The Life Lessons: జీవన మకరందం
ABN, Publish Date - Dec 12 , 2025 | 01:20 AM
‘‘యద్యతాచరతి శ్రేష్ఠ స్తత్తదేవతరోజనః... సయత్ప్రమాణాం కురుతే లోకస్తదనువర్తతే... ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో... ప్రపంచమంతా దానినే అనుసరిస్తారు, ఆచరిస్తారు’’ అంటోంది...
చింతన
‘‘యద్యతాచరతి శ్రేష్ఠ స్తత్తదేవతరోజనః... సయత్ప్రమాణాం కురుతే లోకస్తదనువర్తతే... ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో... ప్రపంచమంతా దానినే అనుసరిస్తారు, ఆచరిస్తారు’’ అంటోంది భగవద్గీత. కాబట్టి అందరికీ ఆదర్శంగా మన నడవడిక ఉండాలి. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడుపడాలని మహాకవి గురజాడ హితవు పలికారు. దీన్ని ఆచరిస్తే మానవ జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. మనకు కష్టమయినా, నష్టమయినా ఎదుటివారికి మంచి జరగాలన్న అభిలాష... మానవ సంబంధాలలో అద్భుతమైన విజయాలను అందిస్తుంది. జీవితంలో ఓటమి ఎదురైనప్పుడు... దానికి కారణాలేమిటో అన్వేషించడం, గెలుపు సాధ్యమైనప్పుడు గర్వాన్ని పొందకుండా మరింత బాధ్యతాయుతంగా ఉండడం, మనస్సు ఆందోళన చెందినప్పుడు సహనంతో విశ్లేషించుకోవడం లాంటి లక్షణాలు మన విజయానికి శ్రీరామరక్ష. ఎప్పుడూ ప్రసన్నవదనంతో శాంతంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ధర్మాన్ని ఆచరిస్తే దిగ్విజయంగా, పరోపకారాన్ని ఆకాంక్షిస్తే క్షేమంగా మన జీవిత గమనాన్ని సాగించవచ్చు.
ధీరత్వానికి ప్రతీకలు
‘నవ్వుతూ బతకాలి’ అనేది ఆధునిక సాంకేతిక యుగంలో సముచితమైన జీవన విధానం. నవ్వు అనారోగ్యాలను తరిమికొట్టే జీవ రసాయనం. వైద్య శాస్త్రం కూడా దీన్ని ఒక దివ్యౌషధంగా అంగీకరించింది. అలాగే సంగీతం అనేక రుగ్మతలను పారద్రోలే సాధనంగా ఇటీవల నిరూపితమవుతోంది. ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి హాస్యరసం కూడా చక్కటి పాత్ర పోషిస్తుంది. ‘‘ఆపదలు, కష్టాలు మనిషి ధీరత్వానికి ప్రతీకలు’’ అని షేక్ప్‌పియర్ చెబుతాడు. ప్రాకృతిక నియమానుసారం సుఖదుఃఖాలు అనేవి సహజం. వాటిని జీవన ధర్మంగా, ప్రకృతి అమరికగా భావించాలి. లక్ష్యం లేని జీవితం వ్యర్థం. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అన్నారు పెద్దలు. జీవితంలో విజయం సాధించినవారిని ఆదర్శంగా తీసుకొని, సముచితరీతిలో కృషిచేస్తే మనిషి ఋషిగా మారడానికి, అర్థవంతమైన జీవితాన్ని సాధించడానికి సదవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనేక కోణాల్లో మన జీవితాలను సుసంపన్నం చేసుకుంటూ... జీవన మకరందాన్ని ఆస్వాదించవచ్చు.
శ్రీగిరి గోపాలకృష్ణ, 9666436415
ఇవీ చదవండి:
వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీపై అధ్యక్షుడు ట్రంప్ పొగడ్తలు.. ఆమె సూపర్ స్టార్ అంటూ..
మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన
Updated Date - Dec 12 , 2025 | 01:20 AM