Share News

Pak Journo On Putin Tour: మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన

ABN , Publish Date - Dec 06 , 2025 | 09:10 AM

అప్పులు ఇవ్వాల్సి వస్తుందనే కారణంగానే రష్యా అధ్యక్షులు ఎవరూ తమ దేశంలో పర్యటించరంటూ పాక్ జర్నలిస్టు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడే వరకూ పరిస్థితి ఇంతేనని నిర్వేదానికి లొనయ్యారు.

Pak Journo On Putin Tour: మన దేశానికి రష్యా అధ్యక్షులెవరూ ఇందుకే రారు.. పాక్ జర్నలిస్టు ఆవేదన
Pak Journo Comments on Putin's India-tour

ఇంటర్నెట్ డెస్క్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన విజయవంతమైంది. ఇరు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక బంధాలు బలోపేతమయ్యాయి. ఈ నేపథ్యంలో పాక్‌లో విచారం తొంగిచూసింది. భారత్‌కు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని రష్యా పాక్‌కు ఎందుకు ఇవ్వదని అక్కడి వారు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నకు పాక్ జర్నలిస్టు ఒకరు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి (Pak on Putin Visiting India).

వాస్తవానికి పాక్‌లో రష్యా అధ్యక్షులు ఎవరూ ఇప్పటివరకూ పర్యటించలేదు. ఇదే విషయాన్ని పాక్ జర్నలిస్టు ఆర్జూ ఖాజ్మీ ప్రస్తావించారు. రక్షణ రంగ విశ్లేషకుడు కమర్ చీమాతో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన జేబులు గుల్ల చేసుకోవడానికి పాక్‌కు పుతిన్ వస్తారా? అని సెటైర్ పేల్చారు. జర్నలిస్టు కామెంట్‌తో కమార్ చీమా కూడా ఏకీభవించారు. ‘పాక్ గగనతలం మీదుగా ఎన్నో సార్లు ప్రయాణించే పుతిన్ మన దేశానికి ఒక్కసారి కూడా రారు. ఎందుకంటే మన దేశంతో వాళ్లకు ఎలాంటి డీలింగ్స్ లేవు’ అని అన్నారు.


పాక్‌తో రష్యాకు పెద్దగా ఆర్థిక లావాదేవీలు లేవన్న విషయాన్ని పాక్ జర్నలిస్టు అంగీకరించారు. ‘వాళ్లకు మనతో ఏ పని ఉంది. ఏ కారణంతో రష్యా అధ్యక్షుడిని మనం ఆహ్వానిస్తాం. ఒక వేళ ఆయన ఇక్కడకు వచ్చినా మనం చేసేదేముంది. మనకు వాళ్లు ఫైటర్ జెట్లు, ఇంధనం ఇచ్చినా అప్పుపై ఇవ్వాల్సిందే. భారత్‌తో మాత్రం అంతా క్యాష్ డీలింగ్స్‌యే. అందుకే అక్కడకు వెళతారు. ఇక్కడకు వస్తే మనకు అవన్నీ అప్పుపై సప్లై చేయాల్సి ఉంటుంది’ అంటూ కునారిల్లుతున్న తమ దేశ ఆర్థిక వ్యవస్థపై విచారం వ్యక్తం చేశారు.

ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచి పాక్ అమెరికాకు సన్నిహితంగా మెలుగుతోంది. దీంతో, రష్యాతో దాయాదికి ఎడం పెరిగింది. ఆ తరువాతి కాలంలో దౌత్య బంధం కాస్త మెరుగుపడినా రష్యా అధినేతలు ఎవరూ పాక్‌లో పర్యటించలేదు. పాక్‌ పర్యటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ 2012లో ఓసారి ప్రకటించినా ఆ తరువాత అనివార్య కారణాలతో దాన్ని రద్దు చేసుకున్నారు.


ఇవీ చదవండి:

ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు.. పాక్‌కు షాక్

వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 06 , 2025 | 10:49 AM