Ganesh Chaturthi: బహురూపుడు భక్తసులభుడు
ABN, Publish Date - Aug 27 , 2025 | 05:09 AM
వైదిక సంప్రదాయంలో శ్రీ విఘ్నేశ్వరుడికి ఉండే ప్రథమ స్థానం గురించి ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. ఆది పూజను అందుకొనే గజాననుడు శైవ ఆగమాలలో 32 విభిన్న రూపాలలో దర్శనమిస్తాడు. కాగా..
వైదిక సంప్రదాయంలో శ్రీ విఘ్నేశ్వరుడికి ఉండే ప్రథమ స్థానం గురించి ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. ఆది పూజను అందుకొనే గజాననుడు శైవ ఆగమాలలో 32 విభిన్న రూపాలలో దర్శనమిస్తాడు. కాగా.. ‘చింత్యాగమం’ అనే గ్రంథం గణపతిని షోడశమూర్తిగా ఆవిష్కరిస్తూ... 16 రూపాలను వివరించింది. ఆ రూపాల ధ్యాన శ్లోకాలను పఠిస్తూ... ఆయనను ఆరాధిస్తే కలిగే శుభ ఫలితాలను కూడా వివరించింది. వాటిలో ప్రధానమైన ఎనిమిది రూపాలు ఇవి...
శ్రీ విజయ గణపతి:
చేపట్టిన ప్రతి కార్యంలో, సంకల్పించిన ప్రతి ఉన్నత ఆశయంలో అసాధ్యాన్ని సుసాధ్యాలు చేస్తూ... సర్వత్రా విజయాన్ని అందించే శ్రీ విజయగణపతి అనుగ్రహం పొందడానికి ఈ శ్లోకంతో ధ్యానించాలి.
శ్లోకం: పాశాంకుశస్వదంతామ్రఫల వానాఖువాహనః
విఘ్నం నిహంతునః సర్వం రక్తవర్ణో వినాయకః
భావం: ఎర్రని శరీరకాంతితో, ఎలుక వాహనాన్ని అధిరోహించి, నాలుగు చేతుల్లో తన దంతాన్ని, అంకుశాన్ని, మామిడి పండును, పాశాన్ని ధరించిన శ్రీ విజయగణపతిని సకల కార్యాల్లో అన్ని అడ్డంకులను తొలగించి, సర్వత్రా విజయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను
శ్రీ మహా గణపతి:
తనను ఉపాసించిన భక్తులను...
వారి జాతక చక్రంలో దోషాల వల్ల కలిగే గ్రహ బాధలను నుంచి, వారు అనుభవిస్తున్న ప్రారబ్ధ కర్మల నుంచి, సకల కష్టాల నుంచి విముక్తులను చేసే శ్రీ మహా గణపతిని ఈ శ్లోకంతో ఉపాసించాలి.
శ్లోకం: హస్తీంద్రానన మిందుచూడ మరుణచ్ఛాయం
త్రినేత్రం రసా
దాశ్లిష్టం ప్రియయా సపద్మకరయా స్వాంకస్థయా సంతతమ్
బీజాపూరగదేక్షుకార్ముకలసచ్చక్రాబ్జపాశోత్పల
వీహ్యగ్రస్వవిషాణరత్నకలశాన్ హసైర్వహంతం
భజే
భావం: ఎర్రని శరీర కాంతితో, గజ ముఖంతో, నెలవంకతో కూడిన శిరోభూషణంతో, మూడు కన్నులతో... తన దంతం, దానిమ్మపండు, కలువ పువ్వు, వరికంకులు, చక్రం, గద, చెరుకు విల్లు, పద్మం, పాశం ధరించి, తన ఎడమ తొడపై ఆశీనురాలైన (రెండు చేతులతో పద్మాలు ధరించిన) దేవేరిని ఒక చేతితో ఆలింగనం చేసుకొని, తొండంతో రత్న కుంభాన్ని పట్టుకున్న శ్రీ మహా గణపతిని నిత్యమూ భజిస్తాను.
శ్రీ లక్ష్మీ గణపతి:
సకల భోగ భాగ్యాలను ప్రసాదించేవాడు శ్రీ లక్ష్మీ గణపతి. తనను ఆరాధించినవారికి ధన, ధాన్య సమృద్ధిని, అష్టైశ్వర్యాలను అనుగ్రహించే ఆయనను ఈ శ్లోకంతో ప్రార్థించాలి.
శ్లోకం: బిభ్రాణః శుకబీజపూరకమిలన్మాణిక్య కుంభాంకుశాన్
పాశం కల్పలతాం చ ఖడ్గవిలస జ్జ్యోతిః సుధాధానిర్ఘరః
శ్యామేనాత్తసరోరుహేణ సహితం దేవీద్వయం చాంతికే
గౌరాంగో వరదానహస్త సహితో లక్ష్మీగణేశోవతాత్
భావం: తెల్లని శరీరకాంతితో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ... ఇరువైపులా నల్ల తామర పూవులు ధరించి ఉన్న దేవేరులను ఆలింగనం చేసుకొని, చిలుక, దానిమ్మపండు, ఖడ్గం, అంకుశం, రత్నపాత్ర, కల్పలత, పాశాలను ధరించి, ఒక చేతితో వరదముద్రను ప్రదర్శించే శ్రీ లక్ష్మీ గణపతిని... సమస్త సన్మంగళాలను ప్రసాదించి, అందరినీ రక్షించాలని కోరుతూ ఆరాధిస్తున్నాను.
శ్రీ బాల గణపతి:
బుద్ధి మాంద్యం కలిగినవారికే కాదు... తమ జ్ఞానం మరింత మెరుగ్గా వికసించాలని కోరుకొనేవారికీ బుద్ధి వికాసం కలిగించే ఈ స్వామి ప్రసన్నత కోసం ఈ కింది శ్లోకాన్ని పఠిస్తూ... సాష్టాంగ నమస్కారాలను సమర్పించాలి.
శ్లోకం: కరస్థకదలీ చూత పనసేక్షుకమోదకమ్
బాలసూర్యనిభం వందే దేవం బాలగణాధిపమ్
భావం: కుడివైపు రెండు చేతులలో మామిడి పండు (చూత), అరటి పండు (కదళీ), ఎడమవైపు రెండు చేతులలో పనస పండు, చెరుకుగడ (ఇక్షు దండం), తొండంతో మోదకం ధరించి బాలసూర్యుడిలా ప్రకాశిస్తున్న బాల గణపతికి నమస్కరిస్తున్నాను.
శ్రీ సిద్ధ గణపతి:
పూజించిన భక్తులకు సకల మనో కార్యాలు సిద్ధింపజేసి, వారిని సర్వదా విజేతలుగా శ్రీ సిద్ధ గణపతి తీర్చిదిద్దుతాడు. ఆయనను ఈ శ్లోకంతో ప్రసన్నం చేసుకోవాలి.
శ్లోకం: పక్వచూతఫలపుష్పమంజరీ
రిక్షుదండతిలమోదకైః సహ
ఉత్వహన్ పరశుహస్తతే నమః
శ్రీసమృద్ధియుత హేమపింగళ
భావం: లేత పసుపు రంగు శరీర కాంతితో ప్రకాశిస్తూ, కుడివైపు రెండు చేతుల్లో పండిన మామిడి పండు (పక్వ చూత), గొడ్డలి (పరశు), ఎడమవైపు రెండు చేతుల్లో పూలగుత్తి (పుష్పమంజరి), చెరుకుగడ (ఇక్షుదండం), తొండంతో నువ్వుల కుడుము (తిలమోదక) ధరించి, శ్రీ, సమృద్ధి అనే దేవేరులతో కూడిఉన్న ఓ సిద్ధ గణపతీ! నీకు నమస్కారం.
శ్రీ విఘ్న గణపతి:
సర్వ కార్యాల్లో సమస్త విఘ్నాలనూ తొలగించి, భక్తులకు ఐశ్వర్యాన్ని, యశస్సును శ్రీ విఘ్న గణపతి ప్రసాదిస్తాడు. ఆయనను ఈ శ్లోకంతో ధ్యానించాలి.
శ్లోకం: శంఖేక్షుచాప కుసుమేషు కుఠారపాశ, చక్రస్వదంత సృణిమంజరికా శరాద్యైః
పాణిశ్రితైః పరిసమీహితభూషణశ్రీః, విఘ్నేశ్వరో విజయతే తపనీయగౌరః
భావం: అగ్నిలో కాల్చిన బంగారం లాంటి పచ్చని శరీర కాంతితో, పది చేతుల్లో... దంతాన్ని (స్వదంత), పూల బాణాన్ని (కుసుమేషు), అంకుశాన్ని, గొడ్డలిని, చక్రాన్ని, పూలగుత్తిని (మంజరికా), చెరుకు వింటిని (ఇక్షు చాప), పాశాన్ని, రెల్లు గడ్డిని (శరౌఘ), శంఖాన్ని ధరించి, సర్వాభరణాలతో ప్రకాశించే శ్రీ విఘ్న గణపతికి వందనాలు.
శ్రీ భక్త గణపతి:
ఆరాధించినవారిని అనుగ్రహించి, వారిలో ఆత్మవిశ్వాసం బలపడేలా చేసి, ఇహపరసిద్ధులను కలిగించే శ్రీ భక్తగణపతిని ఈ శ్లోకంతో స్తుతించాలి.
శ్లోకం: నారికేళామ్రకదలీ గుడపాయస ధారిణమ్... శరచ్చంద్రాభవపుషం భజే భక్తగణాధిపమ్
భావం: తెల్లని శరీరకాంతితో ప్రకాశిస్తూ, చేతుల్లో మామిడి పండు, అరటి పండు, బెల్లంతో చేసిన పాయస పాత్రను, కొబ్బరి కాయను ధరించి, ఆశ్రయించినవారిని గొప్ప భక్తులుగా మార్చే భక్తగణపతిని నిరంతరం స్తుతిస్తాను.
శ్రీ శక్తి గణపతి:
జీవనయానంలో, దాంపత్య జీవితంలో అపోహలతో ఎప్పుడైనా నైరాశ్యానికి లోనైనట్టయితే... అలాంటి సమయాల్లో తనను ఆరాధించినవారికి ఆత్మస్థైర్యాన్ని కలిగించే శ్రీ శక్తి గణపతిని ఈ శ్లోకంతో పూజించాలి.
శ్లోకం: ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం, పరస్పరాశ్లిష్ట కటి ప్రదేశమ్
సంధ్యారుణం పాశసృణీవహంతం, భయాపహం శక్తిగణేశమీడే
భావం: సంధ్యాకాంతి లాంటి ఎర్రని శరీరచ్ఛాయతో తేజోవంతుడై, ఆకుపచ్చని శరీరకాంతితో ప్రకాశించే దేవిని తన ఎడమ చేతితో ఆలింగనం చేసుకొని, ఆమె కటి ప్రదేశం మీద చేతిని ఉంచి, దంతాన్ని, అంకుశాన్ని, పాశాన్ని ధరించి ఉండే శ్రీ శక్తి గణపతిని అపోహలను, భయాన్ని దూరం చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.
డి.యన్.వి. ప్రసాద్ స్థపతి, 9440525788
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..
For More Telangana News and Telugu News..
Updated Date - Aug 27 , 2025 | 05:09 AM