Hindu Temples Sacred Sculpture: విగ్రహం వీటితో శ్రేష్టం
ABN, Publish Date - Dec 05 , 2025 | 05:29 AM
భగవంతుడి శక్తిని విశేషంగా గ్రహించే వాటినే ‘విగ్రహాలు’ అంటారు. అంతటి మహిమాన్వితమైన విగ్రహాలను ఎలా, ఏయే వస్తువులతో తయారు చెయ్యాలి?... ఈ సందేహాలకు ప్రాచీన శాస్త్రాలు...
తెలుసుకుందాం
భగవంతుడి శక్తిని విశేషంగా గ్రహించే వాటినే ‘విగ్రహాలు’ అంటారు. అంతటి మహిమాన్వితమైన విగ్రహాలను ఎలా, ఏయే వస్తువులతో తయారు చెయ్యాలి?... ఈ సందేహాలకు ప్రాచీన శాస్త్రాలు చక్కని వివరణ ఇచ్చి, మార్గదర్శనం చేశాయి. ఆ వస్తువులకు ‘ప్రతిమా ద్రవ్యాలు’ అని పేరు. భగవంతుడు సర్వాంతర్యామి. ఆయన అణువణువునా ఉన్నప్పటికీ... శాస్త్రోక్త పద్ధతిలో, శాస్త్రం సూచించిన ద్రవ్యాలతో తయారు చేసిన విగ్రహాలలో విశేషమైన దైవ సాన్నిధ్యం లభిస్తుంది. అలాగే ఆయా ద్రవ్యాలతో తయారు చేసిన విగ్రహాలు తమవైన శుభ ఫలితాలను ఇస్తాయి. ‘‘రాయి, లోహం, ఇటుక, కొయ్య, మన్ను, సున్నం, దంతం, వర్ణం, నవ పాషాణం, మైనం అనే పది మాత్రమే శిల్పానికి తగిన పదార్థాలు’’ అని ప్రతిమా ద్రవ్యాల గురించి ‘పింగళి నిఘంటువు’ అనే ప్రాచీన గ్రంథం వివరించింది.
రాయి: ‘శిల నుంచి ఉద్భవించినదే శిల్పం’ అనే నానుడి ఉంది. శిలతో చేసిన విగ్రహాలు గర్భాలయంలో మూల విగ్రహాలుగా, ఇతతర పరివార దేవతలుగా మనకు దర్శనం ఇస్తాయి. శిల్పి ఉలిని శిలపై తాకించినప్పుడు ఓంకార శబ్దంలా ఘంటానాదం వస్తే దాన్ని ‘పురుష శిల’ అనీ, అదే శబ్దం దీర్ఘంగా వస్తే ‘స్త్రీ శిల’ అనీ, ఘంటానాదం కాకుండా సత్తును మోగించినప్పుడు వచ్చే శబ్దం వస్తే ‘నపుంసక శిల’ అనీ అంటారు. ‘శిలలో దైవత్వం ఉందా? లేదా?’ అనే విషయాన్ని ఈ శబ్ద పరీక్ష ద్వారా ఏకాగ్రతతో స్థపతి పరీక్షిస్తారు. పురుష శిల అయితే పురుష దేవతా విగ్రహాల తయారీలో, స్త్రీ శిల అయితే స్త్రీ దేవతా విగ్రహాల తయారీలో వినియోగిస్తారు. శివలింగం తయారీలో... మధ్యలో ఉండే శివలింగాన్ని పురుష శిలతో, పానవట్టాన్ని/ ఆధారపీఠాన్ని స్త్రీశిలతో తయారు చేయాలని శైవ ఆగమాలు చెబుతున్నాయి. శబ్ద పరీక్షలో విఫలమయిన రాయిని నపుంసక శిలగా గుర్తించి, గర్భాలయం నుంచి ప్రాకారం వరకూ నిర్మాణాలలో వినియోగిస్తారు.
లోహం: దేవతా విగ్రహాల తయారీల లోహాన్ని మరొక ప్రముఖమైన ద్రవ్యంగా చెప్పుకోవచ్చు. సాధారణంగా దేవాలయాలలో లోహవిగ్రహాలు ‘చలబింబాలు’గా పిలిచే ఉత్సవమూర్తులుగా ఆరాధనలు అందుకుంటాయి. అయితే... చిదంబరంలోని శ్రీనటరాజ స్వామి ఆలయంలో, శబరిమలలోని శ్రీఅయ్యప్పస్వామి ఆలయంలో ధృవమూర్తులుగా పూజలు అందుకుంటున్నవి లోహవిగ్రహాలే. వీటి తయారీకి రాగికన్నా వెండి, వెండికన్నా బంగారం ఉత్తమమైనవి. ఇటీవల హైదరాబాద్‌లో నిర్మించిన సమతామూర్తి ఆలయంలో నిత్యపూజలు అందుకుంటున్న శ్రీరామానుజుల ధృవబింబాన్ని 120 కిలోల బంగారాన్ని వినియోగించి... లోహమయంగా ప్రతిష్ఠించడం గమనించవచ్చు. లోహాలను తగుపాళ్ళలో కలిపి... పంచలోహ విగ్రహాలు తయారు చేసుకొని, ప్రాణప్రతిష్ఠ చేసి ఆరాధించడం అనూచాన సంప్రదాయం. గృహస్థులు తమ ఇళ్ళలో నిత్యం ఆచరించే తిరువారాధన కోసం లోహవిగ్రహాలు మాత్రమే శ్రేష్టమైనవి. అవి కూడా నియమితమైన ఎత్తుకు మించకుండా చేయించుకోవాలి. శిలావిగ్రహాలను గృహాలలో అర్చించరు.
దంతం: ఏనుగు దంతంతో చాలా అందమైన విగ్రహాలు తయారు చేస్తారు. కానీ ఆ విగ్రహాలకు పూజలు చేయరు. అవి కేవలం అలంకారానికి మాత్రమే బాగుంటాయి. విలాసవంతంగా ఉంటాయి.
వర్ణం: వస్త్రంపై దేవతామూర్తుల రూపాన్ని బొమ్మ గీసి, దానికి వర్ణాలు అద్దుతారు. ఆ చిత్రాన్ని సైతం దేవుని మూర్తిగా భావించి పూజించవచ్చు.
నవపాషాణం: పాషాణం అంటే విషం. ఔషధ గుణాలను కూడా కలిగి ఉన్న అలాంటి తొమ్మిది పాషాణాలను... ‘నవపాషాణాలు’ అంటారు. ఆ తొమ్మిది ద్రవ్యాలను తగుపాళ్ళలో కలిపి, విగ్రహంగా మలచి పూజించవచ్చు. తమిళనాడు రాష్ట్రం పళనిలోని సుబ్రహ్మణ్యస్వామి మూర్తి నవపాషాణాలతో నిర్మితమయింది. ఆ స్వామికి చేసే పంచామృతాభిషేకం విశేషమైనదనీ, ఆ పంచామృతం సేవిస్తే పలు వ్యాధులు నయమవుతాయని భక్తుల విశ్వాసం.
ఇటుక: శ్రేష్టమైన మట్టితో విగ్రహాలు చేసి, వాటిని కాల్చి, గట్టిపరచిన విగ్రహాలు ఇష్టికామూర్తులు. ఇవి ప్రాచీన కాలంలో ఉండేవి. వీటిని ఆరాధించడం ద్వారా భక్తులు తమ అభీష్టాలను తీర్చుకొనేవారు. ఇష్టాలను తీర్చేవి కాబట్టి ‘ఇష్టికా విగ్రహాలు’ అనీ, కాలక్రమేణా ‘ఇటుక విగ్రహాలు’ అని వ్యవహరించేవారు. ఈ ఆధునిక కాలంలో ఇటువంటి విగ్రహాలు చాలా అరుదు.
రత్నం: మాణిక్యం, ముత్యం, పగడం, మరకతం, కనకపుష్యరాగం, వజ్రం, ఇంద్రనీలం, గోమేధికం, వైడూర్యం... ఇవి నవరత్నాలు. వీటిలో అతి పెద్ద పరిమాణంలో దొరికే రత్నాలను విగ్రహాలుగా మలచి పూజిస్తారు. గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమంలో మరకత రాజరాజేశ్వరీ విగ్రహాన్ని చూడవచ్చు.
కొయ్య: కలప తయారు చేసిన విగ్రహాలను ‘దారుబింబాలు’ అంటారు. ప్రతిమల తయారీలో దారువుది కూడా ముఖ్య స్థానమే. కేవలం అలంకార విగ్రహాలే కాదు... పూరీ క్షేత్రంలోని జగన్నాథుడు దారుమూర్తే. కంచి అత్తి వరదరాజస్వామి విగ్రహాన్ని అత్తి కొయ్యతో తయారు చేశారు కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది. అంతేకాదు... ఎన్నో గ్రామాల్లో, వాడలలో గ్రామదేవతలు, దేవర విగ్రహాలను కొయ్యతొనే చేసి, స్థాపించి, పూజిస్తారు.
మన్ను: నదీ తీరాలు, తటాకాలు, చెరువుల గట్ల మీద దొరికే శ్రేష్టమైన ఒండ్రుమట్టితో చేసే విగ్రహాలు అతి పవిత్రమైనవి. తాత్కాలికంగా పూజించడం కోసం మట్టి విగ్రహాలను తయారు చేస్తారు. గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రుల్లో మట్టి విగ్రహాలను పూజించడం మనం చూస్తున్నాం.
సున్నం: తెల్లని సున్నపురాయిని బాగా కాల్చి పొడి చేస్తారు. ఆ సున్నపు పొడిలో కరక్కాయ పొడి, నాటు బెల్లం నీళ్ళు లాంటి మరిన్ని ద్రవ్యాలు కలుపుతారు. వాటిని తిప్పి మెత్తగా చేసి, విగ్రహాలు తయారు చేస్తారు. మన ప్రాచీన ఆలయాలలో విమాన శిఖరం మీద, మండపాల సాలహారాల మీద నిర్మించినవి ఈ సున్నపు బొమ్మలే. వీటిని ‘సుధాబింబాలు’ అంటారు. మరో విశేషం ఏమిటంటే... కొన్ని ప్రాచీనమైన గుడుల గర్భాలయాల్లో మూల విగ్రహాలుగా కూడా ఇవి నిత్య పూజ లు అందుకుంటున్నాయి. అలా మూలవిగ్రహాలుగా ప్రాణప్రతిష్ఠ చేయవలసిన సుధాబింబాల తయారీకి శిల్ప శాస్త్రాలు చాలా కఠినమైన నియమాలను నిర్దేశించాయి. శూలస్థాపన, రజ్జుబంధనము, కల్కలేపనం లాంటి ప్రక్రియల ద్వారా ఆడించిన సున్నంలో... పదహారు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన మృత్తికలను సమ్మిళితం చేసి ఈ విగ్రహాలు తయారు చేయాలి.
డి.యన్.వి. ప్రసాద్
స్థపతి, 9440525788
ఈ వార్తలు కూడా చదవండి
'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!
పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 05 , 2025 | 08:53 AM