DK Shivakumar: ఆశ లేకుంటే జీవితం లేదు.. సీఎం పదవిపై డీకే ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 02:09 PM
కాంగ్రెస్ ఐదేళ్ల పాలన ద్వితీయార్ధంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలపై డీకే శివకుమార్‌ను అడిగినప్పుడు ఆయన సూటిగా సమాధానంగా ఇవ్వలేదు. కాలమే సమాధానం చెప్పాలని, తాను జవాబు చెప్పలేనని అన్నారు.
బెంగళూరు: కుర్చీ అంత ఈజాగా దొరకదు, చిక్కితే వదలొద్దు.. కొందరు అధికారాన్ని పంచుకునేందుకు ఇష్టపడరు.. అంటూ పరోక్షంగా ముఖ్యమంత్రి పదవిపై తనకున్న ఆసక్తిని పలు సందర్భాల్లో వ్యక్తం చేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) తాజాగా సీఎం పదవిపై మరో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. 'ఈ ప్రపంచంలో ఎవరైనా ఆశతోనో జీవిస్తారు. ఆశ లేకుంటే జీవితమే లేదు' అని వ్యాఖ్యానించారు.
'ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2025' కార్యక్రమంలో డీకే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఐదేళ్ల పాలన ద్వితీయార్ధంలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలపై అడిగినప్పుడు ఆయన నేరుగా సమాధానంగా దాటవేశారు. కాలమే సమాధానం చెప్పాలని, తాను జవాబు చెప్పలేనని అన్నారు. అయితే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆశతోనే జీవిస్తారని, ఆశ లేకుంటే జీవితమే లేదని వ్యాఖ్యానించారు.
పార్టీయే సర్వం
కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర సమష్టి నాయకత్వంపైనే ఏ నిర్ణయమైనా ఆధారపడి ఉంటుందని డీకే అన్నారు. పార్టీయే తన సర్వమని, పార్టీ ఎలా ఆదేశిస్తే అలా చేస్తానని, పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయడంపైనే తమ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని, ఇది చాలా ముఖ్యమని అన్నారు. ఆ దిశగా కలిసికట్టుగా తామంతా పనిచేస్తున్నామని చెప్పారు.
ఐక్యతే బలం
కాంగ్రెస్ పార్టీ బలం ఐక్యతేనని, పార్టీ బలోపేతం అనేది కేవలం తన వల్లనో, సిద్ధరామయ్య వల్లనో, ఇంకొకరి వల్లనో కాదని, అంతా కలిసికట్టుగా అవిశ్రాంతంగా పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. కర్ణాటక ప్రజలు తామిచ్చిన హామీలను విశ్వసించారని, తమను ఆదరించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యతతోనే ఇది సాధ్యమైందన్నారు.
ఇవి కూడా చదవండి..
క్యూలో నిలబడి ఓటు వేసిన ప్రియాంక గాంధీ
ఉపరాష్ట్రపతి ఎన్నికకు గైర్హాజరైన పార్టీలివే
For More National News And Telugu News