Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికకు గైర్హాజరైన పార్టీలివే
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:14 PM
బిజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి ముఖాముఖీ తలబడుతున్నారు. కాగా, వివిధ కారణాలతో తాము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి.
న్యూఢిల్లీ: కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నిక (Vice President Election) కోసం పోలింగ్ కొనసాగుతోంది. మంగళవారం ఉదయం 10 గంటలకు పార్లమెంటు నూతన భవనంలోని 'ఎఫ్-101 వసుధ'లో పోలింగ్ మొదలైంది. సాయంత్రం 5 గంటలతో పోలింగ్ ముగుస్తుంది. 6 గంటలకు బ్యాలెట్ పత్రాలు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. బిజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan), కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి (B Sudarshan Reddy) ముఖాముఖీ తలబడుతున్నారు. కాగా, వివిధ కారణాలతో తాము ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్టు మూడు పార్టీలు ప్రకటించాయి.
బిజూ జనతా దళ్
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతా దళ్ (BJD) తాము ఉపరాష్ట్రపతి ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇటు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి సమదూరం పాటించాలనే పార్టీ విధానం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. రాజ్యసభలో బీజేడీకి ఏడుగురు ఎంపీల బలం ఉంది. నిరంజన్ బిషి, ఎస్ డియో, ముజిబుల్లా ఖాన్, సుబాశిష్ కుంతియా, మానస్ రంజన్ మంగరాజ్, సమస్మిత్ పాత్ర, దేబశీష్ సమంతరే ఎంపీలుగా ఉన్నారు. లోక్‌సభలో బీజేడీకి ప్రాతినిధ్యం లేదు.
భారత్ రాష్ట్ర సమితి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (KCR) సారథ్యంలోని భారత్ రాష్ట్ర సమితి (BRS) సైతం ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్ర రైతులు యూరియా తీవ్రమైన యూరియా కొరతను ఎదుర్కొంటున్నారని, గత 20 రోజులుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను బీఆర్ఎస్ ఎంత కోరినా స్పందించలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇందుకు నిరసనగా, 71 లక్షల మంది తెలంగాణా రైతులకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం లేదని చెప్పారు. బీఆర్ఎస్‌కు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉండగా, లోక్‌సభలో ప్రాతినిధ్యం లేదు.
శిరోమణి అకాలీదళ్
ఉపరాష్ట్రపతి ఎన్నికకు తాము దూరంగా ఉంటున్నట్టు శిరోమణి అకాలీ దళ్ (SAD) ప్రకటించింది. కనీవినీ ఎరుగని రీతిలో వరదల గుప్పిట్లో పంజాబ్ చిక్కుకుందని, ఇటు కేంద్రం నుంచి కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కానీ రాష్ట్రానికి ఎలాంటి సాయం అందలేదని తెలిపింది. ఎప్పుడు సంక్షోభం వచ్చినా పంజాబ్, పంజాబీలు దేశం కోసం నిలబడతారని, వరదల కారణంగా ఈరోజు పంజాబీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని శిరోమణి అకాలీదళ్ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని మూడింట ఒకవంతు జలదిగ్బంధంలో ఉందని, ఇళ్లు, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అకాలీదళ్ నుంచి కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్ కౌర్ మాత్రమే ఎంపీగా ఉన్నారు.
బలాబలాలు ఇవే..
ఎన్డీయేకు లోక్‌సభలో 293 మంది, రాజ్యసభలో 129 మంది ఎంపీల బలం ఉంది. విపక్ష 'ఇండియా' కూటమిని 325 మంది పార్లమెంటేరియన్లు బలపరుస్తున్నారు. మొత్తం 788 మంది పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, ఉపరాష్ట్రపతి అభ్యర్థి మెజారిటీ సాధించడానికి 391 ఓట్లు అవసరమవుతాయి.
ఇవి కూడా చదవండి..
తొలి ఓటర్లలో రాజ్‌నాథ్, కిరిణ్ రిజిజు
For More National News And Telugu News