Share News

Sandhyarani Fires ON YS Jagan: జగన్ అసెంబ్లీకి రావాలి.. మంత్రి సంధ్యారాణి సవాల్

ABN , Publish Date - Sep 09 , 2025 | 02:51 PM

ఏపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన పనులతోనే ఎన్నికల్లో ఓడించారని ఆక్షేపించారు. వైసీపీ హయాంలో సర్పంచులను పట్టించుకోలేదని, ఇబ్బందులకు గురిచేశారని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు.

Sandhyarani Fires ON YS Jagan: జగన్ అసెంబ్లీకి రావాలి.. మంత్రి సంధ్యారాణి సవాల్
Sandhyarani Fires ON YS Jagan

విశాఖపట్నం, సెప్టెంబరు9(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి (Minister Gummadi Sandhyarani) సవాల్ విసిరారు. ప్రజా సమస్యలపై మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి జగన్ మాట్లాడాలని హితవు పలికారు. ప్రజల తరపున నిలబడి మాట్లాడలేని జగన్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. గతంలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై పోరాటం చేశామని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.


18 కంపెనీలతో ఎంఓయూలు..

ఏపీ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన ప్రజా వ్యతిరేక పనులతోనే ఎన్నికల్లో ఓడిపోయారని ఆక్షేపించారు. వైసీపీ హయాంలో సర్పంచులను పట్టించుకోలేదని, ఇబ్బందులకు గురిచేశారని మంత్రి సంధ్యారాణి ధ్వజమెత్తారు. ఇవాళ(మంగళవారం) విశాఖపట్నంలో గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్‌లో మంత్రి సంధ్యారాణి అరకు కాఫీ పంటపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అరకు కాఫీ అభివృద్ధితోపాటు, బెర్రీ బోరర్ తెగులుపైన ఈ సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలో అధికారులకు మంత్రి సంధ్యారాణి కీలక సూచనలు చేశారు. అరకు కాఫీ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడిస్తోందని చెప్పుకొచ్చారు. అరకు కాఫీ విస్తృతి కోసం 18 కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు మానస పుత్రికగా అరకు కాఫీ ముందుకు వెళ్తుందని ఉద్ఘాటించారు.


అరకు కాఫీకి సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌..

అరకు కాఫీకి సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని తెలిపారు. ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌లలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. 80 ఎకరాల కాఫీ తోటల్లో బెర్రీ బోరర్‌ తెగులు వ్యాప్తి చెందిందని చెప్పుకొచ్చారు. బెర్రీ బోరర్‌ తెగులు నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అరకు కాఫీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తున్న తరుణంలో వైరస్ సోకడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 1.86 లక్షల ఎకరాల్లో కాఫీ పంటను గిరిజన రైతులు సాగుచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో గంజాయికి దూరంగా ఉన్నారని వివరించారు. ఇప్పుడు కాఫీ పంటను గిరిజన రైతులు ఎక్కువగా సాగు చేస్తున్నారని తెలిపారు. బెర్రీ బోరర్‌ తెగులు వ్యాప్తితో నష్టపోయిన కాఫీ పంటకు కేజీకి రూ.50లు పరిహారం గిరిజన రైతులకు అందజేస్తున్నామని ప్రకటించారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి.


హైడ్రో పవర్ ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం..

‘కాఫీ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బెర్రీ బోరర్‌ తెగులు‌ నివారణపై దృష్టి పెట్టాం. అరకు కాఫీ బ్రాండ్ ఎప్పటికీ పడిపోదు. కాఫీ రైతులు ఇబ్బందులు పడకుండా పరిహారం అందిస్తున్నాం. బెర్రీ బోరర్‌ తెగులు పంటకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1300 కోట్లతో గిరిజన ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాం. వైసీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల్లో రోడ్లపై కనీసం దృష్టి పెట్టలేదు. గిరిజన ప్రాంతాల్లో జ్వరం, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేకంగా తాము దృష్టి పెట్టాం. త్వరలోనే హైడ్రో పవర్ ప్రాజెక్టుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. అందరి అభిప్రాయాలను తీసుకుంటాం’ అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

నందిగామలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు

అనంతపురం వాసులకు బిగ్ అలెర్ట్.. 10న ట్రాఫిక్‌ మళ్లింపు

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 09 , 2025 | 05:21 PM