Lessons from Ardhanarishvara: అన్యోన్యతకు అర్థం అర్ధ నారీశ్వర తత్త్వం
ABN, Publish Date - Aug 29 , 2025 | 01:28 AM
ఏదైనా కథ విన్నప్పుడు... ఆ కథలోని విశేషాలను గ్రహించడం, మంచి విషయాలను పాటించడం ప్రధానం. గౌరీ శంకరుల కథలో... అర్ధనారీశ్వర తత్త్వాన్ని లోతుగా తెలుసుకోవాలి. ఆ ఆది దంపతుల అన్యోన్యతను అర్థం చేసుకోవడం...
చింతన
ఏదైనా కథ విన్నప్పుడు... ఆ కథలోని విశేషాలను గ్రహించడం, మంచి విషయాలను పాటించడం ప్రధానం. గౌరీ శంకరుల కథలో... అర్ధనారీశ్వర తత్త్వాన్ని లోతుగా తెలుసుకోవాలి. ఆ ఆది దంపతుల అన్యోన్యతను అర్థం చేసుకోవడం, ఆ విలువలను అనుసరించడమే ఆనందకరమైన గృహస్థ జీవితానికి సోపానం.
హిమవంతుని పుత్రిక అయిన హైమవతి (శైలజ) తండ్రి ఆదేశం మేరకు శంకరుడికి పరిచర్య చెయ్యడానికి వచ్చింది. అది నిర్జనమైన వనం. వారిద్దరూ యవ్వనంలో, ఏకాంతంలో ఉన్నారు. కానీ వారి మనసుల్లో శృంగారపరమైన భావన లేదు. చివరకు ఇంద్రుడి ఆజ్ఞ మేరకు శంకరుడి మీద మన్మధుడు బాణం వేయాల్సి వచ్చింది. శారీరక సౌందర్యం లాంటి వాటికే ప్రాధాన్యం ఇస్తున్న నేటి కాలపు పద్ధతులకు ఇది విరుద్ధం. అంటే శారీరక సౌందర్య దృష్టితో చూసినంతకాలం మానసిక ప్రేమ అనేది ఉండదని భావం. ఈ భేదాన్ని గుర్తించగలిగితే దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. మరో విషయం ఏమిటంటే... మన్మధుణ్ణి శంకరుడు తన మూడో కంటితో భస్మం చేయడం చూశాక కూడా... శైలజ తనంతట తానుగా నిర్ణయం తీసుకోలేదు. తల్లిదండ్రులకు చెప్పింది. తద్వారా ఆమె మానసికమైన ప్రేమ ఆమె తల్లితండ్రులకు అర్థమయింది. ఒక నిర్జన వన ప్రదేశానికి, ఏకాంతంలో ఉన్న పురుషుడి సేవ కోసం హిమవంతుడు తన పుత్రికను పంపాడంటే... తన కుమార్తె ప్రవర్తన, శీల సంపద మీద ఆయనకు ఎంత నమ్మకం ఉందో గమనించాలి.
భిన్నత్వంలో ఏకత్వం...
వివాహానికి ముందు ప్రేమించుకున్న కాలంలో... చెప్పలేనంత అన్యోన్యంగా కనిపించేజంటల సంసార సౌధం కొన్నాళ్ళకే బీటలు వారడం నేడు చూస్తున్నాం. ఇలాంటి సందర్భంలోనే గౌరీ శంకరుల కథను శ్రద్ధగా ఒంట పట్టించుకోవాలి. గౌరీ శంకరులు... అర్ధనారీశ్వర రూపంలో ఉంటారు. కుడివైపున శంకరుని రూపం, ఎడమవైపు గౌరీ రూపం. పూర్వం ఈ అర్ధనారీశ్వర చిత్రాన్ని దేవాలయం గోడల మీదో, ప్రధాన స్తంభం మీదో... శిల్ప రూపంలోనో, చిత్ర రూపంలోనో కనిపించేలా ఉంచేవారు. ‘‘కుడి అర చేత్తో కుడి కంటిని మూసి గౌరీదేవిని, ఎడమ అరచేత్తో ఎడమకంటిని మూసి శివయ్యను చూడు’’ అని తమ పిల్లలకు తల్లిదండ్రులు చెప్పేవారు, ఆ విధంగా చేయించేవారు. ఎందుకని? ఏ సంస్కారమూ లేని బిరుసైన జేగురు రంగు శిరోజాలు... అవి కూడా మోకాళ్ళు దాటేంత పొడవున శివుడికి ఉంటాయి. సంపెగ, అశోక, సురపొన్న, సౌగంధిక (చంపాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా) పుష్పాలతో చక్కగా అలంకృతమైన కొప్పు ఆమెకు ఉంటుంది. ఆగ్రహం వచ్చినా, అనుగ్రహాన్ని కురిపిస్తున్నా ఏ మార్పూ కనిపించని అష్టమి చంద్రుడిలా ఆమె నుదురు ఉంటే... ఏమాత్రం తేడా కనిపించినా ఆయన నుదుటి భ్రుకుటి ముడిపడిపోతూ ఉంటుంది. ఆయన కన్ను రుద్ర రూపంలో వెలుగుతూ ఉంటే ఆమె నేత్రం నీటి మడుగులో కదలాడే చేపలా... ఇంకా ఇంకా చూడాలనిపించేలా ఉంటుంది. మరో చిత్రం... ఆమె నయనం పరమ మనోహరంగా, ప్రశాంతంగా, అందరికీ ఉండేలా అడ్డంగా ఉంటే... ఆయనకు నుదుటి మధ్యలో మరో నేత్రం ఛటచ్ఛటలాడే అగ్నితో ఉండడమే కాదు, నిలువుగా ఉంటుంది. ఇలా... ఇద్దరూ ఒకే తీరుగా ఉండనే ఉండరు. కానీ భిన్నమైన లక్షణాలు కలిగి కూడా కలిసే కనిపిస్తారు. మానసికంగా కూడా ఐక్య భావంతోనే ఉంటారు.
ఏం నేర్చుకోవాలి?
ప్రతి వ్యక్తికి తనవైన కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. వాటిని ఎదుటివారు గౌరవించాలి. ‘‘నేను మంచి శిరోజాలంకరణతో ఉంటాను కదా! నీవూ అలాగే ఉండు! నా నుదురు ప్రశాంతంగా ఉంటుంది కదా! నీవెందుకు అలా ఉండవు? నేను చక్కటి పట్టు వస్త్రాలను ధరిస్తాను కదా! నీవెందుకు ఆ ఏనుగు, పులి చర్మాలు ధరిస్తావు? నా మాదిరిగా ఉండు!’’ అని ఆమె ప్రాధేయపూర్వకంగా కానీ, గద్దించి కానీ ఆయనను అడగలేదు. అలాగే ఆయన కూడా ‘‘నాలా నీవు ఉండవచ్చు కదా?’’ అని అడగలేదు. అంటే... దంపతులు తమ వివాహానికి ముందు విడివిడిగా ఉన్న స్థిరాభిప్రాయాలను పరస్పరం గౌరవించుకుంటూ ఉండాల్సిందే. అవి పుట్టుక నుంచి వచ్చినవి. ఆ లక్షణాలకు వారు అలవాటు పడి ఉంటారు కాబట్టి... వాటిని మార్చుకోవాలని పట్టుపట్టినా, నిర్బంధించినా... వివాహబంధం క్రమంగా సడలిపోతుంది. అందుకని... దాంపత్యంలో సర్దుకుపోవడం తప్పనిసరి. ఈ దశలో ఏ మూడో వ్యక్తో (వారివారి తల్లితండ్రులు, స్నేహితులు లేదా ఇరుగుపొరుగువారు) జోక్యం చేసుకుంటే... ఆ సంసారంలో అన్యోన్యత ఉండదు. అందుకే గౌరీ శంకరులు తమ మధ్య ఎవరూ చొరబడే వీలు లేకుండా నిలువునా కలిసిపోయి... అర్ధనారీశ్వరులుగా ఉంటారు. ఇలాంటి విశేషాలను అర్థం చేసుకున్నప్పుడు... అవి మన జీవితాలు సక్రమంగా సాగేందుకు ఉపకరిస్తాయి.
డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు
ఇవి కూడా చదవండి
ఏడేళ్ల తర్వాత చైనాకు మోదీ.. ఇక అమెరికాకు మామూలుగా ఉండదు..
రీల్ కోసం సాహసం.. కదులుతున్న రైలుకు వెలాడుతూ వీడియో తీస్తుంటే.. షాక్..
Updated Date - Aug 29 , 2025 | 01:28 AM