Religious Architecture: ఆలయం సమున్నత సంస్కృతికి ప్రతీక
ABN, Publish Date - Aug 15 , 2025 | 12:39 AM
భగవంతుడు సర్యాంతర్యామి. ఈ జగత్తు అంతటా నిండి ఉన్నాడు. ఆయన లేని చోటు ఈ విశ్వంలో ఎక్కడ వెతికినా కనిపించదు. అనాదిగా వేదాలు, ఆగమాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్న సత్యం ఇదే...
తెలుసుకుందాం
భగవంతుడు సర్యాంతర్యామి. ఈ జగత్తు అంతటా నిండి ఉన్నాడు. ఆయన లేని చోటు ఈ విశ్వంలో ఎక్కడ వెతికినా కనిపించదు. అనాదిగా వేదాలు, ఆగమాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్న సత్యం ఇదే. వేదకాలం నుంచి ఎందరో మహర్షులు, మునులు, సిద్ధులు, ఆచార్య పురుషులు ఇదే సత్యాన్ని తెలుసుకొని... భగవంతుడి అర్చారూపాన్ని మనకు అందించారు. సాక్షాత్తూ మహా విష్ణువే అయిదు రాత్రుల్లో అయిదుగురు దేవతలకు ఉపదేశించిన పాంచరాత్రం ‘భగవంతుడి స్వరూపాలు అయిదు’ అని పేర్కొంది. అవి: పర స్వరూపం, వ్యూహ స్వరూపం, విభవ స్వరూపం, అంతర్యామి స్వరూపం, అర్చా స్వరూపం.
పరమపదమైన వైకుంఠంలో కొలువుతీరిన పరావాసుదేవమూర్తిని ‘పర స్వరూపం’ అని, క్షీరసాగరంలో శేషశయనుడై ఉండే అనంతశయనమూర్తిని ‘వ్యూహ స్వరూపం’ అని, దుష్ట శిక్షణకోసం, శిష్ట రక్షణ కోసం భూలోకంలో అవతరించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడి లాంటి రూపాలను ‘విభవ స్వరూపం’ అని, సకల చరాచర జీవరాశులలో... అణువు నుంచి మహత్తు వరకూ అన్నీ తానై ఉన్న స్వామిని ‘అంతర్యామి స్వరూపం’ అని, నేడు కలియుగంలో మానవులైన మనల్ని అనుగ్రహించడానికి ఆలయంలో కొలువుతీరి, విగ్రహ రూపంలో అర్చనలు అందుకొనే స్వామిని ‘అర్చా స్వరూపం’ అని అంటారు. పైన పేర్కొన్న అయిదు స్వరూపాల్లో చివరిదైన అర్చా స్వరూపమే... భగవంతుణ్ణి సులభంగా దర్శించుకొనే మార్గం. మనం అందరం ఆ అర్చా స్వరూపాన్నే భగవంతుడిగా దర్శించుకుంటున్నాం.
ఎన్నో పేర్లు
విశ్వమంతటా వ్యాపించిన భగవంతుడి శక్తిని ఒకచోట కేంద్రీకరింపజేసి, అక్కడ ఆలయాన్ని నిర్మించి, అర్చామూర్తిని ప్రతిష్ఠించే విధానాన్ని శిల్ప, ఆగమ గ్రంథాలు అద్భుతంగా వర్ణించాయి. ‘దేవాలయం’ అంటే ‘దేవుని రూపం ఉండే చోటు’ అని మనందరికీ తెలుసు. నిజానికి... భక్తుల జీవాత్మను ఆ పరమాత్మలో లయం చేసే ఆత్మానాత్మ సంయోగానికి మన మహర్షులు నిర్దేశించిన పవిత్రమైన స్థలమే దేవాలయం. ఆలయానికి ఉన్న అనేక పేర్లను శిల్ప, ఆగమ గ్రంథాలు వివరించాయి. అవి: ప్రాసాదం, సదనం, సద్మం, గృహం, ధామం, నికేతనం, విమానం, హార్మ్యం, వాసం, మందిరం... ఇలా ఆలయానికి ఎన్నో పర్యాయపదాలు ఉన్నాయి.
ఎప్పుడు మొదలైంది?
ఆలయం అనేది మన హైందవ సంస్కృతి సమున్నత రూపానికి ప్రతీక. దేవతలందరూ కొలువుతీరే పరమ పవిత్రమైన ప్రదేశం. పురాణాల లోతుల్లోకి వెళితే మనకు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. ఆలయాలు ఏ యుగంలో ఆకృతి దాల్చాయనే సంగతులతో పాటు వాటి వికాసం, జనాదరణ లాంటి అంశాలను కూడా అవి ఎంతో విస్పష్టంగా చెప్పాయి. విష్ణు ధర్మోత్తర పురాణాన్ని ఆధారంగా తీసుకుంటే... కృతయుగంలో ఈ భూమి మీద దేవాలయ నిర్మాణమే లేదు. అప్పుడు దేవతలను ప్రత్యక్షంగా దర్శించడానికి, పూజించడానికి అవకాశం ఉండేది. త్రేతా, ద్వాపర యుగాల్లో కూడా దేవతలను ప్రత్యక్షంగా దర్శించేవారు. అయితే దేవతా విగ్రహాలను గృహాల్లో పెట్టుకొని పూజించే... గృహార్చా విధానం త్రేతాయుగంలోనే ప్రారంభమయిందని చెప్పవచ్చు. విగ్రహారాధన కూడా ఆ యుగంలోనే వ్యాప్తిలోకి వచ్చినట్టు స్పష్టమవుతోంది. అరణ్యవాసంలో ఉన్న రాముడు తన పూర్వీకులను విగ్రహరూపంలో పూజించడం, అలాగే లంకానగర ప్రవేశానికి ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించడం, రావణుడు తన నగరంలో శివలింగారాధన చేయడం లాంటివి వాల్మీకి రామాయణంలో మనకు కనిపిస్తాయి. ద్వాపర యుగంలో కూడా అరణ్యాలు, గుహలు, పర్వత ప్రదేశాల్లో, ఆశ్రమాల్లో ఋషులు, సిద్ధులు, మునులు విగ్రహ ప్రతిష్ఠ చేసి పూజించడం కొనసాగింది. నేటి కలియుగంలో... మన దేశంలోని పవిత్ర ప్రదేశాలతోపాటు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో దేవాలయాలను నిర్మించి, ఆగమోక్త విధితో ప్రతిష్ఠాదులు చేసి, పూజలు చేయడం ప్రాచుర్యంలోకి వచ్చింది.
దగ్గుపాటి నాగవరప్రసాద్ స్థపతి
9440525788
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
Updated Date - Aug 15 , 2025 | 12:39 AM