Maratha Quota Row: మరాఠాలకు మోదీ బర్త్ డే గిఫ్ట్.. సెప్టెంబర్ 17 నుంచి ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు..
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:12 PM
మరాఠా రిజర్వేషన్ల కోటా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మనోజ్ జరంగే డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలవంచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు కానుకగా.. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 మధ్య ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని ప్రకటించింది.
మహారాష్ట్రలో రగులుతున్న మరాఠా రిజర్వేషన్ల మంట చల్లార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరాఠా రిజర్వేషన్ల కోటా అమలు చేయాల్సిందేనంటూ మనోజ్ జరంగే 5 రోజుల నిరాహార దీక్ష చేసిన అనంతరం సర్కార్ దిగివచ్చింది. ప్రధానమంత్రి పుట్టినరోజు కానుకగా సెప్టెంబర్ 17 నుంచి మరాఠాలకు ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాల జారీకి ఆమోదం తెలిపింది. అయితే, ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మరింత తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని ఇప్పటికే మనోజ్ జరంగే వార్నింగ్ ఇచ్చాడు.
మరాఠాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మనోజ్ జరంగే ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరాహార దీక్ష చేపట్టాడు. 30,000 మందికి పైగా ప్రజలు ఆయనకు మద్దతుగా నినదించారు. దీంతో ముంబై మహానగరంలో ఒక్కసారిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రభుత్వం మరాఠా సమాజం రిజర్వేషన్ డిమాండ్లను నెరవేర్చకపోతే ముంబైకి పాలు, కూరగాయల సరఫరాను నిలిపివేస్తామని మనోజ్ హెచ్చరించారు. ఉద్యమం నానాటికీ తీవ్రమవుతుండటంతో ఫడ్నవీస్ ప్రభుత్వం దిగివచ్చింది.
సెప్టెంబర్ 17 తేదీన మరాఠ్వాడ ముక్తి దివస్ పురస్కరించుకుని ‘కున్బీ’ కులధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మనోజ్ 5 రోజుల అనంతరం నిరాహార దీక్షను విరమించాడు. 1918 హైదరాబాద్ గెజిట్ ప్రకారం ప్రభుత్వ తీర్మానం (GR) అమలు చేయనుంది. ఈ కోటా కింద వేలాది మంది మరాఠాలు వెనుకబడిన తరగతుల (OBC) కేటగిరీ కింద రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, జస్టిస్ షిండే కమిటీ ప్రకారం, ప్రభుత్వం ఇప్పటికే సుమారు 2,50,000 మందికి కున్బి సర్టిఫికెట్లను పంపిణీ చేసింది.
ఇవి కూడా చదవండి..
క్యూలో నిలబడి ఓటు వేసిన ప్రియాంక గాంధీ
For More National News And Telugu News