ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Thought And Ego: ఆలోచన ఆయుధం అవరోధం

ABN, Publish Date - Aug 15 , 2025 | 12:49 AM

‘ఆలోచన అంటే మనసుతో చూడడం, గ్రహించడం. అన్నిటికీ ఆలోచనే మూలం’ అని మనకు తెలుసు. జంతువు నుంచి మనిషిని వేరు చేసేది ఆలోచనే. ఈ అద్భుతమైన ప్రపంచం మొత్తాన్ని సృష్టించినది...

చింతన

‘ఆలోచన అంటే మనసుతో చూడడం, గ్రహించడం. అన్నిటికీ ఆలోచనే మూలం’ అని మనకు తెలుసు. జంతువు నుంచి మనిషిని వేరు చేసేది ఆలోచనే. ఈ అద్భుతమైన ప్రపంచం మొత్తాన్ని సృష్టించినది కూడా మనిషి ఆలోచనే. కానీ గమనించినట్టయితే... అదే ఆలోచన మనిషి జీవితానికి సమస్యాత్మకం అయింది. మనసు సృష్టించిన ‘అహం’ (‘నేను’ అనే ఆలోచన), దాని తాలూకు విపరిణామాలే మనిషి ఆనందానికి అవరోధమయ్యాయి.

నిజానికి మనిషికి అతని జీవనం సాధ్యం కావడానికి అహమే మూలం. ‘నేను ఉన్నాను’ అనే ఆలోచన ఉంటేనే కదా... నన్ను నేను గుర్తించగలిగేది, నన్ను నేను రక్షించుకోగలిగేది! అలా స్వీయ రక్షణ కోసం, మనుగడ కోసం, కనీస అవసరాలైన ఆహారం, దుస్తులు, నివాసం లాంటివి సంపాదించుకోవడానికి కూడా ఆలోచన అత్యవసరం. అయితే వచ్చిన చిక్కేమిటంటే, ఈ అహం... ‘నేను’ చుట్టూ గిరిగీస్తుంది, విభజనకు దారి తీస్తుంది. ఆ విభజనే క్రమంగా పేర్లకు, పోలికలకు, విశ్లేషణలకు, తీర్పులకు... అంతిమంగా సంఘర్షణకు, దుఃఖానికి కారణం అవుతుంది. ఈ విభజన ఏ స్థాయికి చేరిందంటే... తాను ప్రకృతిలో అంతర్భాగమనే మౌలిక సత్యాన్ని మనిషి పూర్తిగా విస్మరించాడు.

మేధస్సు, వివేకం

నిరంతరం భధ్రత కోసం పాకులాడే మనసు.. ఏదైనా సరే మరింత కావాలని కోరుతుంది. అలా పరిణామ క్రమంలో మనిషి ఆలోచనే... వ్యవసాయాన్ని, మిగులు ధాన్యాన్ని, నాగరికతను, సౌకర్యాలను సృష్టించేలా చేసింది. నిన్న మొన్నటి శాస్త్ర-సాంకేతిక విజ్ఞానం నుంచి... నేటి కృత్రిమ మేధ వరకూ అన్నీ మనిషి ఆలోచన పుణ్యమేనని మనకు తెలుసు. అయితే మనిషి ఆలోచన, మేధస్సు పెరిగాయి కానీ, వాటి ఫలాలను ఎంత మేరకు, ఎలా వినియోగించుకోవాలి అనే వివేకమే క్రమంగా కరువైపోతూ వస్తోంది. ఆధునిక కాలంలో ఈ అవగాహనారాహిత్యం పరాకాష్టకు చేరి... మానవాళికి భస్మాసుర హస్తంగా మారింది. ‘‘జీవనాధారమైన వాస్తవ ప్రకృతిని నాశనం చేస్తూ... ఊహాజనితమైన సంఖ్యలు, సంకేతాల మీద దృష్టి పెరిగిపోవడమే మానవాళికి దాపురించిన అతి పెద్ద సమస్య’’ అంటారు ప్రఖ్యాత పాశ్చాత్య తాత్త్వికుడు ఆలన్‌ నాట్స్‌. ఒకవైపు ‘నేను-నాది’ అనే స్వార్థం, మరోవైపు మరింత సంపద, సౌకర్యాలు కావాలనే కాంక్ష, పోటీ. ఇలా క్రమంగా ఆలోచన ఉచ్చులో, మనసు చేసే మాయలో మనిషి పడిపోయాడు. ప్రతి రంగంలోనూ వృద్ధికోసం పాకులాటే. వ్యక్తుల నుంచి దేశాల వరకూ- ఆస్తి విలువలు, బ్యాంకు నిల్వలు, సంపదల లెక్కలు, జీడీపీ రేట్లు... అన్నీ అమాంతం పెరిగిపోవాలనే ఆశ! ‘‘ఇంత చేసిన మనిషి... భూగ్రహాన్ని భోగిమంటలో వేస్తున్న మనిషి... పోనీ ఆనందంగా ఉన్నాడా? అంటే అదీ లేదు’’ అంటారు సద్గురు జగ్గీ వాసుదేవ్‌. అనుక్షణం ఏదో తీరని ఆరాటం, ఏదో తెలియని వెలితి, ఆందోళన, అశాంతి. కెరటాలతో అల్లకల్లోలమైన సముద్రంలా, ఎడతెగని ఆలోచనల పుట్టలాగా మారింది మనిషి మనసు. ముఖ్యంగా నేటి మొబైల్‌-సోషల్‌ మీడియా కాలంలో ఆలోచన ఒక వ్యసనంగా మారిందంటే, నిద్రలేమి ఒక మహమ్మారిలా వ్యాపిస్తోందంటే అతిశయోక్తి కాదు. ఏకాంతం, నిశ్శబ్దం, ప్రశాంతత అన్నవి మనిషి జీవితంలో అరుదుగా లభించే బ్రహ్మపదార్థాలైపోయాయి.

నిరంతర ఎరుక

ఇదంతా చూసినప్పుడు ఆలోచన అనేది రెండు అంచుల పదునైన కత్తి లాంటిదని తెలుస్తుంది. మనం అద్భుతాలు అనుకుంటున్నవాటిని ఎన్నో సృష్టించిన ఆలోచనే మన ఆందోళనకూ, అశాంతికీ కారణమౌతోంది. అది విలయానికీ, మానవ వినాశనానికీ కూడా కారణం కాగలదు. మితిమీరిన ఆలోచన వల్ల వచ్చిన అనర్థాలను గ్రహించిన జ్ఞానులు ‘‘మనో వ్యాపారాన్ని పరిమితం చేయడం, మితంగా కర్మలు ఆచరించడమే ఆధ్యాత్మిక వివేకం’’ అన్నారు.

అదే మనిషి జీవితంలో ప్రశాంతతకూ, ఆనందానికీ మార్గమని సూచించారు. అదే నిజమైన ధ్యానం. అంటే ఆలోచన పట్ల నిరంతర ఎరుక కలిగిఉండడం, మనసు పోకడలను కనిపెట్టడం, ‘నేను’ ఎలా పనిచేస్తోందో గమనిస్తూ... దాని తీరుతెన్నుల పట్ల అప్రమత్తంగా ఉండడం, కర్మలను పరిమితం చేయడం, కనీసావసరాలతో సరళ జీవనం గడపడం. ఆలోచనను ఎలా, ఎంతమేరకు ఉపయోగించాలో తెలియడం...

ఇదే మనిషి వివేకానికి కొలమానం. అదే నిజమైన ఆధ్యాత్మిక సాధన. ఆ వివేకం నుంచే జీవితంపట్ల స్పష్టత, నిజమైన స్వేచ్ఛ, అసలైన ఆనందం లభిస్తాయి.

ఈదర రవికిరణ్‌

ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 15 , 2025 | 12:49 AM