Laxmi Sunita Transforming Village Life: గ్రామాభ్యున్నతే ఆశయంగా
ABN, Publish Date - Oct 29 , 2025 | 05:32 AM
ఉన్న ఊరును కన్నతల్లిగా భావించారు. గ్రామ శ్రేయస్సే ధ్యేయంగా... ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల ‘సర్పంచ్ సంవాద్’ పోటీల్లో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతిని అందుకున్నారు. జనంతో మమేకమై...
ఉన్న ఊరును కన్నతల్లిగా భావించారు. గ్రామ శ్రేయస్సే ధ్యేయంగా... ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల ‘సర్పంచ్ సంవాద్’ పోటీల్లో జాతీయస్థాయిలో ప్రథమ బహుమతిని అందుకున్నారు. జనంతో మమేకమై, వారి సంక్షేమానికి పాటుపడుతున్న ఏలూరు జిల్లా చేబ్రోలు సర్పంచ్ రాంధే లక్ష్మీ సునీత ప్రయాణం గురించి ఆమె మాటల్లోనే...
‘‘మాది ఏలూరు జిల్లాలోని ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామం. మా నాన్న వెంకట్రావు టైలర్, అమ్మ చెల్లమ్మ గృహిణి. ఇంటర్ చదువుతుండగానే నాకు వివాహం అయ్యింది. చదువుపై మక్కువతో... పెళ్లయిన 15 ఏళ్ల తర్వాత ఏఎన్‌యూలో దూరవిద్య ద్వారా బీఏ పూర్తి చేశాను. 2021 ఎన్నికల్లో బీసీ మహిళకు మాగ్రామ సర్పంచ్ పదవి రిజర్వ్ అయ్యింది. ఎన్నికల్లో 900 ఓట్ల మెజార్టీతో మాజీ సర్పంచ్ భార్యను ఓడించాను. నా భర్త రాజారావు గతంలో రెండుసార్లు సర్పంచ్‌గా, ఒకసారి ఎంపీటీసీగా పనిచేశారు. ఎప్పుడూ ఆయన పాలన వ్యవహరాల గురించి నేను పట్టించుకోలేదు. సర్పంచ్ అయ్యాక... కన్నతల్లిలాంటి మా ఊరును ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నాను. సమస్యల పరిష్కారంపై దృష్టి నిలిపాను. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, డంపింగ్‌యార్డు నిర్వహణ, పారిశుధ్య పనులు... ఇలా ప్రతిదాన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నాను.
ప్లాస్టిక్‌పై సమరం...
పదవిని స్వీకరించిన తొలి ఏడాది ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలపై ప్రచారం చేశాను. సామర్లకోటలో ఈ అంశంపై ఇచ్చిన శిక్షణ కార్యక్రమాలకు హాజరై, సంబంధిత అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళాను. అది గ్రామస్తుల్లో మరింత చైతన్యం నింపింది. దాంతో మా ఊరిని జిల్లా స్థాయి శిక్షణ కేంద్రంగా ఎంపిక చేశారు. జిల్లావ్యాప్తంగా చేపట్టే అవగాహన కార్యక్రమాలకు ఇప్పటికీ ఇక్కడినుంచే శ్రీకారం చుడుతున్నారు. ప్రతిరోజూ ఐదు టన్నుల చెత్తను డంప్‌యార్డుకు తరలించి, అక్కడికక్కడే జీరో వేస్టేజ్‌గా మారుస్తున్నాం. ప్రధానంగా బయోడిగ్రేడబుల్ (సీసాలు, ఇనుము) వస్తువులను పాత సామాన్ల వారికి విక్రయిస్తున్నాం. తడి చెత్తను సేంద్రియ ఎరువుకు, పొడి చెత్తను కంపోస్టుకు వినియోగిస్తున్నాం. గ్రామంలోని పూలమొక్కలు, పంట అవసరాలకు ఆ వ్యర్థాల్లో చాలావరకూ వినియోగించేలా చర్యలు చేపట్టాను.
ప్రత్యేకంగా మహిళా దినోత్సవాలు...
గ్రామంలోని మహిళలను ప్రోత్సహించడం కోసం ప్రతి మహిళా దినోత్సవాన్ని ఒక్కో థీమ్‌తో నిర్వహించడం ప్రారంభించాను. 2021లో వర్కింగ్ ఉమెన్స్, టీచర్లు, ఇతర మహిళల సాధక బాధలను తెలుసుకునేందుకు భారీ సమావేశం ఏర్పాటు చేశాను. అక్కడ బృంద చర్చలద్వారా వారిలో చైతన్యం కలగడానికి దోహదం చేశాను. 2022లో కిశోర బాలికల ఆరోగ్య సంరక్షణ, నేప్‌కిన్స్ వాడకం తదితర అంశాలపై కార్యక్రమాలు నిర్వహించాను. 2023లో... భర్త మరణించిన తర్వాత కుటుంబాలను నడుపుతున్న ఒంటరి మహిళలను సత్కరించాను. ఆలాగే 2024లో డ్వాక్రా రుణాలను, బ్యాంకు లింకేజి రుణాలను సకాలంలో కట్టిన వారిని సన్మానించి, అందరూ ఆ దిశగా సాగేలా ప్రేరణ కలిగించాను. ఈ ఏడాది ‘ఇల్లాలి ఆరోగ్యం- ఇంటి రక్షణ’ అనే థీమ్‌తో... వైద్యుల ద్వారా వివిధ సమస్యలపై అవగాహన కల్పించడంతోపాటు చికిత్సలు కూడా చేయించాను. ఆ తరువాతే ప్రభుత్వం ‘స్వశక్తి- నారీ సశక్తి అభియాన్’ను చేపట్టింది.
తొలి ప్రయత్నంలోనే పురస్కారం..
‘భారత నాణ్యతా మండలి’ (క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా), ‘జల్ జీవన్’ మంత్రిత్వశాఖ ఆరు నెలలు క్రితం ‘సర్పంచ్ సంవాద్’ పేరిట ఒక యాప్‌ను రూపొందించి, దేశవ్యాప్తంగా ఉన్న లక్షమంది సర్పంచులను అందులో చేర్చాయి. ప్రతినెలా ఒక ఽథీమ్‌తో, ఆన్‌లైన్ విధానంలో సర్పంచ్‌లకు పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నాయి. ఈ ఏడాది జూలై నెలలో పోటీలకు ఎంట్రీలను ఆహ్వానించారు. గ్రామంలో చేపట్టిన మెరుగైన పాలన, గ్రామాభివృద్ధి, సమన్వయం, సాంకేతికత, సమాచార మార్పిడి... అందులో ప్రధానాంశాలు. దీనికోసం నేను 80 సెకన్ల వీడియోను పంపాను. ఆ తరువాత నన్ను ఢిల్లీకి ఆహ్వానించారు. సెప్టెంబర్ 15న నిర్వహించిన జాతీయ సదస్సులో 15 మంది సర్పంచ్‌లకు డిబేట్ నిర్వహించారు. నేను నా వీడియో క్లిప్పింగ్స్‌ను ప్రదర్శిస్తూ, తెలుగులోనే వివరించాను. అందులో మహిళా సాధికారిత, డంప్‌యార్డులోనే సేకరించిన చెత్తను జీరో చేయడం, బాల్య వివాహాలను అరికట్టడం తదితర అంశాలపై ప్రస్తావించాను. నేను చెప్పిన అంశాలను ఒక ట్రాన్స్‌లేటర్ హిందీలోకి అనువదించారు. నా క్లిపింగ్స్ మొదటి బహుమతి సాధించాయి. నగదు పురస్కారంగా రూ. 35 వేలు లభించింది. అనంతపురం జిల్లా పి నారాయణపురం సర్పంచ్ కె హనుమంతరావు, గుజరాత్‌లోని ఉమ్రా సర్పంచ్ హెచ్. ధర్మేంధ్రభాయ్‌లు ద్వితీయ, తృతీయ స్ధానాల్లో నిలిచారు. కాగా... ఈ ఏడాది ఆగస్టు 15న ఉత్తమ సర్పంచ్‌గా పురస్కారం పొందాను. ఇటీవల ‘స్వర్ణాంఽధ్ర-స్వచ్చాంధ్ర’లో ఉత్తమ పంచాయతీగా మా గ్రామానికి కలెక్టర్ వెట్రిసెల్వి ప్రశంసాపత్రాలను అందజేశారు. ఇవన్నీ పంచాయతీ ఈవోలు, పారిశుధ్య సిబ్బంది సహకారం వల్లనే సాధ్యమయింది.’’
ఈశ్వర్ నెట్టెం
చేయాల్సింది ఎంతో ఉంది...
‘సర్పంచ్ సంవాద్ పురస్కారంతో నేను తృప్తి చెందను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మా గ్రామానికి రూ.60 లక్షల ఆదాయం వస్తోంది. వివిధ ప్రాంతాల్లో మరిన్ని సీసీ డ్రెయిన్ల ఏర్పాటు, ఇతర పనులు చేయాల్సి ఉంది. ఉత్తమ పంచాయతీగా ఎంపికైన మా గ్రామాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి దత్తత తీసుకున్నారు. ఉర్దూ స్కూల్ కాంపౌండ్ వాల్‌కు రూ.4 లక్షలు కేటాయించారు. పిల్లలకు ప్రత్యేకంగా ఒక పార్కు, మరికొన్ని రోడ్ల నిర్మాణం నా పదవీకాలంలోగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాను.
ఇవి కూడా చదవండి:
Cyclone Montha: పునరావాస శిబిరాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు
Cyclone Montha: మొంథా తుపాను నేపథ్యంలో రహదారులపై ఆంక్షలు
Updated Date - Oct 29 , 2025 | 05:32 AM