Kurnool onion MSP: ఉల్లి రైతులకు ఊరట.. రూ.10 కోట్లు మంజూరు..
ABN , Publish Date - Sep 09 , 2025 | 03:15 PM
మద్దతు ధర లభించక తల్లడిల్లుతున్న ఉల్లి రైతులకు ప్రభుత్వం ఉపశమనం కలిగించేందుకు చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం అధికారులు కొనుగోళ్లు మొదలుపెట్టేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
కర్నూలు: కొద్ది రోజుల క్రితం కర్నూలు (Kurnool) జిల్లాలో ఉల్లి రైతులు పంటను అమ్ముకోలేక తీవ్ర నష్టాలు చవిచూశారు. సరైన ధరలు లేక, కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో.. చాలా మంది రైతులు తమ పంటను మార్కెట్ యార్డులో వృథాగా వదిలివేసిన ఘటన ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. దీంతో ప్రభుత్వం ఉల్లి రైతులను ఆదునేందుకు తక్షణ చర్యలు చేపట్టింది. తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఉల్లి రైతులకు ఉపశమనం కల్పించేందుకు సీఎం చంద్రబాబు నడుంబిగించారు. తక్షణమే కనీస మద్దతు (Onion support price) ధర చెల్లించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
సంక్షోభ సమయంలో ఉల్లి రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం రంగంలోకి దిగింది. కొద్ది రోజుల క్రితం కనీసం రూ.100కు అయినా కొనుగోలు చేయాలంటూ రైతులు వ్యాపారుల కాళ్లావేళ్లా పడి ప్రాధేయపడినప్పటికీ ఫలితం దక్కలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం అర్లీ ఖరీఫ్ లో ఉల్లి పండించిన రైతులకు రూ.1200 మద్దతు ధర చెల్లించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు రూ.10 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఉల్లి కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
ప్రతి రోజూ 500 మెట్రిక్ టన్నుల ఉల్లిని ఇతర ప్రాంతాల మార్కెట్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఇప్పటికే ఆదేశాలిచ్చారు. దీంతో కనీస మద్దతు లభించక నిరాశలో ఉన్న రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తమ కష్టాలను గుర్తించి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నందిగామలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు
ఏపీకి మరో 2 రోజుల్లో 50 వేల టన్నుల యూరియా: మంత్రి అచ్చెన్నాయుడు
For More Ap News