KCR And Harish Rao: కేసీఆర్, హరీష్ రావు మధ్యంతర పిటిషన్లపై కొన్ని ఘడియల్లో విచారణ
ABN , Publish Date - Sep 01 , 2025 | 06:49 PM
కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 01: కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలంటూ బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. అందుకోసం చీఫ్ జస్టిస్ బెంచ్‌లో వీరిద్దరి పిటిషన్లు లిస్టు అయినాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు సీబీఐకి అప్పగించాలంటూ ప్రభుత్వ నిర్ణయంపై మంగవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. లక్షల కోట్లు ప్రజా ధనాన్ని వినియోగించి.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు మేడిగడ్డ బ్యారేజీలో పగుళ్లు ఏర్పాడ్డాయి. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ స్పష్టమైన హామీ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొలువు తీరింది.
అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దాదాపు 13 నెలల పాటు వందలాది మందిని విచారించింది. ఆ జాబితాలో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, పలువురు ఐఏఎస్, నీటిపారుదల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులను సైతం ఉన్నారు. ఈ కమిషన్ తన నివేదికను ఇటీవల ప్రభుత్వానికి అందజేసింది. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నిర్మించిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి కర్త, కర్మ, క్రియా అంతా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అని స్పష్టం చేసింది. అలాగే ఆర్థిక మంత్రులుగా పని చేసిన హరీష్ రావు, ఈటల రాజేందర్ సైతం బాధ్యులని పేర్కొంది. వీరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది.
ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో తమను అరెస్ట్ చేయవద్దంటూ కేసీఆర్, హరీష్ రావులు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. అయితే తాజాగా ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా నిర్ణయించి.. ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమపై ముందస్తుగా ఎటువంటి చర్యలు తీసుకోకుండా.. ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ వీరిద్దరు తెలంగాణ హైకోర్టులో మధ్యంతర పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి జరిగిందని ఒప్పుకున్న కవిత: కాంగ్రెస్ నేతలు
తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై కమిటీ ఏర్పాటు
For More TG News And Telugu News