Share News

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

ABN , Publish Date - Aug 06 , 2025 | 03:08 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. అలాగే తన సింగపూర్ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా మంత్రులకు సీఎం వివరించారు.

AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు
AP Cabinet Meeting

అమరావతి, ఆగస్ట్ 06: స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభిస్తున్నామని.. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కేబినెట్‌ మంత్రులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అయితే ఆగస్ట్ 15వ తేదీ.. స్వాతంత్ర దినోత్సవమని.. ఆ రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మంత్రులు విన్నవించారు. కానీ టైమ్ అడ్జెట్‌ చేసుకుని ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరుకావాలని వారికి సీఎం సూచించారు. బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించడంతోపాటు తమ సింగపూర్ పర్యటనకు సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా మంత్రులతో సీఎం చంద్రబాబు పంచుకున్నారు.


వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు సింగపూర్ వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు రానని చెప్పారన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వారు.. అక్కడికి వెళ్లి సింగపూర్ మంత్రులను బెదిరించారని చెప్పారు. కేసులు పెడతామని బెదిరించి వాళ్లను భయపెట్టే పరిస్థితి జరిగిందని తెలిపారు. అలాగే సీడ్ క్యాపిటల్‌లో తాము భాగస్వామ్యం కాబోమని వారు స్పష్టం చేశారని పేర్కొన్నారు. పార్టనర్ షిప్ సమ్మిట్‌కు వాళ్లని రమ్మని ఆహ్వానించామని తెలిపారు. స్నేహ సంబంధాలు కొనసాగించాలని వారిని సూచించినట్లు పేర్కొన్నారు. అందుకు వాళ్లు సైతం ఒప్పుకున్నారని చెప్పారు.. సింగపూర్ పర్యటనలో భాగంగా మొత్తం 41 సమావేశాల్లో పాల్గొన్నానన్నారు.


ఇక ఈ కేబినెట్ సమావేశంలో కొత్త బార్ పాలసీను ఆమోదించారు. అయితే కల్లు గీత కార్మికుల కోసం కేటాయించిన షాపుల్లో బినామీలు వస్తే సహించనని హెచ్చరించారు. ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు ఉచిత ప్రయాణం ప్రారంభానికి ముందే.. ఆటో డ్రైవర్లను పిలిపించి వారితో మాట్లాడాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో సూచించారు. ఈ సూచనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఆటో డ్రైవర్లను వెంటనే పిలిపించి వారితో సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. వారితో మాట్లాడి తగిన సహాయం చేయాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు.



బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌ ప్రమోషన్‌లో భాగంగా ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు జులై 26 నుంచి 31వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కంపెనీ సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో ఆయన వరుసగా భేటీలు నిర్వహించారు. ఆ క్రమంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పారిశ్రామిక పాలసీ, భూమి లభ్యత తదితర అంశాలను వారికి సీఎం చంద్రబాబు సోదాహరణగా వివరించారు.


ఇక ఈ ఏడాది నవంబర్‌లో విశాఖపట్నం వేదికగా పెట్టుబడుల సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు సైతం నిర్వహించారు. అదే విధంగా ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ సంస్థలను సీఎం చంద్రబాబు సందర్శించిన విషయం విదితమే. ఈ సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట.. మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్‌, పి నారాయణతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ పర్యటనను ముగించుకుని జులై 30వ తేదీన చంద్రబాబు, మంత్రులు లోకేష్, టీజీ భరత్‌లు అమరావతికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా

విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్

For More National News And Telugu News

Updated Date - Aug 06 , 2025 | 04:57 PM