Sahaja Yoga: అంతటా ఆయనే
ABN, Publish Date - Aug 22 , 2025 | 01:52 AM
హిందూ ధర్మంలో గణేశుడికి మహోన్నతమైన స్థానం ఉంది. ప్రతి శుభకార్యం ఆయన ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆయనే ప్రారంభకర్త, జీవితంలోని అన్ని దశల్లో విఘ్నాలను తొలగించేవాడు....
సహజయోగ
హిందూ ధర్మంలో గణేశుడికి మహోన్నతమైన స్థానం ఉంది. ప్రతి శుభకార్యం ఆయన ప్రార్థనతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే ఆయనే ప్రారంభకర్త, జీవితంలోని అన్ని దశల్లో విఘ్నాలను తొలగించేవాడు. భౌతిక, మానసిక, జ్ఞాన సంబంధమైన ఆటంకాలను తొలగించే శక్తి. ఆయన అనుగ్రహంతో బుద్ధిని, వికాసాన్ని, సరైన మార్గదర్శనాన్ని పొందగలుగుతాం.
మనలో ఉండే ఏడుచక్రాలలో మొట్టమొదటి శక్తి కేంద్రం... మూలాధార చక్రం. అదే గణేశుడి నివాస స్థానం. ఆ చక్రానికి ఆయన అధిష్ఠాన దేవత. ఆయ చక్రం పృధ్వీతత్త్వంతో రూపొంది ఉంటుంది. గణేశుణ్ణి కూడా ఆయన తల్లి అయిన గౌరీమాత భూతత్త్వంతోనే తయారు చేసింది. మన షట్ చక్రాలలోనూ గణేశ తత్త్వం నిండి ఉంటుంది. అంటే అంతటా ఆయనే. మూలాధార చక్రంలో ఉండే ఆయన మనల్ని సదా రక్షిస్తూ ఉంటాడు. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి మూలమైన కుండలినీ శక్తి మేలుకొని.. ఊర్థ్వముఖంగా పయనిస్తున్నప్పుడు... ఆ శక్తిని సదా కాపాడేది ఆయన. ఆయన ప్రమేయం లేకుండా కుండలినీ శక్తి జాగృతం కాదు. అది జాగృతం కాకపోతే మనకు ఆత్మసాక్షాత్కారం అసాధ్యం. కుండలినీ మాతయే గణేశుని తల్లి అయిన గౌరీమాతగా... మన మూలాధారంలో మూడున్నర చుట్లతో నిద్రాణ స్థితిలో ఉంటుంది. వినాయకుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే... ఆయన గుణగణాలు, లక్షణాలు, శక్తులు మనలో స్థిరపరుచుకోవాలి.
అవి నేర్చుకోవాలి...
గణేశునిలో ప్రప్రథమంగా చెప్పుకోవలసిన ముఖ్యమైన గుణం... అమాయకత్వం. దాన్నే ఆధ్యాత్మికంగా ‘అభోదిత తత్త్వం’ అంటారు. అది మనలో ఉంటే... మనల్ని ఎవరూ మోసం చేయలేరు. ఎవరూ హాని కలిగించలేరు. అటువంటి అమాయకత్వాన్ని మనలో స్థిరపరుచుకుంటే ఎలాంటి సమస్యలనైనా సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతాం. ప్రజల దృష్టిలో అమాయకత్వం అంటే చేతకానితనం. అమాయకత్వంతో ఉంటే ఇతరుల చేతిలో మోసపోతామనే అపోహ వారిలో ఉంటుంది. కానీ వాస్తవానికి అమాయకత్వం అంటే విచక్షణ, వివేకంతో కూడిన గణేశుని శక్తి. ఆ లక్షణం ఉన్నవారికి సదా గణేశుని రక్షణ ఉంటుంది. ఇక... ఆయన శరీరం మానవుల మాదిరిగా ఉన్నప్పటికీ... శిరస్సు ఏనుగు శిరస్సు. ఏనుగు జంతు ప్రపంచంలో అత్యంత తెలివైనది. దాని చెవులు ఎంత దూరంలోని శబ్దాన్నైనా వినగలవు, కళ్ళు చాలా దూరం చూడగలవు. నైపుణ్యం, నేర్పరితనం గణేశుని గుణాలు. ఆయన వివేకాన్ని, విచక్షణను అనుగ్రహిస్తాడు. ఆయన ఎంత మహోన్నతుడో అంత సూక్ష్మరూపుడు. పెద్ద పొట్టతో ఉన్నప్పటికీ ఎంతో తేలికగా ఉంటాడు. అందుకే అతి చిన్నదైన ఎలుక మీద కూర్చోగలుగుతాడు. ఆయన నిరాండబరతకు చిహ్నమే ఎలుక వాహనం. ఆయనకు ఉన్న గుణగణాలలో మరొకటి... తల్లిపట్ల శరణాగతి. ఎల్లప్పుడూ తల్లిని ప్రసన్నం చేసుకొనే ప్రయత్నంలో ఉంటాడు. అతనిలోని సమస్త జ్ఞానానికి, ఆనందానికి ఆ తల్లే మూలం. తల్లి పట్ల ఉండవలసిన వినయవిధేయతలు, గౌరవం ఆయన నుంచి నేర్చుకోవాలి.
ఆ శక్తిని పెంపొందించుకుందాం...
మనలో గణేశతత్త్వాన్ని సంరక్షించుకొని, అంతర్గతంగా మనల్ని మనం పరిశుద్ధంగా, కల్మషరహితంగా ఉంచుకోవాలి. తోటివారితో నిర్మలమైన సత్సంబంధాలు అభివృద్ధి చేసుకుంటే ఎలాంటి సమస్యలూ రావు. గణేశుడు బ్రహ్మాండాన్ని పవిత్రపరిచే శక్తి కలిగినవాడు. ఆ శక్తి దేనివల్లా మలినం కాదు. మీలో గణేశ శక్తిని పెంపొందించుకుంటే మీ కళ్ళు ప్రకాశిస్తూ ఉంటాయి. సచ్ఛీలమే ప్రధాన లక్షణంగా ఉన్నవారిని ఆయన ఎంతగానో ఇష్టపడతాడు. భూమాతకు ఉన్న అయస్కాంత శక్తి ఆయనలో ఉంది. ఆ శక్తితోనే అందరినీ తనవైపు ఆయన ఆకర్షిస్తాడు. మనలో అంతర్గతంగా ఉన్న గణేశ శక్తిని, తత్త్వాన్ని మేలుకొలిపాలి. తద్వారా ఆయన గుణగణాలు మనలో వాటంతట అవే స్థిరపడతాయి. అప్పుడు మనం ఆయన కృపకు పాత్రులం అవుతాం. మనలో ఉన్న నిద్రాణ స్థితిలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసి... ఆత్మసాక్షాత్కారం పొంది, సహజయోగ సాధన ద్వారా శ్రీగణేశ తత్త్వాన్ని, గుణగణాలను మనలో స్థిరపరచుకోవచ్చు.
డాక్టర్ పి. రాకేష్, 8988982200
‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,
సహజయోగ ట్రస్ట్’, తెలంగాణ
ఈ వార్తలు కూడా చదవండి..
ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్
టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం
Read Latest AP News and National News
Updated Date - Aug 22 , 2025 | 01:52 AM