Share News

AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు

ABN , Publish Date - Aug 26 , 2025 | 03:04 PM

మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో 12 మంది నిందితులకు సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు మంగళవారం నిర్ణయం తీసుకుంది.

AP Liquor Scam: లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు
ACB Court In Vijayawada

విజయవాడ, ఆగస్టు 26: మద్యం కుంభకోణం కేసులో నిందితులకు రిమాండ్ల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో 12 మంది నిందితులకు సెప్టెంబర్ 3వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడిగించింది. ఈ మేరకు ఏసీబీ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. రిమాండ్ పొడిగించిన నేపథ్యంలో 12 మంది నిందితులను వివిధ జైళ్లకు పోలీసులు తరలిస్తున్నారు. ఈ కేసులో వైసీపీ ఎంపీ పి.మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు. మిగిలిన 9 మంది నిందితులను విజయవాడ జైలుకు... అలాగే మరో ఇద్దరు నిందితులను గుంటూరు జైలుకు పోలీసులు తరలించారు.


మరోవైపు ఈ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రాజ్ కసిరెడ్డి మాట్లాడుతూ.. తనపై నమోదైన కేసును ఆయన ఖండించారు. కస్టోడియల్ విచారణ అని సిట్ తనను అరెస్ట్ చేసిందని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌లో తన పాత్ర ఎక్కడా లేదని పేర్కొన్నారు. తన తప్పు ఎక్కడా లేకపోయినా.. ఆధారాలు సృష్టించారని రాజ్ కసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కానీ.. ప్రస్తుతం కానీ ఇప్పటి వరకు తనపై ఒక్క కేసు కూడా లేదని గుర్తు చేశారు. ఈ ఒక్క లిక్కర్ కేసులో తప్ప ఇప్పటివరకు తాను మరో కేసులో అరెస్ట్ కాలేదన్నారు.


అయితే హైదరాబాద్‌, శంషాబాద్‌లోని విల్లాలో లభ్యమైన రూ.కోట్లు తనవైతే.. వాటిపై తన వేలి ముద్రలు ఉంటాయని వివరించారు. అయినా అంత సొమ్ము ఒకే వ్యక్తి వద్ద ఉంటుందా? అంటూ సందేహం వ్యక్తం చేశారు. ఈ మద్యం కుంభకోణంలో సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ తనకు తెలియదన్నారు. ఈ 300 మందిలో ఒక ఐదుగురిని విచారించి.. వారికి తాను తెలుసేమో మీరే అడగండని తెలిపారు. ఈ కేసులో చాలా మంది పేర్లు తాను తొలిసారిగా వింటునానని రాజ్ కసిరెడ్డి తెలిపారు.


ఇంకోవైపు.. మద్యం కుంభకోణంలో కీలక ఆధారాలు లభ్యం కావడంతో.. ప్రధాన నిందితుల్లో ఒకరైన రాజ్ కసిరెడ్డి ఆస్తుల జప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. మద్యం విక్రయాలతో వచ్చిన ఆదాయంతో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని భారీగా భూములను రాజ్ కసిరెడ్డి కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. వాటిని సైతం జప్తు చేసేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ పింఛన్ల కొనసాగింపుపై కీలక ఆదేశాలు..

ప్రపంచానికి అనుగుణంగా మారండి.. బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

For Telangana News And Telugu News

Updated Date - Aug 26 , 2025 | 07:36 PM