Share News

TPCC Chief Mahesh Kumar Goud: హరీష్ రావును టార్గెట్ చేసింది అందుకేనా..?

ABN , Publish Date - Sep 01 , 2025 | 08:05 PM

బిఆర్ఎస్ పార్టీ అవినీతిని బయట పెట్టడమే కాంగ్రెస్‌ ప్రభుత్వం లక్ష్యమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలున్నాయని గతంలో చెప్పిన కవిత.. ఆ దెయ్యాలు హరీశ్‌ రావు, సంతోష్‌ రావేనా..? ఇంకా ఎవరెవరు ఉన్నారో స్పష్టం చేయాలంటూ ఆమెను డిమాండ్ చేశారు.

TPCC Chief Mahesh Kumar Goud: హరీష్ రావును టార్గెట్ చేసింది అందుకేనా..?
TPCC Chief Mahesh Kumar Goud Vs K kavitha

హైదరాబాద్, సెప్టెంబర్ 01: మాజీ సీఎం కేసీఆర్‌పై కొందరు అగ్రనేతలు కుట్రలు చేస్తున్నారని.. వారి వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యల చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తేలిపోయిందని స్పష్టం చేశారు.

కాళేశ్వరంలో తప్పు చేసింది కేసీఆరా? లేదా హరీశ్‌ రావా? అనేది తమకు అనవసరమన్నారు. వారి ప్రభుత్వ హయాంలోనే ఈ స్కాం జరిగిందనేది స్పష్టమైందని తెలిపారు. కవిత సైతం ఇప్పుడు అదే చెప్పారంటూ పీసీసీ చీఫ్ కుండ బద్దలు కొట్టారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో మామ కేసీఆర్‌ వాటా ఎంత..? అల్లుడు హరీశ్‌ రావు వాటా ఎంత..? అనేది తేలాల్సి ఉందన్నారు.


కేసీఆర్‌ కుటుంబంలో మూడు ముక్కలాట ఫైనల్‌కి చేరిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అయినా.. కుటుంబ కలహాలను తమపై రుద్దడం ఏంటంటూ కవితపై ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఏమీ తప్పు చేయలేదంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు.. సీబీఐ అనగానే ఎందుకు జంకుతున్నారంటూ వారిని సూటిగా ప్రశ్నించారు. వారు తప్పు చేయక పోతే విచారణ ఎదుర్కోవాలని బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. మొదటి దఫా ప్రభుత్వంలో ఇరిగేషన్‌ మంత్రిగా హరీశ్‌ రావు తప్పు చేస్తే.. ఆయనపై అప్పటి సీఎం కేసీఆర్‌ బాధ్యతగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.


ఆ సమయంలోనే కల్వకుంట్ల కవిత సైతం ఎందుకు మాట్లాడ లేదు..? అంటూ టీపీసీసీ చీఫ్ సందేహం వ్యక్తం చేశారు. మొదట కేటీఆర్‌, అనంతరం కవిత అమెరికా పర్యటనకు వెళ్లి ఒక అవగాహన కదుర్చుకొని.. అంతర్గత కలహాలతో హరీష్‌రావును టార్గెట్‌ చేశారని పీసీసీ చీఫ్ పేర్కొన్నారు. కేసిఆర్ కుటుంబ కలహాలతో కాంగ్రెస్‌ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.


బిఆర్ఎస్ పార్టీ అవినీతిని బయటపెట్టడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలున్నాయని గతంలో చెప్పిన కవిత.. ఆ దెయ్యాలు హరీశ్‌ రావు, సంతోష్‌ రావేనా..? ఇంకా ఎవరెవరు ఉన్నారో స్పష్టం చేయాలంటూ ఆమెను డిమాండ్ చేశారు. కవిత మాటలు నిజమా..? ఆదివారం అసెంబ్లీ మాట్లాడిన హరీశ్‌ రావు మాటలు నిజమా..? అనేది వారు స్పష్టం చేయాలంటూ పీసీసీ చీఫ్ మహేష్ డిమాండ్ చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ

తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు

For More TG News And Telugu News

Updated Date - Sep 01 , 2025 | 08:08 PM