అడ్డుకోవడం ద్వారా, రక్తప్రసారానికి అడ్డుకట్ట వేసినప్పుడు ఫైబ్రాయిడ్స్ కుంచించుకుపోతాయి. తద్వారా వాటి వల్ల తలెత్తే సమస్యలన్నీ అదుపుకోలొస్తాయి. ఈ చికిత్సే యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబొలైజేషన్. నిజానికి ఈ చికిత్స కొత్తదేమీ కాదు. ఎంతో కాలంగా వాడుకలో ఉన్నదే! కానీ దీని పట్ల మహిళలకు అవగాహన తక్కువ.
పునరుత్పత్తి వయసులో ఉన్న 60 శాతం మంది మహిళల్లో గర్భాశయ ఫైబ్రాయిడ్స్ తలెత్తుతూ ఉంటాయి. ఇవి క్యాన్సర్ గడ్డలు కాకపోయినా, వాటితో తలెత్తే తీవ్ర నెలసరి స్రావాలు, నొప్పులతో వైద్యులను కలిసినప్పుడు వైద్యులు, మొదట మందులతో తర్వాత సర్జరీతో సమస్యను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గర్భాశయం జోలికి వెళ్లకుండా కేవలం ఫైబ్రాయిడ్స్‌ను మాత్రమే తొలగించే సర్జరీ (మయోమెక్టమీ)తో పాటు, కొన్ని సందర్భాల్లో గర్భాశయాన్నే తొలగించే సర్జరీ (హిస్ట్రక్టమీ) అవసరమవుతూ ఉంటుంది. అయితే ఈ రెండు రకాల సర్జరీలతో పని లేకుండా, కేవలం ఫైబ్రాయిడ్స్ లక్ష్యంగా చేసే చికిత్సే యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబొలైజేషన్. కోత, కుట్లు లేకుండా యాంజియోగ్రామ్ మాదిరిగా చేయి, లేదా కాలిలోని రక్తనాళం ద్వారా సమస్యను పరిష్కరించే చికిత్స ఇది. యాంజియోగ్రామ్ మాదిరిగానే ఈ చికిత్సలో కూడా అదే తరహా క్యాథ్ ల్యాబ్ సాంకేతికతను ఉపయోగించుకుని, ఫైబ్రాయిడ్స్‌కు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలకు చిన్నపాటి క్యాథెటర్స్‌తో అవరోధం కల్పిస్తారు. రక్తసరఫరాకు అడ్డుకట్ట వేసినప్పుడు ఫైబ్రాయిడ్స్‌కు అందవలసిన పోషణ కొరవడి, అవి కుంచించుకుపోయి, జీవం కోల్పోతాయి. దాంతో వాటి సమస్య తొలగిపోతుంది.
పలు ప్రయోజనాలున్నాయి
సాధారణంగా ఫైబ్రాయిడ్ సర్జరీలతో కొన్ని సమస్యలుంటాయి. 5 నుంచి 10 శాతం దీర్ఘకాల సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉంటాయి. కోత, కుట్లు, రక్తస్రావంతో పాటు సర్జరీ తర్వాత అంతర్గత అవయవాలు అతుక్కోవడం లాంటి సమస్యలూ ఉండొచ్చు. సర్జరీ నుంచి కోలుకోడానికి కనీసం నెల సమయం పట్టొచ్చు. అలాగే మయోమెక్టమీతో గర్భాశయంలోని అన్ని ఫైబ్రాయిడ్స్‌నూ తొలగించే సౌలభ్యం ఉండదు. కాబట్టి ఈ సర్జరీతో పోలిస్తే యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబొలైజేషన్ అన్ని విధాలా సౌకర్యవంతమైనదని చెప్పొచ్చు. దీన్లో కోత, కుట్లు ఉండవు. రక్తస్రావం ఉండదు. అనస్థీషియా అవసరం లేదు. ఒక్క రోజులోనే చికిత్స ముగించుకుని ఇంటికెళ్లిపోవచ్చు. మయోమెక్టమీ సర్జరీతో ఫైబ్రాయిడ్స్ తొలగించినంత మాత్రాన అవి మళ్లీ తలెత్తవనే భరోసా లేదు. 20 నుంచి 30 శాతం మందికి పదేళ్ల కాలంలో ఫైబ్రాయిడ్స్ తిరగబెట్టొచ్చు. ఇలాంటి సందర్భాల్లో అప్పటికే పిల్లలున్న మహిళలు గర్భాశయాన్ని తొలగించే సర్జరీలను ఎంచుకుంటూ ఉంటారు. కానీ 30 ఏళ్ల వయసులో గర్భాశయాన్ని తొలగించడం వల్ల మహిళలకు గుండె జబ్బుల ముప్పు పొంచి ఉంటుంది. కటి ప్రదేశం బలహీనపడొచ్చు. సర్జరీ వల్ల కడుపులో పేగులు అతుక్కుపోయి, అందుకోసం రెండోసారి సర్జరీ చేసే పరిస్థితి తలెత్తవచ్చు. కాబట్టి గర్భాశయంతో పని పూర్తయింది కాబట్టి దాన్ని తొలగించుకుని ఫైబ్రాయిడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవాలనుకోవడం సరైన నిర్ణయం కాదు.
పునరుత్పత్తి సమస్యల ముప్పు
సాధారణంగా పునరుత్పత్తి వయసులో ఉన్న మహిళలకు ఫైబ్రాయిడ్స్‌ను మాత్రమే తొలగించే మయోమెక్టమీ సర్జరీని వైద్యులు సూచిస్తారు. కానీ ఈ సర్జరీతో పునరుత్పత్తి సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి. యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబొలైజేషన్‌తో కూడా పునరుత్పత్తి సమస్యల ముప్పు ఉన్నప్పటికీ, మయోమెక్టమీతో పోలిస్తే ఆ ముప్పు కొంత తక్కువేనని చెప్పొచ్చు. కాబట్టి ఫైబ్రాయిడ్స్‌కు సర్జరీ వద్దనుకునేవారు, ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవాలనుకునే ఆలోచన ఉన్నవారు నిస్సందేహంగా యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబొలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. ఈ చికిత్సతో ఐదేళ్ల వరకూ ఫైబ్రాయిడ్స్ నుంచి విడుదల పొందవచ్చు. 30లలో ఉన్న మహిళల్లో ఐదేళ్ల తర్వాత తిరిగి ఫైబ్రాయిడ్స్ తలెత్తే అవకాశాలు 20ు మేరకు ఉంటాయనే విషయాన్ని కూడా మహిళలు గుర్తు పెట్టుకోవాలి. 40లలో ఉన్న మహిళలకు ఈ చికిత్సా విధానంతో ఒరిగే ప్రయోజనం ఎక్కువ, ఫైబ్రాయిడ్స్ తిరబెట్టే ముప్పు తక్కువ.
గైనకాలజీ కీలకమే!
ఫైబ్రాయిడ్స్ పెరుగుదల హార్మోన్ల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి పునరుత్పత్తి వయసులో ఉధృతంగా వేధించే ఫైబ్రాయిడ్స్, మెనోపాజ్ దశకు చేరుకునే సమయానికి వాటంతట అవే తగ్గిపోతాయి. కాబట్టి ఆ సమయంలో సర్జరీతో పని లేకుండా తేలికపాటి మందులతోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో గైనకాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. కానీ పునరుత్పత్తి వయసులో ఉన్న కొందరికి ఫైబ్రాయిడ్స్ వల్ల తీవ్ర నెలసరి స్రావంతో రక్తలేమికి గురి కావడం, నొప్పితో బాధపడడం లాంటి లక్షణాలుంటాయి. అలాగే ఫైబ్రాయిడ్స్‌తో మూత్రాశయం మీద పెరిగే ఒత్తిడి వల్ల తరచూ మూత్రవిసర్జన చేయవలసి వస్తూ ఉంటుంది. ఈ సమస్యలతో జీవన నాణ్యత దెబ్బతినే పరిస్థితి ఉన్నప్పుడు గైనకాలజి్‌స్టలను కలవడం అవసరం. అయితే సర్జరీ తప్ప మరొక పరిష్కారం లేదని వైద్యులు సూచించినప్పుడు, యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబొలైజేషన్ ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాలి.
డాక్టర్ అర్జున్ రెడ్డి,
చీఫ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అండ్ ఫౌండర్,
రివియా వాస్క్యులర్ ఇన్‌స్టిట్యూట్,
గచ్చిబౌలి, హైదరాబాద్
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
హరీష్ రావును టార్గెట్ చేసింది అందుకేనా..?
For More AP News And Telugu News
Updated Date - Sep 02 , 2025 | 04:16 AM