ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Weaving Heritage: చేనేతకు పూర్వ వైభవం అప్పుడే

ABN, Publish Date - Aug 07 , 2025 | 02:04 AM

ఒక శాస్త్రవేత్తగా తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి డాక్టర్‌ సుచిత్ర ఎల్లా. భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలిగా శాస్త్ర ప్రపంచంలో ఆమెకు వేరే పరిచయం అవసరం లేదు. కొవిడ్‌ సమయంలో...

అతిథి

ఒక శాస్త్రవేత్తగా తెలుగువారి కీర్తి ప్రతిష్ఠలను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన వ్యక్తి డాక్టర్‌ సుచిత్ర ఎల్లా. భారత్‌ బయోటెక్‌ సహ వ్యవస్థాపకురాలిగా శాస్త్ర ప్రపంచంలో ఆమెకు వేరే పరిచయం అవసరం లేదు. కొవిడ్‌ సమయంలో భారత్‌ బయోటెక్‌ కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్‌ డోస్‌లను తయారుచేసి అనేకమంది ప్రాణాలు కాపాడినందుకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆమెను ‘పద్మభూషణ్‌’ పురస్కారంతో సత్కరించింది. వ్యాక్సిన్ల పరిశోధనలతో నిత్యం హడావుడిగా ఉండే సుచిత్రను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం... చేనేత, హస్తకళలకు ప్రత్యేక సలహాదారురాలిగా నియమించింది. గురువారం అంతర్జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో ఆమె ‘నవ్య’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

వ్యాక్సిన్ల తయారీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని సాధించిన మీరు హఠాత్తుగా హస్తకళలు, చేనేత రంగం వైపు రావటం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. దీని వెనుక కారణమేదైనా ఉందా?

మీరే కాదు. చాలా మంది నన్ను ఈ ప్రశ్న అడిగారు. వృత్తిపరంగా పైకి ఎదగటం నాణానికి ఒక పార్శ్వం మాత్రమే. మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అభిమానం, కళల పట్ల అభినివేశం ఉండటం మరో పార్శ్వం. మన పూర్వీకులు వ్యవసాయదారులు. వారు పత్తిని పండించి ఉంటారు. దాని ద్వారా బట్టలు నేసి ఉంటారు. కొన్ని వేల ఏళ్లుగా ఇది మనకు ఒక వారసత్వంగా వస్తోంది. అంటే ఈ సంస్కృతి సంప్రదాయాలు మన డీఎన్‌ఏలోనే ఉన్నాయి. మనం ఆచరించే సంప్రదాయాలు, జరుపుకొనే పండుగలు మన జీవితంలో విడదీయరాని ఒక భాగం. వీటన్నింటినీ నేను చిన్నప్పటి నుంచీ చూస్తూ పెరిగాను. అంతే కాదు... నాకు హస్తకళలు అన్నా.. చేనేత దుస్తులన్నా ప్రత్యేకమైన అభిమానం. చిన్నప్పటి నుంచి అందమైన హస్తకళలు ఎక్కడ కనిపించినా వాటిని కొని ఆఫీసులోనో, ఇంట్లోనో పెట్టుకోవటం అలవాటు. మా ఆఫీసుకు వచ్చేవారు వాటిని చూసి ప్రశంసిస్తున్నప్పుడు చాలా గర్వంగా అనిపిస్తుంది. మా కంపెనీ తరఫున మేము ఎవరికైనా బహుమతి ఇవ్వాలన్నా మన హస్తకళారూపాలను ఇస్తాం. అందువల్ల నాకు హస్తకళలు, చేనేత దుస్తులు కొత్త కాదు. అవి అంటే నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది కాబట్టే సలహాదారుగా నన్ను నియమించారు.

చేనేత వస్త్రాలపై మీకు ఆసక్తి ఎప్పటి నుంచి?

నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. అందువల్ల దేశంలో అనేక ప్రాంతాల్లో నేను పెరిగాను. మేము ఏ రాష్ట్రంలో ఉన్నా నాన్నగారు ఆ రాష్ట్రంలో అందుబాటులో ఉన్న చేనేతలను మాకు కొనేవారు. మేము వాటినే కట్టుకొనేవాళ్లం. మేము చెన్నైలో స్థిరపడిన తర్వాత ధర్మవరం, వెంకటగిరి తదితర చేనేత చీరల గురించి తెలిసింది. మా అమ్మమ్మ ఎప్పుడూ వెంకటగిరి చీరలే కట్టుకుంటూ ఉండేది. ఆ చీరల మృదుత్వం నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి... దక్షిణ భారత దేశంలో ఉన్న రాష్ట్రాలలో వాతావరణ పరిస్థితులను గమనిస్తే... వేడి ఎక్కువగా ఉంటుంది. తేమ కూడా ఎక్కువే. ఇలాంటి వాతావరణ పరిస్థితులకు చేనేత వస్త్రాలే హాయిగా ఉంటాయి. అందుకే ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో చేనేత పరిశ్రమకు మంచి ఆదరణ లభించింది. కేవలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ప్రాంతంలోనే వెయ్యికి పైగా కోఆపరేటివ్‌ సొసైటీలు ఉండేవంటే- వీటికి ఎంత ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ పరిస్థితుల ప్రభావంవల్ల వీటికి ఆదరణ తగ్గుతూ వచ్చింది. చేనేత దుస్తులకు మళ్లీ ఆదరణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఎందుకంటే అది మనందరి వారసత్వ సంపద. దీనిని మనం వదిలేసుకోకూడదు.

సలహదారుగా నియమితులైన తర్వాత ఏఏ ప్రాంతాలను సందర్శించారు. మీ అనుభవాలేమిటి?

ఏప్రిల్‌ చివరలో నన్ను నియమించారు. పదవిని చేపట్టిన తర్వాత పరిస్థితులను అర్థం చేసుకోవటానికి నెల పట్టింది. ఏపీలో 34 చేనేత క్లస్టర్స్‌ ఉన్నాయి. వీటిలో గత రెండు నెలలలో 10 క్లస్టర్స్‌ను సందర్శించాను. మిగిలిన వాటిని కూడా త్వరలోనే సందర్శిస్తాను. కొన్ని విషయాలు గమనించాను. చేనేత కార్మికులందరూ తమ ఇళ్ల నుంచే పని చేస్తారు. అదే వారికి జీవనాధారం. వీరి స్థితిగతులు బాగుపడాలంటే కోఆపరేటివ్‌ మోడల్‌ను బలంగా అమలు చేయాలి. వీరందరికీ అవసరమైన ముడి సరుకు అందించటం, రుణ, మౌలిక సదుపాయాలు కల్పించటం, సాఽధన సంపత్తి, నేసిన దుస్తులకు జాతీయంగా, అంతర్జాతీయంగా బ్రాండింగ్‌ చేయటం చాలా కీలకమైన అంశాలు.

మన చేనేతకు పూర్వ వైభవం తీసుకురావాలంటే ఏం చేయాలి?

మనకు ఏఏ ప్రాంతాలు చేనేతలకు ప్రసిద్ధో తెలుసు. ఇప్పటికీ ఆ ఊళ్లు ఉన్నాయి. తరతరాలుగా నేతను నమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి. కానీ వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. కొత్త తరం ఈ వృత్తిలోకి రావటం లేదు. ఎందుకంటే వారికి లాభసాటిగా అనిపించటం లేదు. క్రమం తప్పకుండా ఆదాయం వస్తుందనే భరోసా వారికి కలగటం లేదు. నేత నేయటానికి ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి. సాధారణంగా అది కుటుంబ వారసత్వంగా వస్తుంది. కొత్త తరం వారు ఆ వారసత్వ బాధ్యత తీసుకోవటానికి ఇష్టపడటం లేదు. నేను కేవలం ఆంధ్రప్రదేశ్‌ గురించి మాత్రమే చెప్పటంలేదు. నాకు కాంచీపురం ప్రాంతం బాగా తెలుసు. కొన్ని వేల ఏళ్లుగా అక్కడ పట్టు చీరలు నేస్తున్నారు. ఈమధ్య కాలంలో కాంచీపురం చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి చూస్తే- కొత్త తరం వారు ఈ వృత్తిలోకి రావటం లేదు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే వెయ్యికి పైగా కోఆపరేటివ్‌ సొసైటీలు ఉండేవి. ఇవి 50 శాతం పైగా తగ్గిపోయాయి. అంటే ఈ సొసైటీలకు కూడా ఆదరణ తగ్గిందని అర్థం చేసుకోవాలి. మౌలిక సదుపాయాల రూపకల్పనకు పెట్టుబడులు, సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తూనే కొత్త కొత్త టెక్నాలజీల సాయం తీసుకోవటం వంటి అనేక చర్యలు చేపట్టాల్సి ఉంది.

చేనేతలు చాలా ఖరీదనే అభిప్రాయం కూడా ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. చేనేతలకు ఆదరణ తగ్గటానికి ఇది కూడా ఒక కారణమా?

నా ఉద్దేశంలో చేనేత వస్త్రాలు అంత ఖరీదు కాదు. మీకు ఒక ఉదాహరణ చెబుతా. అందమైన ఆరు గజాల చేనేత చీర వెయ్యి రూపాయలకు దొరుకుతుంది. ఆరు గజాలంటే ఐదున్నర మీటర్లు. ఇంత తక్కువ రేటుకు దొరుకుతున్నా... చేనేతలు ఖరీదనే అభిప్రాయం కొందరిలో నాటుకుపోయింది. దీనికి మరో కోణం కూడా ఉంది. సాధారణం నేత పనివారు చిన్న చిన్న బృందాలుగా పని చేస్తారు. దీనివల్ల ఎక్కువ ఉత్పత్తి ఉండదు. ముడి సరుకుల కొనుగోలు.. మార్కెటింగ్‌.. బ్రాండింగ్‌కు సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. దీనివల్ల ఖరీదు కూడా ఎక్కువే ఉంటుంది. అలా కాకుండా కోఆపరేటివ్‌ పద్ధతిలో ఉత్పత్తి భారీగా పెరిగితే ఓవర్‌హెడ్స్‌ తగ్గుతాయి. వ్యాక్సిన్ల విషయంలో కూడా అంతే. ఉత్పత్తి తక్కువగా ఉంటే ధర ఎక్కువగా ఉంటుంది. ఉత్పత్తి భారీగా ఉండే ధర గణనీయంగా తగ్గిపోతుంది.

సీవీఎల్‌ఎన్‌ ప్రసాద్‌

ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో చేనేత పరిశ్రమకు మంచి ఆదరణ లభించింది. కానీ పరిస్థితుల ప్రభావంవల్ల వీటికి ఆదరణ తగ్గుతూ వచ్చింది. చేనేత దుస్తులకు మళ్లీ ఆదరణ కల్పించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఎందుకంటే అది మనందరి వారసత్వ సంపద. దీనిని మనం వదిలేసుకోకూడదు.

ఈ వార్తలు కూడా చదవండి..

జీవీఎంసీ స్టాడింగ్ కమిటీ ఎన్నికల్లో స్తతా చాటిన కూటమి

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

మరిన్నీ తెలుగు వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 07 , 2025 | 02:04 AM