Child Speech Development: పిల్లలకు మాటలు త్వరగా రావాలంటే
ABN, Publish Date - Sep 10 , 2025 | 12:14 AM
సాధారణంగా ఏడాది వయసు రాగానే పిల్లలు ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం రెండేళ్లు నిండినా మాట్లాడలేకపోవడం మనం చూస్తూ ఉంటాం....
సాధారణంగా ఏడాది వయసు రాగానే పిల్లలు ఏదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు మాత్రం రెండేళ్లు నిండినా మాట్లాడలేకపోవడం మనం చూస్తూ ఉంటాం. అలాకాకుండా పిల్లలు త్వరగా మాట్లాడాలంటే తల్లిదండ్రులు ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం...
చిన్న పిల్లలతో తరచూ మాట్లాడుతూ ఉండాలి. చిన్న చిన్న మాటలతో ముఖంలో హావ భావాలు పలికిస్తుంటే పిల్లలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. పిల్లలకు ఏ అంశాన్నైనా సులభంగా గ్రహించే శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి సందర్భాన్ని తమదైన శైలిలో వివరిస్తుంటే పిల్లలు మాట్లాడడం నేర్చుకుంటారు.
నెలల పిల్లలకు ఆటబొమ్మలు ఇచ్చి ఆడిస్తూ ఉండాలి. ఆ బొమ్మల గురించి పలు అంశాలు చెబుతూ ఉంటే పిల్లలు కన్నార్పకుండా చూస్తూ వింటూ ఉంటారు. బొమ్మల మీద కంటే ఏం మాట్లాడుతున్నారు? అనేదాని మీద పిల్లలు ఎక్కువగా దృష్టి పెడతారు. అలా పిల్లల్లో వినికిడి శక్తి, గ్రహించే సామర్థ్యం పెరుగుతాయి. క్రమంగా వచ్చీరాని మాటలు మాట్లాడడం ప్రారంభిస్తారు.
చాలామంది పిల్లలు పాటలు లేదా కథలు వింటూ నిద్రపోతుంటారు. అలా రోజూ ఎన్నో మాటలు వింటూ ఉండడం వల్ల వారిలో ఆలోచన శక్తి పెరుగుతుంది. విన్న మాటలను తిరిగి పలికే ప్రయత్నం చేస్తారు. పిల్లలతో ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత త్వరగా వాళ్లకి మాట్లాడడం వస్తుంది.
ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఒకరినొకరు పిలుచుకుంటూ అనేక రకాల భావాలు ప్రదర్శిస్తూ మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు గమనిస్తుంటారు. పెద్దల భావాలు అర్థమయినప్పుడల్లా మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటారు.
పిల్లలు పెద్దవుతున్న కొద్దీ వచ్చీరాని పదాలు పలుకుతుంటారు. అలాంటప్పుడు స్పష్టంగా ఉచ్ఛరించే విధానాన్ని చెబుతూ ఉండాలి. అప్పుడే పిల్లలకు సరిగా మాట్లాడడం అలవడుతుంది.
పిల్లలకు ఇష్టమైన ఆట బొమ్మలు, ఆహార పదార్థాలను వాళ్లకి అందకుండా పెడుతూ ఉండాలి. అప్పుడు పిల్లలు అవి కావాలని అడగడానికి ప్రయత్నిస్తూ సైగలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భాలను ఉపయోగించుకుంటూ పిల్లలకు కావాల్సినదాన్ని అడగడం నేర్పిస్తే మంచి ప్రయోజనం కనిపిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్
ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
For More AP News And Telugu News
Updated Date - Sep 10 , 2025 | 12:14 AM