Tanmayi Srivedi Bocce Ball Champion: విజయం ఆమెకు దాసోహమయింది
ABN, Publish Date - Aug 13 , 2025 | 12:59 AM
సాధించాలన్న తపన... పట్టుదలగా ప్రయత్నించే తత్వం... ఇవే ఆమెను శిఖరం వైపు అడుగులు వేయించాయి. మానసిక వైకల్యాన్ని అధిగమించి... జాతీయ స్థాయి ‘బోసీ బాల్’ పోటీల్లో విజేతగా నిలిపాయి. ఎస్ తన్మయ్ శ్రీదేవి...
విజేత
సాధించాలన్న తపన... పట్టుదలగా ప్రయత్నించే తత్వం... ఇవే ఆమెను శిఖరం వైపు అడుగులు వేయించాయి. మానసిక వైకల్యాన్ని అధిగమించి... జాతీయ స్థాయి ‘బోసీ బాల్’ పోటీల్లో విజేతగా నిలిపాయి. ఎస్ తన్మయ్ శ్రీదేవి... విభిన్నమైన క్రీడలో విశేషంగా రాణిస్తున్న ఈ సెకండ్ ఇంటర్ విద్యార్థిని జర్నీ ‘నవ్య’ పాఠకుల కోసం...
పశ్చిమగోదావరి జిల్లా... పెంటపాడు పోస్ట్ బేసిక్ పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది ఎస్ తన్మయ్ శ్రీదేవి. బాల్యం నుంచే మానసిక సమస్యతో ఇబ్బంది పడుతోంది. ఎవరితో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడదు. బాగా నచ్చితేనే మాట కలుపుతుంది. కానీ ఒక పనిని ఇష్టపడితే అది పూర్తయ్యే వరకు వదిలిపెట్టదు. ఆ పట్టుదలే ఆమెను నేడు నలుగురిలో గొప్పగా నిలిపింది. ఆటలో అత్యుత్తమంగా రాణించేందుకు దోహదపడింది.
అమ్మ, అమ్మమ్మ అండతో...
తన్మయ్ పరిస్థితిని అర్థం చేసుకున్న తల్లి సుగుణ... చిన్నప్పటి నుంచీ అన్నింటా బిడ్డను వెన్నంటి ఉంటున్నారు. తాత, అమ్మమ్మలు కూడా అండగా నిలిచారు. తమ చిన్నారి అందరి పిల్లల్లా చదువుకోవాలని, ఆటపాటల్లో రాణించాలని కోరుకున్నారు. తద్వారా తన్మయ్ మానసిక పరిస్థితిలో కొంతైనా మార్పు వస్తుందని భావించారు. అందుకే తన్మయ్‌ను క్రమం తప్పకుండా బడికి పంపించారు. తనకు కావల్సినవన్నీ సమకూర్చుతున్నారు. ‘‘మా అమ్మాయి పుట్టినప్పుడు తనకు మానసిక సమస్య ఉందని మాకు తెలియదు. కొంచెం ఎదిగిన తరువాత తన ప్రవర్తన భిన్నంగా అనిపించింది. వైద్యులను సంప్రదిస్తే... తన్మయ్‌కి మానసిక సమస్య ఉందని చెప్పారు. అయినా నేను నిరుత్సాహపడలేదు. అందరు పిల్లల్లానే మా అమ్మాయి కూడా రోజు బడికి వెళ్లి బాగా చదువుకోవాలని కోరుకున్నాను. మా అమ్మానాన్నలు కూడా నాకు అండగా నిలిచారు. మొదట్లో తన్మయ్ స్కూల్‌కు వెళ్లేందుకు ఇష్టపడేది కాదు. ఎలాగో నచ్చజెప్పి పంపించేవాళ్లం. నిదానంగా తను బడికి అలవాటు పడింది’’ అంటూ తన్మయ్ తల్లి సుగుణ నాటి రోజులు గుర్తు చేసుకున్నారు.
కోచ్ సహకారంతో... (తన్మయ్‌కి శిక్షణ ఇస్తున్న కోచ్ సాయిస్వరూప)
చదువుతో పాటు తన్మయ్‌ను ఏదైనా ఆటలో పెడితే బాగుంటుందని ఆమె తల్లి భావించారు. కోచ్ సాయి స్వరూపను కలిశారు. ఆమె బోసీ బాల్‌లో శిక్షణ ఇస్తారు. కానీ తొలుత తన్మయ్ ఆటలపై ఆసక్తి చూపలేదు. ‘‘తన్మయ్‌ని ఈ ఆటలోకి దింపడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఆడటానికి మొదట్లో తను అస్సలు ఇష్టపడలేదు. ఎన్నో ప్రయత్నాల తరువాత చివరకు తనను ఒప్పించాను. వైకల్యం ఉన్నవారిలో ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. దాన్ని వెలికి తీసి సాన పెడితే... వారూ మెరికల్లా తయారవుతారు. నేను చేసింది అదే. ఎప్పుడైతే తన్మయ్ సాధన ప్రారంభించిందో... అప్పటి నుంచీ వెనక్కి తగ్గలేదు. ఎంతో క్రమశిక్షణతో నేర్చుకుంది. ఆమెలో నైపుణ్యం గమనించి... మండల స్థాయి పోటీలకు పంపించాం. అక్కడ రాణించడంతో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లింది. విజయాలు సాధించింది. మానసిక పరిపక్వత లేని ఒక అమ్మాయి అసాధారణ ప్రతిభతో ఆకట్టుకుంటోంది. నిజంగా ఇది గొప్ప విషయం’’... అంటారు కోచ్ సాయిస్వరూప.
జాతీయ స్థాయిలో...
అంతటితో తన్మయ్ ప్రయాణం ఆగిపోలేదు. రాష్ట్ర స్థాయిలో సత్తా చూపడంతో జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. అందరి సహకారంతో మరింత ఉత్సాహంగా సాధన చేసింది. అనంతరం ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్‌లోని ‘అటల్ బిహారీ వాజ్‌పేయి యూనివర్సిటీ’లో జరిగిన జాతీయ స్థాయి చాంపియన్‌షిప్‌లో పాల్గొంది. మొత్తం 22 రాష్ట్రాల నుంచి 250 మంది క్రీడాకారులు ఇందులో పోటీపడ్డారు. వారందరినీ దాటి విజేతగా అవతరించి, స్వర్ణ పతకం సాధించింది తన్మయ్.
‘‘నా కూతురు గెలుపు చూసి ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. మాటలు రావడంలేదు. ఈ విజయం అస్సలు ఊహించలేదు. ఒక తల్లిగా ఇంతకు మించిన సంతోషం నాకు ఏముంటుంది! మా అమ్మాయికి ఎల్లవేళలా మద్దతుగా నిలిచిన మా అమ్మానాన్నల రుణం తీర్చుకోలేనిది. అంతర్జాతీయ వేదికపై నా కూతుర్ని చూడాలన్నది నా కోరిక. త్వరలోనే అది నెరవేరుతుందని ఆశిస్తున్నాను’’ అంటూ ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు సుగుణ.
ఎం.సతీశ్, పెంటపాడు
ఏమిటీ ‘బోసీ బాల్’..?
‘బోసీ బాల్’ అనేది ఒక ఇటాలియన్ క్రీడ. దీన్ని ఎవరైనా ఆడచ్చు. ‘స్పెషల్ ఒలింపిక్స్’ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం దీన్ని నిర్వహిస్తుంది. తద్వారా వారిలో ఆత్మవిశ్వాసం నింపి, సామాజికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తుంది. ఈ గేమ్‌లో ముందుగా టాస్ గెలిచిన అభ్యర్థి తనకు నచ్చిన బోసీ బాల్ రంగును ఎంచుకోవాలి. తరువాత ‘పలినా’ (టార్గెట్ బాల్) అనే తెల్ల బాల్‌కు సాధ్యమైనంత చేరువగా త్రో చేయాలి. తమకు కేటాయించిన నాలుగు బాల్స్‌ను ఇలా తెల్ల బాల్‌కు దగ్గరగా వేయాలి. ఎవరైతే అత్యంత చేరువగా వేస్తారో వాళ్లను విజేతగా ప్రకటిస్తారు.
చాలా ఆనందంగా ఉంది...
నాకు చిన్నప్పటి నుంచీ స్కూల్‌కు వెళ్లడం ఇష్టం ఉండేది కాదు. మా అమ్మ, అమ్మమ్మ, తాతయ్య నన్ను బలవంతంగా బడికి పంపించేవారు. స్కూల్‌లోనే నేను ఈ ఆట నేర్చుకున్నాను. మా కోచ్ నన్ను బాగా చూసుకునేవారు. ఎంత విసిగించినా నన్ను ఒక్క మాట కూడా అనేవారు కాదు. నేను కూడా బాగా కష్టపడి సాధన చేశాను. అందుకే ఇప్పడు ఇంతటి విజయాన్ని సాధించగలిగాను.
- తన్మయ్ శ్రీదేవి
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 13 , 2025 | 01:00 AM