IPS Officers: ఆ ఐపీఎస్‌లకు మళ్లీ షాక్ ఇచ్చిన ప్రభుత్వం
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:18 PM
సీనియర్ ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులుతోపాటు కాంతి రాణా టాటాపై ఇప్పటికే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు పొడిగించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
అమరావతి, సెప్టెంబర్ 09: సీనియర ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ప్రభుత్వం మళ్లీ షాక్ ఇచ్చింది. ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలల పాటు ప్రభుత్వం పొడిగించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మంగళవారం జారీ చేశారు. ముంబైకి చెందిన నటి కుమారి కాదంబరి జత్వానికి వ్యతిరేకంగా నమోదైన కేసులో సదరు ఐపీఎస్ అధికారి.. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గతంలో నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.
అయితే పీఎస్ఆర్ ఆంజనేయులు సస్పెన్షన్‌పై రివ్యూ కమిటీ.. సెప్టెంబర్ 2వ తేదీన సమావేశమైంది. అందులో భాగంగా జత్వాని కేసులో తాజా పరిణామాలను ఈ రివ్యూ కమిటీ పరిశీలించింది. సస్పెన్షన్ ఎత్తి వేస్తే.. ఈ కేసును ఆయన ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఈ రివ్యూ కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో ఆయన సస్పెన్షన్‌ను మరో ఆరు నెలలపాటు పొడిగించాలని ప్రభుత్వానికి రివ్యూ కమిటీ సిఫార్సు చేసింది. దీంతో అందుకు అనుగుణంగా సీఎస్ కె. విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 2026, మార్చి8 వ తేదీ వరకు పీఎస్ఆర్ ఆంజనేయులుపై సస్పెన్షన్ పొడిగించినట్లు అయింది.
ఇక ఇదే కేసులో ఐపీఎస్ అధికారి కాంతి రాణా టాటాపై ఇప్పటికే ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనపై కూడా మరో ఆరు నెలల పాటు పొడిగించింది. రాణా టాటాపై ఉన్న సస్పెన్షన్ వేటు ఎత్తి వేస్తే.. ఈ కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రివ్యూ కమిటీ తన సమావేశంలో అభిప్రాయపడింది. ఇదే కారణాన్ని ప్రభుత్వానికి వివరించింది. దాంతో కాంతి రాణా టాటాపై సైతం ప్రభుత్వం సస్పెన్షన్‌ను పొడిగించింది. దీంతో 2026, మార్చి 8వ తేదీ వరకు ఆయనపై సస్పెన్షన్ విధించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
యూరియాపై వైసీపీది అసత్య ప్రచారం.. మంత్రి సుభాష్ ఫైర్
మరాఠాలకు మోదీ బర్త్ డే గిఫ్ట్.. సెప్టెంబర్ 17 నుంచి ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు..
For More AP News And Telugu News