Ishit Bhatt Viral KBC Kid: ట్రోల్ అవుతున్న కెబిసి కుర్రాడు
ABN, Publish Date - Oct 15 , 2025 | 01:07 AM
‘కౌన్ బనేగా కరోడ్‌పతి 17’లో పాల్గొన్న ఇషిత్ భట్ అనే ఒక పదేళ్ల పిల్లాడు ప్రస్తుతం అందరూ ద్వేషించే పిల్లాడిగా వైరల్ అయ్యాడు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సారఽథ్యంలో సాగే ఈ క్విజ్ కార్యక్రమంలో...
సైకాలజీ
‘కౌన్ బనేగా కరోడ్‌పతి 17’లో పాల్గొన్న ఇషిత్ భట్ అనే ఒక పదేళ్ల పిల్లాడు ప్రస్తుతం అందరూ ద్వేషించే పిల్లాడిగా వైరల్ అయ్యాడు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ సారఽథ్యంలో సాగే ఈ క్విజ్ కార్యక్రమంలో ఆ పిల్లాడి దుందుడుకు ప్రవర్తన , దురుసైన మాటతీరు సర్వత్రా చర్చనీయాంశాలుగా మారాయి. పిల్లాడి ప్రవర్తన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందా లేదంటే అహంకారాన్ని కనబరుస్తోందా? ఇది ఆ పిల్లాడి తప్పిదమా, లేక తల్లితండ్రుల పెంపకం లోపమా? సమస్య ఎక్కడుంది?
ఐదో తరగతి చదువుతున్న గుజరాత్‌కు చెందిన ఇషిత్ భట్... కార్యక్రమం మొదట్లోనే....‘నాకు ఈ కార్యక్రమం నియమాలన్నీ తెలుసు. కాబట్టి మీరిప్పుడు నాకు నియమాలు చెప్తూ కూర్చోకండి’ అంటూ అమితాబ్‌ను ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు... ప్రశ్నకు తగిన ఆప్షన్స్ చెప్పే సమయం తీసుకోకుండానే దూకుడుగా సమాధానం చెప్పేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కూడా... ఒక ప్రశ్న అడిగిన వెంటనే ‘‘ఇదసలు అడగవలసిన ప్రశ్నేనా?’’ అంటూ ఎద్దేవా చేయడంతో పాటు, మరొక ప్రశ్నకు సమాధానంగా ‘ఒకటికి నాలుగు లాక్స్ వేసుకోండి’ అంటూ అవసరానికి మించిన ఆత్మవిశ్వాసాన్ని కనబరిచి, అంతిమంగా పాతిక వేల ప్రైజ్ మనీని కోల్పోయి ఇంటి దారి పట్టాడు. అయితే ఈ కార్యక్రమంలో ఇషిత్ కనబరిచిన ప్రవర్తనను ఆత్మవిశ్వాసంగా పరిగణించాలా? లేక అహంకారంగా భావించాలా? లేదంటే ఇప్పటి తరం ఇలాగే ఉందని సరిపెట్టుకోవాలా?
సిక్స్ పాకెట్ సిండ్రోమ్
ఈ కార్యక్రమంలో ఇషిత్ కనబరిచిన ప్రవర్తనను మానసిక వైద్యులు ‘సిక్స్ పాకెట్ సిండ్రోమ్’గా పరిగణిస్తున్నారు. ఈ సామాజిక పరిస్థితిలో ఆరుగురు కుటుంబసభ్యులు ఒకే బిడ్డ మీద విపరీతమైన ప్రేమనూ, శ్రద్ధనూ కనబరుస్తూ ఉంటారు. పిల్ల లేదా పిల్లాడి ప్రవర్తన వెనుక... ఆ బిడ్డ తల్లితండ్రులతో పాటు, ఇరువైపులా ఉన్న అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో కలిపి మొత్తం ఆరుగురు కుటుంబసభ్యుల ప్రమేయం ఉంటుందని సైకాలజిస్టులు అంటున్నారు. దంపతులు ఒక సంతానానికే పరిమితమైపోతున్న రోజులివి. దాంతో కుటుంబంలోని ఆరుగురి దృష్టీ ఆ ఒక్క సంతానం మీదే కేంద్రీకృతమై ఉంటుంది. ఆ ఆరుగురూ బిడ్డను గారం చేస్తూ, అడిగినవన్నీ కొనిపెడుతూ, నొప్పి తెలియకుండా పెంచడమే కాకుండా... ఆలస్యం చేయకుండా అలక తీర్చేయడం, అడిగినవన్నీ క్షణాల్లో అందించడం, తన మాటే నెగ్గుతుందనే భరోసా కల్పించడం లాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాంతో పిల్లల్లో తానొక ప్రత్యేకమైన వ్యక్తిననే అభిప్రాయం బలపడుతుంది. తన మాటకు ఎదురుండదనే భరోసా కలుగుతుంది. కొన్ని కుటుంబాల్లో పిల్లలను అవసరానికి మించి పొగిడేస్తూ ఉంటారు. ఇదీ మంచిది కాదు. పిల్లల ప్రవర్తన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలిస్తున్నట్టు కనిపించవచ్చు. అయితే అది అహంకారానికి దారి తీయకుండా జాగ్రత్తపడవలసిన బాధ్యత తల్లితండ్రులదే!
సామాజిక మాధ్యమాలు, రియాలిటీ షోలు
దురుసుగా, నిర్మొహమాటంగా మాట్లాడితే ‘మా పిల్లలు పిడుగులు’ అంటూ మురిసిపోయే తల్లితండ్రులు ఉంటారు. కానీ అలాంటి ప్రవర్తనను చూసి, మెచ్చుకోలుగా మాట్లాడిన ప్రతిసారీ పిల్లల్లో అదే సరైన ప్రవర్తన అనే నమ్మకం నాటుకుపోతూ ఉంటుంది. పెద్దలతో దురుసుగా మాట్లాడినప్పుడు మందలించడానికి బదులుగా, ‘వాడి తీరే అంత’ అంటూ పట్టించుకోకుండా వదిలేస్తే, తన ధోరణి సరైనదేననే ప్రోత్సాహాన్ని పిల్లలు పొందుతారు. ఇంట్లో ఇలాంటి వాతావరణానికి తోడు, రియాలిటీ షోలు, సామాజిక మాధ్యమాలు, సినిమాలు, సీరియల్స్‌లో నటించే బాలనటుల ప్రవర్తనలను కూడా పిల్లలు అనుకరిస్తూ ఉంటారు. ఆయా మాధ్యమాల్లో పిల్లల మాటలకు వస్తున్న ప్రతిస్పందననూ, మెచ్చుకోళ్లనూ, చప్పట్లనూ రివార్డులుగా భావిస్తూ, అదే సరైన ప్రవర్తన అని భ్రమపడుతూ ఉంటారు. ఇంకొందరు పిల్లలు పెద్దల దృష్టిని ఆకట్టుకోవడం కోసం విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇవన్నీ పిల్లలే స్వయంగా అలవరుచుకున్న లక్షణాలు కావు. పరిసరాలు, పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం, పెద్దల ప్రవర్తన... ఇవన్నీ పిల్లల మీద ప్రభావం కనబరుస్తూ ఉంటాయి. కాబట్టి పెద్దలను ఎదిరించి మాట్లాడడం, కసురుకోవడం, చెప్తున్నది పూర్తిగా వినకుండానే సమాధానం చెప్పడం, చులకనగా మాట్లాడడం... చిన్న పిల్లల్లో ఇలాంటి ప్రవర్తనా లోపాలను గుర్తించినప్పుడు వాటిని మొదట్లోనే ఖండించాలి.
సానుభూతి ఎక్కడ?
మన మాట, ప్రవర్తనలు ఎదుటివారిని బాధపెట్టే అవకాశం ఉంటుందని పిల్లలు గ్రహించేలా చేయడం ఎంతో అవసరం. ఎలాంటి ప్రవర్తన, ఎలాంటి మాట తీరు ఎదుటి వారి మనసును నొప్పిస్తాయో పిల్లలు తమంతట తాము తెలుసుకోలేరు. కాబట్టి ఈ విషయంలో పెద్దలే పిల్లలకు మార్గదర్శకులుగా మారాలి. అలాంటి ప్రవర్తనను మొగ్గలోనే ఖండించాలి. తోటి పిల్లలతో, పెద్దలతో పిల్లలు నడుచుకునే తీరును గమనిస్తూ, అవసరమైన చోట కౌన్సెలింగ్ ఇస్తూ ఉండాలి. మరీ ముఖ్యంగా టీవీలు, సామాజిక మాధ్యమాల ప్రభావం పిల్లల మీద పడకుండా జాగ్రత్త పడాలి.
గోగుమళ్ల కవిత
చిటికెలో చేతికి?
ఏది కావాలనుకున్నా, చిటికెలో చేతికందే రోజులొచ్చాయి. రిమోట్‌లో బటన్ నొక్కగానే రెప్పపాటులో ఛానల్ మారిపోతోంది. స్విగ్గీలో ఆర్డర్ పెట్టిన నిమిషాలలోపే ఆహారం ఇంటికొస్తోంది. ఫలానాది కావాలని తల్లితండ్రులను అడిగిన వెంటనే ఆ వస్తువును చేతికి అందించే ధోరణి కూడా పెరుగుతోంది. ఇలా అనుకున్న వెంటనే పనులన్నీ చకచకా జరిగిపోతున్నప్పుడు, తాను తలచుకున్న ప్రతిదీ అలాగే జరుగుతుందనే నమ్మకం కలగడం, అందుకోసం తొందరపడడం, కొద్దిపాటి ఆలస్యాన్ని సైతం భరించలేకపోవడం మొదలైన స్వభావాలు పిల్లల్లో పెరుగుతున్నాయి. వీటిని కట్టడి చేయడం అవసరం. సహనం, ఉపేక్షల అసలు అర్థాలను పిల్లలకు నేర్పాలి. దుందుడుకుతనంతో ఒరిగే నష్టాలను తెలియచెప్పాలి. కోపం, ఉక్రోషం లాంటి భావోద్వేగాల దుష్ప్రయోజనాలను వివరించాలి. మరీ ముఖ్యంగా ఆత్మవిశ్వాసానికీ, అహంకారానికీ వ్యత్యాసాన్ని విపులంగా వివరించాలి.
డాక్టర్ జ్యోతిర్మయి
సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్,
మనహ క్లినిక్, హైదరాబాద్.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్
విశాఖ గూగుల్ ఏఐ హబ్.. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు బలం: ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News
Updated Date - Oct 15 , 2025 | 01:07 AM