Minister Atchannaidu: ఏపీకి మరో 2 రోజుల్లో 50 వేల టన్నుల యూరియా: మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Sep 09 , 2025 | 02:08 PM
రాష్ట్రంలో యూరియా కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఖండించారు. వైసీపీ హయాంలోనే రైతులు యూరియా కోసం అవస్థలు పడ్డారని.. కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా కొరతకు తెరదించిందని స్పష్టం చేశారు.
అమరావతి: కూటమి ప్రభుత్వం యూరియా సరఫరా చేయకుండా రైతులను ముప్పుతిప్పలు పెడుతోందని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. సొంత మీడియా, సోషల్ మీడియాల్లో విస్తృతంగా కథనాలు వండివారుస్తుండటంతో.. ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈ వార్తలపై స్పందించారు. మీడియా సమావేశం మాట్లాడుతూ.. వైసీపీ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కొట్టిపడేశారు. వైసీపీ హయాంలోనే రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడ్డారని.. కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా సరఫరా చేసి కొరతకు తెరదించిందని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు చొరవ చూపి కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడటం వల్ల మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రానుందని పేర్కొన్నారు.
యూరియా కొరతపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా సమస్య లేదని.. వైసీపీ కావాలని రాజకీయం చేస్తోందని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. రబీకి కేంద్రం 9.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం130 కోట్లు ఖర్చు చేసి 7.37 లక్షల మంది రైతులకు విత్తనాలు రాయితీతో అందించిందని పేర్కొన్నారు. వైసీపీనే ఉచిత పంటల బీమా పేరుతో అన్నదాతలను దగా చేసిందని.. మా ప్రభుత్వం రైతులకు సమయానికి పరిహారం అందిస్తోందని అన్నారు.
క్వింటా ఉల్లికి గత వైసీపీ సర్కార్ కేవలం రూ.770 మాత్రమే ఇస్తే.. కూటమి ప్రభుత్వం రూ.1200 మద్దతు ధర ప్రకటించడమే గాక.. అదే ధరకు కొనుగోలు చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50 ల సబ్సిడీ రేటుతో విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. డ్రిప్ ఇరిగేషన్, ఆయిల్ పామ్ సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం దేశంలోనే నంబర్ వన్‌గా మార్చగలిగినందుకు గర్వంగా ఉందన్నారు. టొమాటో, మామిడి, మిర్చి, కోకో, పొగాకు ధరలు పడిపోతే కూటమి ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. పశుబీమా పరిహారం కూడా రూ.37,500 నుంచి రూ.50,000 కి పెంచి రైతులపై భారాన్ని తగ్గించామని అన్నారు. మత్స్యకారుల భృతి సైతం రూ.10,000 నుండి రూ.20,000లకు పెంచి 1.21 లక్షల కుటుంబాలకు 242.8 కోట్లు చెల్లించామని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నందిగామలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు
సూపర్ సిక్స్ సూపర్ హిట్.. కూటమి భారీ బహిరంగ
For More Ap News