Share News

Supreme Court: ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా

ABN , Publish Date - Aug 06 , 2025 | 03:14 PM

ప్రభుత్వ పథకాల్లో సీఎం ఫోటోలను ఉపయోగించే విధాన్ని దేశమంతా అనుసరిస్తోందని, పిటిషనర్‌కు నిజంగానే అంత ఆందోళన ఉంటే ఒక పార్టీనే ఉద్దేశించి కాకుండా అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలతో ఉన్న పథకాలను ఎందుకు సవాలు చేయలేదని సుప్రీంకోర్టు నిలదీసింది.

Supreme Court: ఒక పార్టీని టార్గెట్ చేస్తారా.. ఎంపీపై సుప్రీం అసహనం, రూ.10 లక్షల జరిమానా
Supreme court

న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేరు వాడుకోవడంపై మద్రాసు హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం నాడు తోసిపుచ్చింది. ప్రభుత్వ పథకాల్లో సీఎం ఫోటోలను ఉపయోగించే విధానాన్ని దేశమంతా అనుసరిస్తోందని, పిటిషనర్‌కు నిజంగానే అంత ఆందోళన ఉంటే ఒక పార్టీనే ఉద్దేశించి కాకుండా అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నేతలతో ఉన్న పథకాలను ఎందుకు సవాలు చేయలేదని నిలదీసింది. 'మీ రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వేదికలు చేయవద్దు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషన్ వేసిన అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగంకు రూ.10 లక్షల జరిమానా విధించింది.


'విత్ యు స్టాలిన్' పేరుతో నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాన్ని ఇటీవల మద్రాసు హైకోర్టులో షణ్ముగం సవాలు చేశారు. దీనిపై ప్రజా సంక్షేమ పథకాల్లో జీవించి ఉన్న నేతల పేర్లు వాడొద్దంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై సీజేఐ బీఆర్ గవాయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. రాజకీయ నేతల పేర్లతో ఉన్న పథకాలపై గతంలో ఇచ్చిన తీర్పుల్లో ఎలాంటి న్యాయపరమైన నిషేదాజ్ఞలు లేవన్నారు.


దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, పలు ప్రభుత్వ పథకాల్లో సీఎంలు, ప్రధాని ఫోటోలను ఉపయోగించే విధానాన్ని దేశమంతా అనుసరిస్తోందని, ఇందుకు సుప్రీంకోర్టు కూడా గతంలో అనుమతిచ్చిందని పేర్కొంది. రాజకీయ పోరాటాల కోసం కోర్టులను వేదికలు చేయవద్దని అసహనం వ్యక్తం చేస్తూ మద్రాసు హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చింది.


ఇవి కూడా చదవండి..

విమానాశ్రయాలకు ఉగ్రముప్పు.. హై అలర్ట్

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 06 , 2025 | 04:43 PM